అంబటిపై కేసు.. కోటి గళాల ఆందోళన ఎఫెక్ట్.. వాట్ నెక్ట్స్
మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు ఇతర నేతలపై పట్టాభిపురం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది.
By: Tupaki Political Desk | 13 Nov 2025 1:01 PM ISTమాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు ఇతర నేతలపై పట్టాభిపురం పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులను బెదిరించారని, తమ విధులకు ఆటంకం కలిగించారని పేర్కొంటూ బీఎన్‌ఎస్ 132, 126(2), 351(3), 189(2), రెడ్ విత్ 190 సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. అనుమతులు లేకుండా ప్రదర్శన నిర్వహించి ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించారని అంబటిపై పోలీసులు అభియోగాలు నమోదు చేశారు. భారీ ప్రదర్శన నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కలిగించినందున ఆయనపై కేసు నమోదుచేసినట్లు తెలిపారు.
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై బుధవారం అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీ నేతలు ర్యాలీ చేపట్టారు. ర్యాలీకి అనుమతి లేదని డీఎస్పీ అరవింద్, సీఐ గంగా వెంకటేశ్వర్లు అంబటికి చెప్పినా ఆయన వినిపించుకోలేదు. పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగినట్లు పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అంబటి చేసిన ఈ పని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపింది. అయితే పోలీసులు మాత్రం నిబంధనల పేరుతో ఆయనపై చర్యలకు ఉపక్రమించడం చర్చనీయాంశంగా మారింది.
అంబటితోపాటు వైసీపీ కార్యకర్తల ర్యాలీ ముందుకు వెళ్లనీయకుండా పోలీసులు కంకరగుంట వంతెన పైకి బారికేడ్లను అడ్డుగా పెట్టారు. అంబటి, ఆయన అనుచరులు వాటిని బలవంతంగా నెట్టి వంతెనపైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులను నెట్టేశారని కేసులు నమోదు అయ్యాయి. సీఐ వెంకటేశ్వర్లు, డీఎస్పీ అరవింద్‌తో రాంబాబు వాగ్వాదానికి దిగారని, పోలీసు విధి నిర్వహణకు ఆటంకం కలిగించారని అభియోగాలు మోపారు. కాగా, పోలీసు కేసులను మాజీ మంత్రి అంబటి తేలిగ్గా తీసుకున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఆందోళనలు చేయడం, ప్రభుత్వ నిర్ణయాలకు నిరసన తెలియజేయడం ప్రజల హక్కుగా చెబుతున్నారు.
కూటమి ప్రభుత్వ విధానాలపై రాజీలేని పోరాటం చేస్తున్న అంబటి.. వైసీపీలో మిగిలిన నేతలు కన్నా ధైర్యంగా పనిచేస్తున్నారని వైసీపీ శ్రేణులు కితాబునిస్తున్నాయి. ఆయనపై వరుసగా కేసులు పెడుతున్నా, ధైర్యంగా ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంబటిపై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. ఇందులో మూడు కేసులు పార్టీ పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం వల్లే కావడం గమనార్హం. గతంలో కూడా మాజీ మంత్రి అంబటిపై నల్లపాడు, పాత గుంటూరు, సత్తెనపల్లి రూరల్ పోలీసుస్టేషన్లలో కేసులు నమోదు చేశారు. మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా నిషేధాజ్ఞలు ఉల్లంఘించినందుకు అంబటిపై ఎఫ్ఐఆర్ వేశారు. ఇక వెన్నుపోటు దినం నిర్వహించిన సమయంలో కూడా అంబటిపై పట్టాభిపురం పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. తాజాగా మరో కేసు నమోదు అవడాన్ని వైసీపీ శ్రేణులు ఎత్తిచూపుతున్నాయి.
