గల్లా మాధవి వర్సెస్ అంబటి మౌనిక ?
ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అని అంటారు. అయితే రాజకీయాల్లో మాత్రం ఈ సామెత అసలు పనికిరాదు ఊహలు ఎపుడూ ఆకాశాన్ని అంటి సాగుతూంటాయి.
By: Satya P | 5 Feb 2026 9:40 AM ISTఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అని అంటారు. అయితే రాజకీయాల్లో మాత్రం ఈ సామెత అసలు పనికిరాదు ఊహలు ఎపుడూ ఆకాశాన్ని అంటి సాగుతూంటాయి. ఆచరణలో ఏమి జరిగినా జరగకపోయినా ప్రచారాలూ ఊహాగానాలు ఒక రేంజిలో సాగుతూంటాయి. ఇపుడు అలాంటి వింత అయిన ప్రచారం అయితే హోరెత్తుతోంది. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎపిసోడ్ ఏపీ రాజకీయాల్లో ఇపుడు హాటెస్ట్ టాపిక్. వైసీపీ అధినేత జగన్ అంబటి ఇంటికి వెళ్ళి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఇద్దరు కుమార్తెలతో ఆయన మాట్లాడారు. అండగా ఉంటాను అని చెప్పారు. ఇక జగన్ ప్రెస్ మీట్ లో ఆయన పక్కనే అంబటి మౌనిక ఉన్నారు. దాంతో పాటుగా ఆమె జగన్ కి తమ ఇంటి దాడికి సంబంధించిన అంశాలను పత్రాలను ఫోటోలను అందిస్తూ సహకరించారు. జగన్ సైతం ఆమెకి విశేష ప్రాధాన్యత ఇచ్చారు.
గుంటూరు పశ్చిమలో :
ఇదిలా ఉంటే గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఇంచార్జిగా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు ఆయనకు గత మూడు సార్లూ సత్తెనపల్లి అసెంబ్లీ నుంచి టికెట్ ఇచ్చిన వైసీపీ 2029 లో పశ్చిమ నుంచి నిలబెట్టాలని చూస్తోంది. దానికి తగినట్లుగా అంబటి ఈసారి సంక్రాంతి సంబరాలను కూడా పశ్చిమలో జరిపారు. తన పొలిటికల్ యాక్టివిటీని అక్కడకు మార్చారు. ఇక అంబటి రాంబాబు 2029లో పోటీకి ఉత్సాహంగా ఉన్నారు అన్నది ఇప్పటిదాకా అంతా అనుకుంటున్న నేపధ్యం ఉంది. అయితే తాజాగా మారిన దానిని బట్టి వైసీపీ నేతలు మరో విధంగా ప్రచారం మొదలెట్టేశారు.
మాధవికి ధీటుగా :
అంబటి ఇంటి మీదకు దాడికి వచ్చిన పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యేని ఓడించాలని వైసీపీ నేతలు అంటున్నారు. జగన్ సైతం మాధవి ప్రస్తావన తెస్తూ ఆమె ఫోటోలను మీడియా ముందు పెట్టారు. దాంతో పాటుగా మాధవి కి సరి జోడుగా అంబటి మౌనికనే వచ్చే ఎన్నికల్లో పోటీకి పెడితే పోరు రసవత్తరంగా ఉంటుందని వైసీపీ నేతలు అంటున్నారు. దాని మీదనే ప్రచారం కూడా చేస్తున్నారు. ఆమె అంబటి అరెస్ట్ తరువాత మీడియా ముందు మాట్లాడిన తీరు ఆమె జగన్ పరామర్శకు వచ్చినపుడు మాట్లాడిన విధానం అన్నీ చూసిన వారు ఆమె అంబటి వారసురాలుగా రాజకీయాల్లోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు.
వైసీపీకి ట్రాక్ రికార్డు :
ఇదిలా ఉంటే గుంటూరు పశ్చిమలో వైసీపీకి ఇప్పటిదాకా గెలుపు లేదు, మూడు ఎన్నికలు వరసగా జరిగితే మూడు సార్లూ వైసీపీ ఓటమిని చవి చూసింది. 2029 లో అంబటిని నిలబెట్టాలన్న దాని మీద ఆలోచనలు ఉన్నాయి కానీ గెలుపు గుర్రాలు కూడా చూస్తారు అన్న మాట అప్పట్లో ఉంది. ఇపుడు ఏకంగా అంబటి కుమార్తె మౌనిక ధీటుగా రాజకీయాల్లో నిలబడితే మాత్రం ఆమెకు చాన్స్ కచ్చితంగా ఉండొచ్చు అని అంటున్నారు. అంబటి సైతం తన కుమార్తె పొలిటికల్ ఎంట్రీకి నూరు శాతం సహకరిస్తారు అని అంటున్నారు. దాంతో గల్లా మాధవి మీద వైసీపీ కూడా మహిళా అభ్యర్ధినే నిలబెట్టి ఈసారి అయినా పశ్చిమం గెలుచుకునేందుకు వీలు ఉంటుందని మహిళా కార్డుతో పాటు విక్టిమ్ కార్డు కూడా పండుతుందని వైసీపీ లో అయితే ప్రచారంగా ఉంది. దీని మీదనే సోషల్ మీడియాలో చర్చ అయితే సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
