Begin typing your search above and press return to search.

చేతులు కాలాక.. అంబటి పశ్చాత్తాపం.. ఇప్పుడేం లాభం?

రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలు కేవలం వారి వ్యక్తిగతమైనవి కావు. అవి సమాజంపై, ముఖ్యంగా కేడర్లపై తీవ్ర ప్రభావం చూపుతాయి.

By:  A.N.Kumar   |   1 Feb 2026 12:15 PM IST
చేతులు కాలాక..  అంబటి పశ్చాత్తాపం.. ఇప్పుడేం లాభం?
X

రాజకీయాల్లో మాట ఒక పదునైన ఆయుధం. దాన్ని ప్రజా ప్రయోజనాల కోసం వాడితే గౌరవం.. వ్యక్తిగత దూషణలకు ఉపయోగిస్తే అగౌరవం దక్కుతాయి. తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవహారశైలిని గమనిస్తే.. "చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం" అనే సామెత అక్షరాలా వర్తిస్తుందనిపిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యల విషయంలో ఆయన వ్యక్తం చేస్తున్న 'పశ్చాత్తాపం' వెనుక నైతిక బాధ్యత ఉందా లేక కేవలం రాజకీయ రక్షణ ఉందా అన్నది చర్చనీయాంశంగా మారింది.

మాటల పదును.. మర్యాద హద్దులు

ప్రజాస్వామ్యంలో విమర్శ అనేది అభివృద్ధికి సోపానం కావాలి. కానీ దురదృష్టవశాత్తూ నేటి రాజకీయాల్లో విమర్శలు వ్యక్తిగత దూషణలుగా.. అసభ్యకర వ్యాఖ్యలుగా రూపాంతరం చెందుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిపై మాట్లాడేటప్పుడు కనీస మర్యాద పాటించకపోవడం ప్రజాప్రతినిధుల సంస్కారానికే ప్రశ్నార్థకంగా మారుతుంది. తప్పు జరిగిపోయిన తర్వాత "అలా అనకుండా ఉండాల్సింది" అని చెప్పడం బాధ్యత నుంచి తప్పించుకోవడమే తప్ప, తప్పును సరిదిద్దుకోవడం కాదు.

పశ్చాత్తాపమా? ఆత్మరక్షణనా?

టీడీపీ కార్యకర్తలపై చేసిన వ్యాఖ్యలు తప్పేనని అంగీకరిస్తూనే మరోవైపు "అరెస్టులకు భయపడను", "చట్టం నాకు తెలుసు" అంటూ న్యాయపరమైన ధైర్యాన్ని ప్రదర్శించడం చూస్తుంటే.. అక్కడ అంబటి రాంబాబు పశ్చాత్తాపం కంటే ఆత్మరక్షణే ఎక్కువగా కనిపిస్తోంది. నిజమైన పశ్చాత్తాపం వ్యక్తిగత అహంకారాన్ని తగ్గించాలి.. కానీ అంబటి మాటల్లో ఆ సంకేతాలు మృగ్యమయ్యాయి. పోలీసుల చర్యలను తప్పుబట్టడం, అధికార పార్టీ నేతల పేర్లను ప్రస్తావించడం ద్వారా ఉద్రిక్తతలను తగ్గించడానికి బదులు, రాజకీయ సెగను మరింత రాజేసే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

ప్రజాస్వామ్యానికి నష్టం

రాజకీయ నాయకులు చేసే వ్యాఖ్యలు కేవలం వారి వ్యక్తిగతమైనవి కావు. అవి సమాజంపై, ముఖ్యంగా కేడర్లపై తీవ్ర ప్రభావం చూపుతాయి. నేతలు హద్దులు దాటితే కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి ఘర్షణలకు దిగుతారు. ఇది అంతిమంగా ప్రజాస్వామ్య వ్యవస్థకే చేటు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు తమ మాటలకు కట్టుబడి ఉండాలి. తప్పు జరిగినప్పుడు సాకులు వెతకడం కంటే నిష్కపటమైన క్షమాపణ కోరడం వల్లనే నాయకత్వానికి గౌరవం పెరుగుతుంది.

పశ్చాత్తాపం అనేది కేవలం పెదాల మీద నుంచి వచ్చే మాట కాదు... అది ప్రవర్తనలో కనిపించే మార్పు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకున్నప్పుడే ఆ మాటలకు విలువ ఉంటుంది. లేదంటే చేతులు కాలాక చేసే పశ్చాత్తాపం కేవలం కాలక్షేపానికో, చట్టం నుంచి తప్పించుకోవడానికో చేసే 'రాజకీయ విన్యాసం'గానే మిగిలిపోతుంది. రాజకీయాల్లో హుందాతనం పెరగాలంటే నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

అరెస్ట్ లపై అంబటి భార్య హైకోర్టుకు..

అంబటి వ్యాఖ్యలపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో అంబటి రాంబాబు సతీమణి విజయలక్ష్మి ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమకు సరైన రక్షణ కల్పించడంలో పోలీసులు విఫలమయ్యారని, అక్రమ నిర్బంధాలు జరిగాయని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. 24 గంటల భద్రత కల్పించాలని కోర్టును కోరారు.

అంబటి రాంబాబు పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అరెస్టులకు భయపడేది లేదని, సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై తన విమర్శలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఏపీ వ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం నెలకొనగా, గుంటూరులో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.