Begin typing your search above and press return to search.

అవినీతి అనకొండ..ఈ 'అంబేడ్కర్' కేసు దోపిడీకి నిదర్శనం!

ఒక చిన్న పని జరగాలన్నా లంచం ఇవ్వాల్సిందే. కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలంటే, మీటరు మార్చాలంటే, చివరికి ఒక ఉద్యోగి బదిలీ కావాలన్నా లంచం లేకుండా పని జరగడం లేదు.

By:  A.N.Kumar   |   17 Sept 2025 11:01 AM IST
అవినీతి అనకొండ..ఈ అంబేడ్కర్ కేసు దోపిడీకి నిదర్శనం!
X

ఒక చిన్న పని జరగాలన్నా లంచం ఇవ్వాల్సిందే. కొత్త విద్యుత్ కనెక్షన్ కావాలంటే, మీటరు మార్చాలంటే, చివరికి ఒక ఉద్యోగి బదిలీ కావాలన్నా లంచం లేకుండా పని జరగడం లేదు. ఇవన్నీ ఒక సాధారణ వేతనంతో సాధ్యం కానివి. రెండు కోట్ల రూపాయల నగదు, కిలోల కొద్దీ బంగారం, ఖరీదైన భవనాలు, విలాసవంతమైన కార్లు.. ఇవన్నీ ఒక అధికారి ఇంట్లో దొరకడం అనేది వ్యక్తిగత అవినీతి మాత్రమే కాదు, మొత్తం వ్యవస్థ పతనానికి సూచన.

*అంబేద్కర్ అవినీతి చిట్టా ఇదీ..

అంబేడ్కర్‌ తోపాటు ఆయన బంధువుల ఇంట్లో బయటపడ్డ అక్రమాస్తుల జాబితా ఒక సాధారణ అధికారి సంపాదనకి చాలా దూరంలో ఉందని స్పష్టంగా కనపడుతోంది. రూ.2 కోట్ల రూపాయలు ఇళ్లలో దాచుకోవడం అంటే అవినీతి పరిమాణం ఎంత పెరిగిందో అర్థమవుతోంది. ఇంత పెద్ద మొత్తం బ్యాంకుల్లో కాకుండా ఇంట్లో ఉంచడం వెనక నల్లధనాన్ని దాచిపెట్టే ఉద్దేశమే ఉంటుంది. శేరిలింగపల్లి, గచ్చిబౌలి, హైదరాబాద్‌ ప్రధాన ప్రాంతాల్లో ఇళ్లు, భవనాలు, ఖాళీ ప్లాట్లు కలిగి ఉండటం.. అది కూడా ఏకంగా ఆరుగురి ఇళ్లతో పాటు 5 అంతస్తుల భవనం ఉన్నట్టు బయటపడటం.. అవినీతి ద్వారా సంపాదించిన సొమ్మును ప్రాపర్టీల్లోకి మార్చారనే అర్థం వస్తోంది. హైఎండ్ కార్లు, కిలోల కొద్దీ బంగారు ఆభరణాలు కలిగి ఉండటం.. అక్రమ ధనాన్ని విలాసవంతమైన వస్తువులుగా మార్చుకున్నట్లు చూపిస్తోంది.

బ్యాంకు డిపాజిట్లు, షేర్లలో పెట్టుబడులు, ఖాతాల్లో లక్షల రూపాయల బ్యాలెన్స్ ఉండటం అంటే అక్రమ డబ్బును క్రమబద్ధీకరించి లాభాల రూపంలో మలచుకోవడానికి చేసిన ప్రయత్నం అని చెప్పవచ్చు. 10 ఎకరాల భూమి కొనుగోలు కూడా డబ్బును సురక్షిత పెట్టుబడిగా మార్చుకోవడానికి చేసిన ప్రయత్నమే.ఒక కారులో దాచిన రూ.5.5 లక్షలు కనుగొనడం, అవినీతి పరిమాణం ఎంత విస్తృతంగా ఉందో తెలియజేస్తోంది. ఏకంగా 15 చోట్ల 5 బృందాలు దాడులు జరపాల్సిన పరిస్థితి రావడం.. అక్రమాస్తుల జాలం ఎంత విస్తరించిందో తెలిపింది.

ప్రజా సేవకుడు అనే పదం ఒకప్పుడు గౌరవానికి.. నిబద్ధతకు ప్రతీకగా ఉండేది. కానీ నేడు, ఆ పదానికి విలువ తగ్గిపోతోంది. విద్యుత్ శాఖ ఏడీఈ అంబేడ్కర్ అరెస్టు, దాని వెనుక బయటపడిన అక్రమాలు చూస్తుంటే.. ప్రజా సేవ పేరుతో జరుగుతున్న దోపిడీ ఎంత విస్తృతంగా ఉందో అర్థమవుతోంది. ఇది కేవలం ఒక అధికారి కథ కాదు, వ్యవస్థలో పాతుకుపోయిన అవినీతికి నిలువుటద్దం.

ప్రజలు వేల రూపాయల కోసం బ్యాంకు ఏటీఎంల ముందు నిలబడిన రోజుల్లో ఒక అధికారి వద్ద కోట్లాది రూపాయలు దొరకడం నిజంగా బాధాకరం. ఇది ఒక అంబేడ్కర్ కథ మాత్రమే కాదు. వెలుగులోకి రాని ఇంకా ఎందరో అంబేడ్కర్లు చీకట్లో దాగి ఉన్నారని ఈ సంఘటన గుర్తు చేస్తోంది.

ఈ కేసును ఏసీబీ అధికారులు వెలుగులోకి తీసుకురావడం అభినందనీయం. అయితే ఇది ఆరంభమా లేక ముగిసిందా అనేది ప్రధాన ప్రశ్న. ఇలాంటి కేసులు బయటపడినప్పుడు, చాలా సందర్భాల్లో అవి సంవత్సరాల తరబడి నడుస్తూ చివరికి నిందితులకు స్వల్ప శిక్షలు మాత్రమే పడతాయి. ఈ దురదృష్టకరమైన చరిత్ర మన ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది.

ప్రజల నమ్మకాన్ని మళ్లీ గెలుచుకోవాలంటే.. కేవలం అరెస్టులు సరిపోవు. కఠిన చర్యలు, వేగవంతమైన విచారణ, కఠినమైన శిక్షలు తప్పనిసరి. లేకపోతే ప్రతి 'అనకొండ' వెనుక మరిన్ని 'అవినీతి నాగులు' పుట్టుకొస్తూనే ఉంటాయి. అంబేడ్కర్ కేసు మనకు ఇచ్చిన పాఠం ఒకటే.. ప్రజా సేవలో అవినీతి ఒక చిన్న సమస్య కాదు, అది సమాజాన్ని నాశనం చేసే ఒక మహమ్మారి. దాన్ని మొదట్లోనే నిర్మూలించకపోతే, సమాజ శరీరం మొత్తం కుళ్లిపోతుంది.