వైసీపీ ఫిక్స్ అయిపోయినట్లేనా...సీన్ రిపీట్ !
ఇదిలా ఉండగా తాజాగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
By: Satya P | 23 Dec 2025 11:43 PM ISTఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీ ఉంది. 2024 ఎన్నికలు ఆ పార్టీకి చావు దెబ్బ కొట్టాయి. కేవలం 11 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వచ్చాయి. దాంతో ప్రతిపక్ష హోదా సైతం అసెంబ్లీలో దక్కలేదు. ఈ పరిణామాల మధ్యనే ఏణ్ణర్ధం కాలం గడచిపోయింది. ఇక ఇపుడు మెల్లగా వైసీపీ జనంలోకి వస్తోంది. 2026 నుంచి జగన్ కూడా జిల్లా పర్యటనలు చేపడతారు అని అంటున్నారు. ఇక ఏపీలో కూటమి వర్సెస్ వైసీపీ అన్నట్లుగానే పాలిటిక్స్ హీటెత్తిస్తోంది. ఇప్పటిదాకా టీడీపీతోనే నడిచిన డైలాగ్ వార్ కాస్తా జనసేన బీజేపీతోనూ కంటిన్యూ అవుతోంది. దానిని బట్టి కూటమి ఐక్యంగా పటిష్టంగా ఉందని కూడా అర్థం చెబుతున్నారు.
బీటలు వారుతుందని :
నిజానికి దేశంలో ఎక్కడైనా కూటమి కట్టిన పార్టీలు తరువాత కాలంలో ఏవో కారణాలతో వేరు పడతాయి. ఏపీలో అలాంటి సీన్ ఉంటుందని వైసీపీ ఊహించింది అని అంటారు. అయితే కూటమి మాత్రం తాము బలంగానే ఉన్నామని 2029లోనూ ఇదే విధంగా తాము కలసి ఉంటామని చెబుతోంది. దాంతో వైసీపీకి ఎట్టకేలకు ఒక విషయం అర్ధం అయింది అని అంటున్నారు. కూటమిలో పార్టీలు అన్నీ ఒక్కటిగానే 2029లో వస్తాయని తాము మరోసారి కూటమిని ఎదుర్కోవాల్సి ఉంటుందని బోధపడింది అని చెబుతున్నారు.
మేము సింగిల్ గానే :
ఇదిలా ఉండగా తాజాగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తూ వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పదిహేనేళ్ళ పాటు మేమంతా ఒక్కటి అని పదే పదే పవన్ చెబుతున్నారని ఎవరు కాదన్నారు అని ప్రశ్నించారు. మీరు అక్కడే ఉండండి అంతా కలసే రండి అంటూ అంబటి చెప్పుకొచ్చారు. మీరు కలసి వచ్చినా లేక విడిగా వచ్చినా మాకేమీ బాధ లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. వైసీపీ మాత్రం ఒంటరిగానే వస్తుందని ఆయన ఒక స్పష్టత ఇచ్చేశారు. మా విధానం ఇదే అని కూడా తేల్చి చెప్పారు.
ప్రజలు మెచ్చితే మేమే :
అంతే కాదు అంబటి మరో మాట కూడా చెప్పారు. మమ్మల్ని అధికారంలోకి రానీయకుండా చేస్తామని పవన్ అంటున్నారు. అధికారం ఇచ్చేది ఆయన కాదు ప్రజలు అని గుర్తు పెట్టుకోవాలని అంబటి చెప్పారు. ప్రజలు మెచ్చి మాకు అధికారం ఇస్తే ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా మళ్ళీ వైసీపీదే విజయం అన్నారు. చంద్రబాబుని సీఎం చేయడానికే పవన్ కూటమిలో ఉన్నారని ఆయనకు కాపు కాస్తున్నారు అన్న సంగతి జనాలకు అర్థం అయింది అని అంబటి విమర్శించారు. ప్రజలకు అన్ని విషయాలు తెలుసు అని భ్రమలలో కూటమి నేతలే ఉన్నారని ఆయన చెప్పడం విశేషం.
కూటమినే ఓడించి :
ఇదిలా ఉంటే వైసీపీలో మరో చర్చ కూడా సాగుతోంది అని అంటున్నారు. కూటమిగా వచ్చినా ప్రజల ఆదరణ లేకపోతే గెలిచేది ఉండని అంటున్నారు. యూపీలో గతంలో యోగీ ఆదిత్యనాథ్ కి బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టిన పార్టీలు చిత్తు అయ్యాయని గుర్తు చేస్తున్నారు. అలా ఏపీలో కూడా 2024లో తాము అధికారంలో ఉండడంతో ప్రజా వ్యతిరేకత కూటమి పార్టీల బలం కలసి అధికారం వారికి దక్కిందని అంటున్నారు. అయినా నలభై శాతం ఓట్లు సింగిల్ గా దిగినా వైసీపీకి వచ్చాయని రానున్న కాలంలో ప్రజా వ్యతిరేకత కూటమికి ఉంటుందని అందువల్ల అంతా కలసి వచ్చినా ఓడిస్తేనే అది రికార్డు అవుతుందని చెబుతున్నారు. వైసీపీ ఈ విధంగా ఫిక్స్ అయిపోయిందని అందుకే మళ్ళీ ఆ పార్టీ నేతలు సింగిల్ అని చెబుతున్నారని అంటున్నారు.
