Begin typing your search above and press return to search.

ఇదీ బాబు, లోకేష్ పాలన!.. మాజీ మంత్రి అంబటి ట్వీట్

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పాలనపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి వ్యంగ్యస్త్రాలు సంధించారు.

By:  Tupaki Political Desk   |   23 March 2026 1:23 PM IST
ఇదీ బాబు, లోకేష్ పాలన!.. మాజీ మంత్రి అంబటి ట్వీట్
X

ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పాలనపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి వ్యంగ్యస్త్రాలు సంధించారు. ‘‘ఇది బాబు, లోకేశ్ పాలన’ అంటూ సెటైర్ వేస్తూ ట్వీట్ చేశారు అంబటి. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా తనను జైలుకు పంపారని, తన కారును సీజ్ చేసి 50 రోజులు పోలీసుస్టేషన్ లో పెట్టారని అంబటి విమర్శించారు. ‘‘తెలుగుదేశం వారు పగలకొట్టిన నా కారును, పోలీసులు సీజ్ చేసి 50 రోజులు అట్టిపెట్టుకుని,కోర్టు ఆదేశంతో నిన్ననే విడుదల చేశారు. కానీ పగలకొట్టిన వారిని మాత్రం ఒక్క రోజు కూడా స్టేషన్ లో పెట్టలేదు.’’ అంటూ అంబటి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

జనవరి 31న ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు గొడవకు దిగిన విషయం తెలిసిందే. మాజీ మంత్రి అంబటి క్షమాపణ చెప్పాలంటే సుమారు ఆరేడు గంటల పాటు నిరసనకు దిగిన టీడీపీ కార్యకర్తలు అర్ధరాత్రి సమయంలో అంబటి ఇళ్లు, కార్యాలయంపై దాడి చేశారని అప్పట్లోనే కేసులు నమోదయ్యాయి. అయితే దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా తనను రాజమండ్రి జైలులో పెట్టారని మాజీ మంత్రి అంబటి పోలీసులపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక అప్పట్లో అంబటి ఇంటిపై దాడి చేసిన వారు ఆయన కారును నాశనం చేశారు.

ఇక అంబటి అరెస్టు తర్వాత టీడీపీ కార్యకర్తలు దాడి చేసిన కారును పోలీసులు సీజ్ చేశారు. ఏపీ 39 కేపీ 9 నెంబరు గల ఆ కారు 50 రోజులుగా పోలీసుల ఆధీనంలో ఉండిపోయింది. దీనిపై కోర్టును ఆశ్రయించిన అంబటి విడుదల ఉత్తర్వులు తెచ్చుకున్నారు. దీంతో సోమవారం కారును పోలీసులు అంబటికి అప్పగించారు. కారు ముందు, వెనుక అద్దాలు పగలి ఉండగా, ఒకవైపు డోరు మూతపడలేదు. దానిని వీడియో తీసి అంబటి తన ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

తిరుమల లడ్డూ కల్తీ విషయంపై జనవరి చివరి వారంలో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలు ప్రచురించారు. అందులో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డితోపాటు టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకరరెడ్డి ఫొటోలు ముద్రించారు. అభ్యంతరకరమైన విమర్శలు చేయడంపై మాజీ మంత్రి అంబటి నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఫ్లెక్సీలు వేయగా, గుంటూరు నగరంలో వాటిని తొలగించేందుకు మాజీ మంత్రి అంబటి ప్రయత్నించారు.

ఈ క్రమంలో ఆయనను కొందరు టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య గలాటా జరిగింది. ఆ తర్వాత కొద్దిసేపటికి గుంటూరు నగరంలో మాజీ మంత్రి అంబటి ఇంటికి పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు చేరుకుని ధర్నా చేశారు. ఇది ఉద్రిక్తతలకు దారితీసి ఆ రోజు రాత్రి విధ్వంసానికి కారణమైంది. ఈ క్రమంలో మాజీ మంత్రి అంబటి ఇళ్లు, కార్యాలయం, కార్లుపై అల్లరిమూకలు దాడి చేశాయి. అయితే టీడీపీ కార్యకర్తలే దాడి చేశారని మాజీ మంత్రి అంబటి పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితులకు స్టేషన్ బెయిలు ఇచ్చి వదిలేశారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దాడిలో బాధితులపైనే చర్యలు తీసుకున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. అల్లరిమూకలు దాడిలో ధ్వంసమైన కారు వీడియోను తాజాగా అంబటి విడుదల చేయడం ద్వారా మరోసారి నాటి ఘటనను గుర్తు చేశారు.