ఘోర ప్రమాదం షాకింగ్ వీడియో... గాల్లో ఎగిరిపడిన బైకర్!
మహారాష్ట్రలో శుక్రవారం రాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు నడుపుతున్న డ్రైవర్ కి సడన్ గా గుండెపోటు రావడంతో.. ఆ కారు నియంత్రణ కోల్పోయింది.
By: Raja Ch | 22 Nov 2025 7:00 PM ISTమహారాష్ట్రలో శుక్రవారం రాత్రి సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు నడుపుతున్న డ్రైవర్ కి సడన్ గా గుండెపోటు రావడంతో.. ఆ కారు నియంత్రణ కోల్పోయింది. ఆ సమయంలో ఎదురుగా వస్తోన్న టూవీలర్స్ పైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఓ బైకర్ గాల్లో ఎగిరి ఫ్లై ఓవర్ పై నుంచి కింద పడిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు షాకింగ్ గా మారాయి.
అవును... మహారాష్ట్రలోని థానే జిల్లాలోని అంబర్ నాథ్ ఫ్లై ఓవర్ పై శుక్రవారం సాయంత్రం 7:15 గంటల సమయంలో ఓ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా, అనేకమంది గాయపడ్డారు. పట్టణం తుర్పు, పశ్చిమ ప్రాంతాలను కలిపే ఫ్లైఓవర్ పై ఈ ప్రమాదం జరగ్గా.. ఓ బైకర్ ఎగిరి ఫ్లై ఓవర్ కింద పడిపోయాడు!
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... శివసేన పార్టీకి చెందిన స్థానిక ఎన్నికల అభ్యర్థి కిరణ్ చాబే.. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారం నుంచి తిరిగి వస్తుండగా.. ఆమె కారు డ్రైవర్ లక్ష్మణ్ షిండే గుండెపోటుకు గురయ్యారు. దీంతో.. వారు ప్రయాణిస్తున్న ఆ వాహనం నియంత్రణ కోల్పోయింది.
ఈ సమయంలో ఫ్లైఓవర్ పై ముందున్న బైక్ లు, ఇతర వాహనాలను అత్యంత వేగంగా ఢీకొట్టింది! దీంతో.. ఓ బైకర్ ఎగిరి ఫ్లైఓవర్ కింద పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనలో డ్రైవర్ లక్షణ్ షిండే తో పాటూ మరో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు.
ఈ సందర్భంగా స్పందించిన అంబర్ నాథ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శైలేష్ కాలే... ఆ కారు సుమారు 4, 5 వాహనాలను ఢీకొట్టిన తర్వాత బోల్తా పడిందని తెలిపారు! ఈ ప్రమాదంలో కారు డ్రైవర్, మరో వ్యక్తితో పాటు స్థానిక యువకులు సుమిత్ చలానీ, శైలేష్ జాదవ్ లు మృతి చెందినట్లు వెల్లడించారు.
