Begin typing your search above and press return to search.

అమెరికా డబుల్ గేమ్: ఇరాన్‌కు ఒక నీతి.. పాకిస్థాన్‌కు మరో నీతా?

ఒక దేశం అణు బాంబు తయారు చేస్తోందన్న అనుమానంతో దానిపై దాడి చేసే అమెరికా, ఇప్పటికే అణు బాంబులు ఉండి, వాటిని ఉగ్రవాదుల చేతుల్లో పెడతామని బెదిరించే పాకిస్థాన్‌ను ఎందుకు వెనకేసుకొస్తోంది?

By:  Tupaki Political Desk   |   1 March 2026 2:51 PM IST
అమెరికా డబుల్ గేమ్: ఇరాన్‌కు ఒక నీతి.. పాకిస్థాన్‌కు మరో నీతా?
X

లోకంలో ఎక్కడ ఏ గొడవ జరిగినా నేనున్నాను అంటూ వచ్చే అమెరికా, కొన్ని విషయాల్లో మాత్రం ఎందుకు మౌనంగా ఉంటుందో ఎవరికీ అర్థం కాదు. ముఖ్యంగా ఉగ్రవాదం విషయంలో అమెరికా చూపిస్తున్న వివక్ష ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. ‘ఇదేం నీతి.. పాకిస్థాన్ ఉగ్రవాదం మీకు కనిపించడం లేదా ట్రంప్?’ అని భారతీయులంతా ముక్తకంఠంతో ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే, ఇరాన్ విషయంలో ఒకలా, పాకిస్థాన్ విషయంలో మరోలా వ్యవహరించడం అమెరికాకు అలవాటుగా మారిపోయింది.

ఇరాన్ మీద అంత కోపం ఎందుకు?

అమెరికా వాదన ప్రకారం.. ఇరాన్ మిడిల్ ఈస్ట్‌లో ఉగ్రవాదులతో చేతులు కలిపి అశాంతికి కారణం అవుతోంది. అంతేకాకుండా, రహస్యంగా న్యూక్లియర్ బాంబులు (అణు బాంబులు) తయారు చేస్తోందని అమెరికా ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. అందుకే ఆ దేశంపై దాడులు చేసింది, ఏకంగా వారి సుప్రీం లీడర్‌ను కూడా వదిలిపెట్టలేదు. ‘ప్రపంచ శాంతి కోసం మేము ఈ పని చేస్తున్నాం’ అని అమెరికా బీరాలు పోతుంది. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనుకోవడం మంచిదే, కానీ అదే సూత్రం పాకిస్థాన్‌కు ఎందుకు వర్తించడం లేదన్నదే ఇక్కడ అసలైన ప్రశ్న.

పాకిస్థాన్ విషయం వచ్చేసరికి ఏమైంది?

పాకిస్థాన్ గడ్డ మీద ఉగ్రవాద కర్మాగారాలు నడుస్తున్నాయని లోకమంతటికీ తెలుసు. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా లాంటి భయంకరమైన ఉగ్రసంస్థలను పాక్ ఎలా పెంచి పోషిస్తోందో భారత్ వందల సార్లు ఆధారాలతో సహా నిరూపించింది. ముంబై దాడుల నుంచి పుల్వామా వరకు ప్రతి చోటా పాక్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. అయినా సరే, అమెరికా పాకిస్థాన్ మీద ఇరాన్ మీద చూపించినంత కఠినత్వం చూపించదు. పైగా ఏదో ఒక సాకుతో పాక్‌కు ఆర్థిక సాయం చేయడం, ఆయుధాలు ఇవ్వడం చేస్తూనే ఉంటుంది.

మన ఆవేదన ఏంటంటే..?

ఒక దేశం అణు బాంబు తయారు చేస్తోందన్న అనుమానంతో దానిపై దాడి చేసే అమెరికా, ఇప్పటికే అణు బాంబులు ఉండి, వాటిని ఉగ్రవాదుల చేతుల్లో పెడతామని బెదిరించే పాకిస్థాన్‌ను ఎందుకు వెనకేసుకొస్తోంది? భారత్ ఏళ్లుగా ఉగ్రవాదంతో పోరాడుతోంది. మన సైనికులు, సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇవన్నీ అమెరికాకు కనిపించడం లేదా? లేక తమ స్వార్థ ప్రయోజనాల కోసం పాకిస్థాన్‌ను ఒక పావులా వాడుకుంటోందా? అనే అనుమానం కలగక మానదు.

ఉగ్రవాదం అనేది ఏ దేశంలో ఉన్నా అది మానవాళికే ముప్పు. ఇరాన్ ఉగ్రవాదం చెడ్డది, పాకిస్థాన్ ఉగ్రవాదం మంచిది అనుకోవడం అమెరికా చేస్తున్న పెద్ద పొరపాటు. నిజంగానే ట్రంప్ సర్కార్ ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టాలని అనుకుంటే, ముందుగా పాకిస్థాన్ లాంటి దేశాలకు ఇస్తున్న సపోర్ట్ నిలిపివేయాలి. లేకపోతే, అమెరికా చెప్పే శాంతి మాటలు కేవలం నీటి మూటలే అని ప్రపంచం నవ్వుకుంటుంది. మన పొరుగు దేశం చేస్తున్న అరాచకాలను చూసీచూడనట్లు వదిలేస్తే, రేపు ఆ సెగ అమెరికాకు కూడా తగలక తప్పదు.