Begin typing your search above and press return to search.

కాపులం.. కదంతొక్కనున్నాం.. మాజీ మంత్రి అంబటి ఆసక్తికర ట్వీట్!

ఏపీలో కుల రాజకీయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో ప్రధాన సామాజికవర్గమైన కాపులను ఆకట్టుకునేలా అధికార, విపక్షాలు ఎత్తుకుపైఎత్తు వేస్తున్నాయి

By:  Tupaki Political Desk   |   22 Jun 2026 10:07 AM IST
కాపులం.. కదంతొక్కనున్నాం.. మాజీ మంత్రి అంబటి ఆసక్తికర ట్వీట్!
X

ఏపీలో కుల రాజకీయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ప్రధానంగా రాష్ట్రంలో ప్రధాన సామాజికవర్గమైన కాపులను ఆకట్టుకునేలా అధికార, విపక్షాలు ఎత్తుకు పై ఎత్తు వేస్తున్నాయి. కాపు సామాజికవర్గంలో మెజార్టీ ప్రజలు ప్రభుత్వంలో కీలక భాగస్వామి అయిన జనసేన పార్టీకి మద్దతుగా నిలుస్తున్నారనే ఆలోచనతో విపక్షం వైసీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని అంటున్నారు. పార్టీలోని కాపు నేతలను రంగంలోకి దింపి ఆ సామాజికవర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి నిదర్శనంగా ఆదివారం కోనసీమ జిల్లాలో నిర్వహించిన వైసీపీ కాపు నేతల సమావేశాన్ని చెబుతున్నారు. ఇక ఈ కీలక భేటీని ఉద్దేశిస్తూ పార్టీకి చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు ‘ఎక్స్’లో ఆసక్తికర ట్వీట్ చేశారు.

‘‘కాపులం.. కలుస్తున్నాం.. కదులుతున్నాం.. కదంతొక్కనున్నాం.. కూటమి ఓటమి వరకు!’’ అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. కాపు కులానికే చెందిన అంబటి చాలా రోజులుగా తమ సామాజికవర్గంలో పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో వైసీపీలో కాపు నేతలు అంతా ఏకతాటిపైకి వస్తూ సామాజికవర్గం ఓట్ల చీలకకు ప్లాన్ చేస్తున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఏ చిన్న సంఘటనను వదలకూడదని నిర్ణయించారని అంటున్నారు. దీంతో గతంలో అంబటిపై జరిగిన దాడి నుంచి తాజా పరిణామాల వరకు కాపులు ఏకతాటిపై నిలిచేలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు.

అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు తాము పోరాటం చేస్తామని ప్రకటించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కోనసీమ జిల్లాలో జరిగిన కాపు నేతల సమావేశం అనంతరం చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. కాపులు అందరూ కలుస్తామని, కలిసే కదులుతామని చెప్పడంతోపాటు కూటమి ఓటమి వరకు కదం తొక్కనున్నామని అంబటి వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ అవుతోంది. మరోవైపు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలపైనా చర్చ జరుగుతోంది. కాపు సామాజికవర్గానికి చెందిన డిప్యూటీ సీఎం పవన్.. తనను ఓ కులానికి మాత్రమే పరిమితం చేయొద్దని రెండు రోజుల క్రితమే స్పష్టం చేశారు. అంతేకాకుండా కుల రాజకీయాలను అధిగమిస్తే కానీ రాష్ట్రం అభివృద్ధి చెందదని ఆయన వ్యాఖ్యానించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుందని అంటున్నారు.

అటు పవన్ వ్యాఖ్యలు.. ఇటు వైసీపీ కాపు నేతల చర్చలు చూస్తుంటే రాష్ట్రం రాజకీయం అంతా ఆ సామాజికవర్గం చుట్టూనే తిరుగుతుందనే భావన కనిపిస్తోంది. రాష్ట్రంలో దాదాపు 25 శాతం ఓట్లు ఉన్న కాపులు సంఘటితం కావాలని ఆ సామాజికవర్గం వారు బలంగా కోరుకుంటున్నారు. ప్రస్తుతం టీడీపీ, వైసీపికి రెండు సామాజికవర్గాల మద్దతు ఉండగా, జనసేనకు కాపులలో మెజార్టీ ప్రజలు మద్దతు ఉందని అంటున్నారు. అయితే జనసేన స్వతంత్రంగా కాకుండా టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల అధికార కూటమికి అడ్వాంటేజ్ అవుతోందని భావిస్తున్న విపక్షం.. జనసేన నుంచి కాపులను దూరం చేయడమో లేక వీలైనంత ఎక్కువగా చీల్చడమో చేస్తేనే వచ్చే ఎన్నికల్లో తమకు మేలు జరుగుతుందని భావిస్తోందని అంటున్నారు. దీంతో కాపు నేతలకు పార్టీలో ఫ్రీ హ్యాండ్ ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఈ విషయాన్ని తెలియజేసేలా అంబటి ట్వీట్ ఉందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.