అనిల్ అంబానీ ఇంటిని.. తెలుగు రాష్ట్రాల్లోని ఆస్తుల్ని ఈడీ జఫ్తు
వ్యాపారం ఎవరైనా చేసేయొచ్చని చెబుతుంటారు. కానీ.. అదేమీ అంత సులువైన పని కాదన్నది చాలామంది గుర్తించరు.
By: Garuda Media | 4 Nov 2025 11:31 AM ISTవ్యాపారం ఎవరైనా చేసేయొచ్చని చెబుతుంటారు. కానీ.. అదేమీ అంత సులువైన పని కాదన్నది చాలామంది గుర్తించరు. వారికి ఆ అనుభవం వచ్చేసరికి ఆర్థికంగా ఎంతో నష్టం వాటిల్లి ఉంటుంది. అప్పుడు మాత్రమే వారికి తత్త్వం బోధ పడుతుంది. వ్యాపారం అందరూ చేయలేరన్న దానికి అతి పెద్ద ఉదాహరణగా అంబానీ కుటుంబాన్ని చెప్పొచ్చు. అంబానీ గ్రూపును షురూ చేసిన ధీరూబాయ్ అంబానీకి ఇద్దరుకొడుకులు అన్న విషయం తెలిసిందే. పెద్దోడు ముకేశ్ అంబానీ అయితే చిన్నోడు అనిల్ అంబానీ. వీరిద్దరూ కొంతకాలం కలిసే వ్యాపారం చేసినా.. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. ఇద్దరు రిలయన్స్ పేరు మీద వ్యాపారాలు ఎవరికి వారు సొంతంగా షురూ చేసినా.. ఆ తర్వాత ఏమైందో తెలిసిందే.
రిలయన్స్ ఇండస్ట్రీ అధినేతగా ముకేశ్ అంబానీ వ్యాపారంలో దూసుకెళ్లటమే కాదు.. దేశంలో నెంబర్ వన్ సంపన్నుడిగా అవతరించారు. ఆయన సొంత సోదరుడు అనిల్ అంబానీ మాత్రం అందుకు భిన్నంగా దివాళా తీసిన పరిస్థితి. అంతేనా.. పలు ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆరోపణలు ఎదుర్కొంటూ తీవ్రమైన ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ముంబయిలోని ఆయన నివాసాన్ని.. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఆస్తులతో పాటు.. ఇతర ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసిన వైనం.. మరోసారి అంబానీ సోదరుల గురించి మాట్లాడుకునేలా చేసింది.
ఒకే తల్లిదండ్రుల రక్తం పంచుకు పుట్టిన అంబానీ సోదరులే.. వ్యాపారంలో ఒకరు అద్భుతమైన సక్సెస్ ను సొంతం చేసుకుంటే.. మరొకరు దారుణమైన ఫెయిల్యూర్ ను మూటకట్టుకోవటం చూస్తే వ్యాపారం అందరికి సూట్ కాదన్న విషయం. ఈడీ జఫ్తు చేసిన కేసు వివరాల్లోకి వెళితే.. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ (ఆర్ హెచ్ఎఫ్ఎల్).. రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్ (ఆర్ సీఎఫ్ఎల్) సమీకరించిన ప్రజాధనాన్ని అక్రమ పద్దతుల్లో మళ్లించిన కేసులో భాగంగానే తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి.
2017-19లో ఆర్ హెచ్ఎఫఎల్ లో రూ2935 కోట్లు.. ఆర్ సీఎఫ్ఎల్ లో రూ.2045 కోట్లను యెస్ బ్యాంకు పెట్టుబడులు పెట్టగా.. 2019 నాటికి అవి నిరర్థక పెట్టుబడులుగా మారాయి. ఈ రెండు కంపెనీలు గ్రూపులోని ఇతర కంపెనీలకు ఆ డబ్బును రుణాలుగా ఇచ్చినట్లుగా ఈడీ గుర్తించింది. అంటే.. ఒక వ్యాపారం కోసం బ్యాంకు నుంచి తీసుకున్న డబ్బులు.. మరో వ్యాపారానికి వెచ్చించటంతో మొదటికే మోసం వచ్చిన పరిస్థితి. మొత్తంగా ఈ రెండు కంపెనీలు గ్రూపులోని ఇతర కంపెనీల్లోకి దాదాపు రూ.13,600 కోట్లు మళ్లించినట్లుగా చెబుతారు.
మొత్తంగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్.. ఇతర గ్రూపులోని కంపెనీలు రూ.17వేల కోట్లకు పైనే నిధులను మళ్లించినట్లుగా ఆరోపణలు రావటంతో ఈడీ రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. గతంలోనూ పలు ప్రాంతాల్లో కంపెనీకి చెందిన వ్యక్తులు.. ఆఫీసుల్లో సోదాలు నిర్వహించగా.. తాజాగా అనిల్ అంబానీ కుటుంబానికి ముంబయిలోని పాలిహిల్ లో ఉన్న ఇంటితో పాటు ఆయన గ్రూపు కంపెనీలకు చెందిన నివాస వాణిజ్య ఆస్తుల్ని ఈడీ అచాట్ చేసింది. హైదరాబాద్ లోని కామస్ కాప్రి అపార్ట్ మెంట్స్ లోని ఫ్లాట్లతో పాటు.. హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో ఉన్న 75ఎకరాల భూమిని కూడా ఈడీ అటాచ్ చేసినట్లుగా చెబుతున్నారు. అయితే.. మంచిరేవులలో ఉన్న 75 ఎకరాల భూమిని అటాచ్ చేశారా? లేదా?అన్న దానిపై అధికారిక ప్రకటన లేదు.
అంతేకాదు.. ఏపీలోని తూర్పుగోదావరిజిల్లాలోని ఆస్తులను కూడా జఫ్తు చేసినట్లుగా చెబుతున్నారు. వీటితో పాటు ముంబయి.. నోయిడా.. ఢిల్లీ.. థానే.. ఫుణె.. చెన్నై.. ఘజియాబాద్ లోని ఆస్తుల్ని కూడా జఫ్తు చేసినట్లుగా చెబుతున్నారు. ఈ మొత్తంఆస్తుల విలువ రూ.7500కోట్లకు పైనే ఉన్నట్లుగా ఈడీ ప్రకటించింది.అయితే.. ఈ అంశంపై అనిల్ అంబానీ గ్రూపు నుంచి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
