నాడు లేనిది నేడు తప్పా..? అగ్గిరాజేస్తున్న వైసీపీ నేత అంబటి!
తనతో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడటాన్ని నేరంగా పరిగణించడాన్ని ప్రశ్నిస్తూ మాజీ మంత్రి అంబటి చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది.
By: Tupaki Political Desk | 28 July 2026 6:12 PM ISTఅధికార టీడీపీలో అగ్గిరాజేసేలా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నలు సంధిస్తున్నారు. తనతో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా మాట్లాడటాన్ని నేరంగా పరిగణించడాన్ని ప్రశ్నిస్తూ మాజీ మంత్రి అంబటి చేసిన ట్వీట్ హాట్ టాపిక్ అవుతోంది. కొద్దిరోజుల క్రితం జనసేన మాజీ నేత దాసరి రాము ఆధ్వర్యంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ నిర్వహించగా, ఈ సమావేశానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు, టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా హాజరయ్యారు. ఆ సమయంలో కాపులకు అన్యాయం జరుగుతోందని అధికార పార్టీ ఎమ్మెల్యే మాట్లాడటం టీడీపీ కేడర్ తోపాటు పార్టీ అధిష్టానానికి ఆగ్రహం తెప్పించింది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యే బొండాకు అధిష్టానం నోటీసులు ఇచ్చింది అని ప్రచారం జరిగింది. ఇది టీడీపీ అంతర్గత వ్యవహారం కాగా, వైసీపీకి చెందిన మాజీ మంత్రి అంబటి జోక్యం చేసుకోవడమే కాకుండా, ఆయన సోషల్ మీడియా వేదికగా సంధించిన ప్రశ్నలు తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి.
ఎమ్మెల్యే బొండా ఉమా, మాజీ మంత్రి అంబటి రాంబాబు కలవడాన్ని తప్పుపడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ మాజీ నేత వి.విజయసాయిరెడ్డి కలిసి ఉన్న ఫొటోను మాజీ మంత్రి అంబటి ఎక్స్ లో షేర్ చేశారు. ఒకవైపు చంద్రబాబు, విజయసాయిరెడ్డి ఫొటో ఉంచి పక్కనే బొండా ఉమా, అంబటి రాంబాబు మాట్లాడుకున్న ఫొటోను పెట్టారు. దీనికి క్యాప్షన్ గా ఒకే ఒక ప్రశ్నను సంధించారు. ‘నాటి ఆ కలయికలో లేని తప్పు.. నేటి ఈ కలయికలో మాత్రమే తప్పు ఎలా అయింది’’ అంటూ రాసుకొచ్చారు. గుంటూరులో ముద్రగడ సంస్మరణ సభ తర్వాత పార్టీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు విపక్ష వైసీపీ నేతలతో వేదిక పంచుకునే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
దీంతో ముఖ్యమంత్రి చంద్రబాబు, విజయసాయిరెడ్డి కలిసి ఉన్న ఫొటోను షేర్ చేసిన అంబటి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు, విజయసాయిరెడ్డి కలిస్తేలేని తప్పు, తాను బొండా ఉమా కలిస్తే తప్పు అయిందా? అంటూ నిలదీశారు. విజయసాయిరెడ్డి వైసీపీలో ఉండగా, 2023 జనవరిలో ఆయనకు అల్లుడు వరసయ్యే నందమూరి తారకరత్న మరణించారు. తారకరత్న స్వయాన చంద్రబాబుకు మేనల్లుడు కావడంతో అప్పట్లో ఆ ఇద్దరు కలవాల్సివచ్చింది. అంతేకాకుండా అప్పటివరకు చంద్రబాబుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడిన విజయసాయిరెడ్డి వైఖరిలో ఆ తర్వాత మార్పు కూడా వచ్చిందని చెప్పేవారు. ఇక చంద్రబాబుతో విజయసాయిరెడ్డి సన్నిహితంగా మెలగడంతోనే ఆయనకు వైసీపీతో సంబంధాలు క్షీణించాయన్న ప్రచారం కూడా ఉంది. కానీ, మాజీ మంత్రి అంబటి ఈ విషయాల జోలికి వెళ్లకుండా చంద్రబాబు ఎవరిని కలిసినా తప్పు కాదు.. ఇతరులు మాత్రం వైసీపీ నేతలతో కలిస్తే తప్పా? అనే అర్థం వచ్చేలా ప్రశ్నించడమే హాట్ టాపిక్ అవుతోంది.
ఇక ఎక్స్ లో అంబటి పోస్టు చేసిన ఈ ఫొటోపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. చంద్రబాబు, విజయసాయిరెడ్డి భేటీకి ఇప్పుడు ఎమ్మెల్యే ఉమా, అంబటి కలవడానికి తేడా ఉందని కొందరు వ్యాఖ్యానిస్తుండగా, మరికొందరు కాపులు అంటే చంద్రబాబు కక్ష సాధిస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు. అయితే అక్కడ ఏం మాట్లాడారు? ఎలా మాట్లాడారు? అన్నదే ముఖ్యమని, ఎవరు ఎవరితో కలిశారన్నది పాయింట్ కాదంటూ మరికొందరు స్పందిస్తున్నారు. మొత్తానికి బొండా ఉమా వివాదంపై అంబటి జోక్యం చేసుకుని రాజకీయ ఉద్రిక్తతలను మరింత రగిలించారని వ్యాఖ్యానిస్తున్నారు.
