Begin typing your search above and press return to search.

అంబటి ఉండవల్లి గుంటూర్ టూర్ ....మ్యాటరేంటి ?

ఈ ఇద్దరు నేతలు తాజాగా గుంటూరులో టూర్లు వేశారు. ఒకే కారులో తిరిగారు. గంటల తరబడి కబుర్లు చెప్పుకున్నారు. అంతే కాదు ఈ ఇద్దరూ సీనియర్ నాయకులుగా ఉన్న వారిని కలుసుకుని ముచ్చట్లు పెట్టారు.

By:  Satya P   |   15 Dec 2025 9:31 AM IST
అంబటి ఉండవల్లి గుంటూర్ టూర్ ....మ్యాటరేంటి ?
X

అంబటి రాంబాబు వైసీపీకి చెందిన మాజీ మంత్రి. వైఎస్సార్ అంటే భక్తితో కూడిన గౌరవంతో కూడిన ఆరాధనాభావం. అందుకే జగన్ వెంటనే ఉన్నారు. నాటి నుంచి నేటి దాకా వైసీపీ జెండాని దించని నాయకుడిగా ఉన్నారు. ఈ మధ్యలో ఎందరో వచ్చి వెళ్ళిపోయారు కానీ అంబటి మాత్రం ఎక్కడా తగ్గలేదు, పైగా జగన్ తోనే తన రాజకీయం అని కూడా భావించారు. జగన్ ఆయనకు ఎక్కడ సీటు ఇచ్చినా ఎక్కడికి షిఫ్ట్ చేసినా ఏ పదవి ఇచ్చినా మారు మాట్లాడకుండా వైసీపీ కోసం పనిచేస్తున్న వారిగా అంబటి రాంబాబునే చెప్పుకోవాలి. ఒక విధంగా విధేయతకు మారు పేరుగా చెబుతారు.

ఉండవల్లి అంటే :

ఇక మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గురించి అందరికీ తెలిసిందే. ఆయన రాజకీయాలు వదిలేశాను అని చెప్పినా రాజకీయ విశ్లేషణలు మాత్రం చేస్తూ ఉంటారు. వైఎస్సార్ కుమారుడిగా జగన్ మీద ప్రేమ ఉందని అంటూనే విమర్శలు మాత్రం గట్టిగానే చేస్తూ వస్తున్నారు. ఆయన వైఎస్సార్ కి అత్యంత సన్నిహితుడు అయిన నేతగా గుర్తింపు పొందారు. అంబటి ఉండవల్లి ఇద్దరూ కూడా సమకాలీకులు, వైఎస్సార్ అంటే ఎంతో ఇష్టం ఉన్న నేతలు. ఇక ఈ ఇద్దరి నేతల మధ్య అవ్యాజమైన అభిమానం ఉంది. అనుబంధం ఉంది. ఇద్దరూ మంచి మాటకారులే, మీడియా ముందుకు వస్తే గట్టిగానే మాట్లాడుతారు, ఇద్దరూ లాయర్లే. ఇద్దరూ తమను తాను డిపెండ్ చేసుకుంటూ ప్రత్యర్ధులను ఇబ్బంది పెట్టడంతో దిట్టలే..

గుంటూరులో టూర్లు :

ఈ ఇద్దరు నేతలు తాజాగా గుంటూరులో టూర్లు వేశారు. ఒకే కారులో తిరిగారు. గంటల తరబడి కబుర్లు చెప్పుకున్నారు. అంతే కాదు ఈ ఇద్దరూ సీనియర్ నాయకులుగా ఉన్న వారిని కలుసుకుని ముచ్చట్లు పెట్టారు. మాజీ ఎంపీ రాజకీయంగా కురు వృద్ధుడు అయిన రాయపాటి సాంబశివరావు ఇంటికి వెళ్ళి మరీ పెద్దాయనను పలకరించి ఎంతో సేపు మాట్లాడారు, అలాగే రైతు ఉద్యమ నాయకుడు, మాజీ ఎంపీ ఎలమంచిలి శివాజీ ఇంటికి వెళ్ళి మరీ ఆయనతోనూ ఎన్నో కబుర్లు ఆడుకున్నారు. ఇలా ఇద్దరు నేతలు కలియతిరిగారు.

వీడియో బైట్ తో :

ఈ వివరాలు అన్నీ అంబటి వీడియో బైట్ రూపంలో మీడియాకు వదిలారు. తాను ఉండవల్లి గుంటూరులో ఒక రోజంతా గడిపామని చెప్పారు. ఉండవల్లిది తనది రాజకీయంగా ఒకే దారి అని కాంగ్రెస్ దారి అని చెప్పారు. ఆ తరువాత తాను వైసీపీలోకి వచ్చేశాను కానీ ఉండవల్లి రాజకీయాల నుంచి విరమించుకున్నారు అని కూడా చెప్పారు. ఉండవల్లిని నిజాయతీపరుడు అయిన నేతగా కొనియాడారు. పాత ముచ్చట్లు మిత్రులము అయిన ఇద్దరమూ నెమరేసుకున్నామని కూడా అంబటి చెప్పారు

వైసీపీలోకి ఉండవల్లి :

ప్రస్తుతం ఇదే ప్రచారంలో ఉంది. అంబటి ఉండవల్లి భేటీ అయ్యారు కాబట్టి ఉండవల్లి వైసీపీలోకి వచ్చేసినట్లే అని అంటున్నారు. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అలాగే పర్సనల్ భేటీ అని అంబటి రాంబాబు చెబుతున్నారు. పైగా ఉండవల్లి ఏ పార్టీలోనూ చేరను అని ఎంతో కాలం నుంచి చెబుతున్నారు. సో ఇది ఇద్దరు మిత్రుల భేటీగానే చూడాలి తప్ప మరేమీ కాదని అంటున్నారు. అదన్న మాట మ్యాటర్.