అంబటి ఆగ్రహం.. ఎవరి మీద.. ఎందుకు?
వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. గత రెండు రోజులుగా మీడియా ముందుకు రావడం లేదు.
By: Garuda Media | 8 Aug 2026 8:00 PM ISTవైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. గత రెండు రోజులుగా మీడియా ముందుకు రావడం లేదు. పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొనడం లేదు. దీంతో ఏం జరిగిందన్న విషయం చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఇటీవల కాలంలో అంబటి నిరంతరం మీడియా ముందుకు వస్తున్నారు. కూటమి సర్కారుపై విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో పార్టీ చేపట్టే కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు.
ఇంతలోనే ఆయన అలకబూనడం, పార్టీ కార్యక్రమాలకు, మీడియాకు కూడా దూరంగా ఉండడం చర్చనీ యాంశంగా మారింది. దీనికి కారణం ఏంటి? ఆయన ఎవరిమీద అలిగారన్నది ఆసక్తిగా మారింది. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అంబటి.. తర్వాత.. కొంత ఊపు తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే ఆయన డీఎస్సీ -2025లో అక్రమాలుజరిగాయని ఆరోపిస్తున్న పార్టీకి దన్నుగా ఆయన పాదయాత్రకు రెడీ అయ్యారు.
సత్తెనపల్లి నుంచి మంగళగిరిలోని డీజీపీ ఆఫీసు వరకు కూడా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళికను కూడా రెడీ చేసుకున్నారు. కార్యకర్తలను కూడా సిద్దం చేశారు. అయితే.. అనూహ్యంగా ఈ పాదయాత్ర చేపట్టవద్దంటూ పార్టీ కేంద్ర కార్యాలయం ఆయనకు సమాచారం పంపింది. దీనిని అంబటే మీడియాకు వెల్లడించారు. పార్టీ రెండు రోజులు వాయిదా వేయమందని చెప్పారు. కానీ, ఆ తర్వాత కూడా ఈ వ్యవహారంపై పార్టీ ఎలాంటి ప్రకటన చేయలేదు.
దీంతో అంబటి హర్ట్ అయ్యారని అంటున్నారు వైసీపీ నాయకులు. వైసీపీలో సహజంగానే జగన్ సెంట్రిక్ రాజకీయాలు జరుగుతాయి. ఆయనకు మేలు జరుగుతుందని అనుకుంటే ఒక విధంగా.. లేకపోతే మరోవి ధంగా రాజకీయాలు ఉంటాయి. అంబటి పాదయాత్ర వెనుక ఆయన ఇమేజ్ మాత్రమే ఉండడం.. జగన్ కంటే కూడా.. అంబటి ఇమేజ్ పెరుగుతుందన్న అంచనా వేసుకోవడతో పాదయాత్రకు పార్టీ అంగీకరించ లేదని ప్రచారం జరుగుతోంది. ఇదే.. ఇప్పుడు అంబటి అలకకు కారణమని అంటున్నారు. అయితే.. ఆయన పార్టీపై ఎలాంటి విమర్శలు, వ్యాఖ్యలు చేయకపోయినా.. మౌనంగా ఉన్నారు. గత రెండు రోజులుగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు.
