వైసీపీ ఇంటర్నల్ డిస్కర్షన్: అంబటితో ప్రయోజనం ఏంటి ..?
ఇక, రాజధాని అమరావతికి భూములు మరిన్ని తీసుకోవాలని ప్రభుత్వం భావించింది.
By: Garuda Media | 1 Dec 2025 4:30 PM ISTపార్టీ తరఫున గళం వినిపించే నాయకుల ద్వారా ఆ పార్టీకి మేలు జరగాలి. కనీసంలో కనీసం ఓటు బ్యాంకు అయినా.. దక్కాలి. పోనీ.. కొత్త ఓటు బ్యాంకు లేకపోయినా.. రాకపోయినా.. ఉన్న దానినైనా కాపాడుకునే ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో వైసీపీ నాయకులు కొందరు చేస్తున్న అతివిమర్శలు ఆ పార్టీకి శరాఘాతంగా మారుతున్నాయి. మాజీమంత్రి అంబటి రాంబాబు ఈ విషయంలో ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నారని.. వైసీపీ నాయకులే చెబుతున్నారు.
అంబటి రాంబాబు చేస్తున్న వ్యాఖ్యలతో వైసీపీ నాయకుల మాట ఎలా ఉన్నా.. పార్టీ ప్రస్థానం, పార్టీ గ్రాఫ్ దారుణంగా దెబ్బతింటున్నాయని నాయకులు చెబుతున్నారు. గత నెలలో ఆయన తిరుమల పర్యటనకు వెళ్లి వచ్చాక చేసిన వీడియో కూటమి ప్రభుత్వానికి మంచి మార్కులు వేసింది. ఇదేసమయంలో వైసీపీ హయాంలో తిరుమలను భ్రష్టు పట్టించారన్న చర్చ మరోసారి తెరమీదికి వచ్చింది. దీంతో సదరు వీడియో ను తొలగించాల్సి వచ్చింది.
ఇక, రాజధాని అమరావతికి భూములు మరిన్ని తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. రాజధానిని కేవలం మునిసిపాలిటీగా కాదు.. మహానగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న నేపథ్యంలో మరిన్ని భూములు అవసర మని చంద్రబాబు చెబుతున్నారు. అయితే.. దీనిపై వైసీపీ స్టాండ్ ఏంటో చెప్పలేదు. వాస్తవానికి పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత.. మూడు రాజధానులను భుజాలపైకి ఎత్తుకున్నారు. దీంతో అమరావతి ఉద్యమం వచ్చింది వైసీపీ ఓటమికి ఇది ప్రధానంగా దారి తీసింది.
పోనీ.. ఆ తర్వాతైనా పార్టీలో మార్పు కనిపించాలి. ఇది ఎలా ఉన్నా.. మరోసారి అంబటి రాంబాబు అమరావతి పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “నా కర్మ కాకపోతే ఏపీకి అంతర్జాతీయ స్థాయి రాజధాని దేనికి?మనం అంత గొప్పా?మనకి ఢిల్లీ కంటే పెద్ద రాజధాని అవసరమా?తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె కావాలంటే ఇదేగా?” అంటూ చాలా అవహేళనగా మాట్లాడారు. ఇది రాజధానిలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు వచ్చింది. దీంతో పార్టీకి మరింత ఇబ్బంది తలెత్తింది. ఈ నేపథ్యంలో అంబటితో ప్రయోజనం ఏంటన్నది వైసీపీలో జరుగుతున్న చర్చ.
