ఏఐ ప్రభావం.. అమెజాన్ లో మరో 14,000 ఉద్యోగాల కోతలు!
అమెజాన్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత క్లిష్టమైన నిర్ణయాలను మేనేజ్‌మెంట్ తీసుకుంటోంది.
By: A.N.Kumar | 8 April 2026 4:19 PM ISTప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్‌వేర్ , టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు మళ్లీ ముదురుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక అనిశ్చితి, కంపెనీల పునర్వ్యవస్థీకరణ పేరుతో వేల సంఖ్యలో ఐటీ నిపుణులు రోడ్డున పడుతుండగా తాజాగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తీసుకున్న నిర్ణయం పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. 2026 ప్రారంభం నుంచే లేఆఫ్స్‌తో వార్తల్లో ఉన్న ఈ సంస్థ ఇప్పుడు మరోసారి భారీ స్థాయిలో సిబ్బందిని తగ్గించుకునేందుకు సిద్ధమైంది.
ఒక్క ఏడాదిలోనే 30,000 పైగా ఉద్యోగాల తొలగింపు!
అమెజాన్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత క్లిష్టమైన నిర్ణయాలను మేనేజ్‌మెంట్ తీసుకుంటోంది. ఈ ఏడాది జనవరిలోనే సంస్థ సుమారు 16,000 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. అయితే అది కేవలం ప్రారంభం మాత్రమేనని తాజాగా వెలువడుతున్న నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే మే నెల నుండి మరో 14,000 మంది ఉద్యోగులను తొలగించే ప్రక్రియను అమెజాన్ ప్రారంభించనుంది. అంటే 2026 ఏడాది పూర్తయ్యేలోపు కేవలం ఒక్క సంస్థ నుంచే 30,000 మందికి పైగా ఉద్యోగులు ఉపాధి కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది.
ఏయే విభాగాలు ప్రభావితం కానున్నాయి?
సాధారణంగా నష్టాల్లో ఉన్న విభాగాలు లేదా తక్కువ ఆదాయం వచ్చే విభాగాల్లో కోతలు ఉంటాయని అందరూ భావిస్తారు. కానీ ఈసారి అమెజాన్ నిర్ణయం విస్మయానికి గురి చేస్తోంది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సంస్థకు అత్యధిక లాభాలను తెచ్చిపెట్టే క్లౌడ్ విభాగంలో కూడా కోతలు విధిస్తుండటం గమనార్హం. ఈ-కామర్స్ వ్యాపారంలో కీలకమైన రిటైల్ రంగంలో భారీ రీ-స్ట్రక్చరింగ్ జరుగుతోంది. వాయిస్ అసిస్టెంట్ అలెక్సా వంటి విభాగాలు కూడా ఈ ప్రభావిత జాబితాలో ఉన్నట్లు సమాచారం.
విలన్ కావాలా? హీరోనా? ఈ లేఆఫ్స్‌కు కారణం ఏఐ!
ప్రస్తుత ఉద్యోగాల కోతకు ప్రధాన కారణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కనిపిస్తోంది. గతంలో పది మంది అవసరమయ్యే పనిని ఇప్పుడు ఏఐ టూల్స్ అత్యంత వేగంగా తక్కువ ఖర్చుతో పూర్తి చేస్తున్నాయి. "మేము సంస్థను భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నాము. పనితీరును మెరుగుపరచడానికి ఖర్చులను తగ్గించడానికి కృత్రిమ మేధస్సును విస్తృతంగా ఉపయోగించడమే మా లక్ష్యం." అని అమెజాన్ నాయకత్వం పేర్కొంది.
సంస్థ యాజమాన్యం దీనిని "ముందస్తు జాగ్రత్త.. సాంకేతిక పరివర్తన"గా అభివర్ణిస్తుండగా ఉద్యోగుల పక్షాన మాత్రం ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మానవ వనరుల స్థానాన్ని యంత్రాలు ఆక్రమిస్తున్నాయనే వాదనకు అమెజాన్ తాజా నిర్ణయం బలాన్నిస్తోంది.
తొలగింపు ప్రక్రియ ఎలా ఉండబోతోంది?
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ లేఆఫ్స్ ఒకేసారి కాకుండా మే నెల నుండి ప్రారంభమై కొన్ని వారాల పాటు దశలవారీగా కొనసాగనున్నాయి. తొలగించబడిన ఉద్యోగులకు సెవెరెన్స్ ప్యాకేజీలు, ఇతర ప్రయోజనాలు కల్పిస్తామని సంస్థ చెబుతున్నప్పటికీ మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి వల్ల కొత్త ఉద్యోగాలు దొరకడం కష్టతరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉద్యోగుల భవిష్యత్తు ఏమిటి?
సాంకేతిక విప్లవం ఎప్పుడూ పాత ఉద్యోగాలను తొలగించి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది. కానీ ప్రస్తుతం జరుగుతున్న మార్పుల వేగం చూస్తుంటే మానవ వనరులు తమను తాము అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టమవుతోంది. అమెజాన్ వంటి దిగ్గజాలే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే, చిన్న ,మధ్యతరహా టెక్ కంపెనీల పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాబోయే రోజుల్లో ఐటీ నిపుణులు కేవలం కోడింగ్ లేదా మేనేజ్‌మెంట్‌పైనే కాకుండా, ఏఐతో కలిసి పనిచేసే నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సిన అగత్యం ఏర్పడింది.
