Begin typing your search above and press return to search.

అమెజాన్ ప్లేన్ ఎంత పని చేసింది.. రన్‌వే దాటి వాహనాలపైకి దూసుకెళ్లిన విమానం..

ప్యూర్టో రికోలోని శాన్ జువాన్ నగరం నుండి బయలుదేరిన బోయింగ్ 767-300 అమెజాన్ కార్గో విమానం మయామి ఎయిర్‌పోర్టులో దిగే క్రమంలో ఈ ప్రమాదానికి గురైంది.

By:  A.N.Kumar   |   7 Sept 2026 10:24 AM IST
అమెజాన్ ప్లేన్ ఎంత పని చేసింది.. రన్‌వే దాటి వాహనాలపైకి దూసుకెళ్లిన విమానం..
X

మయామి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. అమెజాన్‌కు చెందిన ఒక కార్గో విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వే దాటి పార్కింగ్ ప్రాంతంలో ఉన్న వాహనాలపైకి దూసుకెళ్లడంతో భారీ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాదం జరిగిందిలా..

ప్యూర్టో రికోలోని శాన్ జువాన్ నగరం నుండి బయలుదేరిన బోయింగ్ 767-300 అమెజాన్ కార్గో విమానం మయామి ఎయిర్‌పోర్టులో దిగే క్రమంలో ఈ ప్రమాదానికి గురైంది. ల్యాండ్ అయిన వెంటనే వేగాన్ని అదుపు చేయలేకపోయిన విమానం రన్‌వే పరిమితిని దాటి బయటకు వచ్చేసింది. సమీపంలోని పార్కింగ్ స్థలంలో ఉన్న వాహనాలను బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా భారీ ఎత్తున మంటలు చెలరేగాయి.

ప్రమాదం ధాటికి పరిసర ప్రాంతాలు దట్టమైన పొగతో కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే దాదాపు 60కి పైగా ఫైర్ రెస్క్యూ వాహనాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల పాటు తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

బాధితులకు చికిత్స.. విమానాశ్రయంలో ఆందోళన

ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా గాయపడిన ఐదుగురిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ట్రామా సెంటర్‌కు తరలించారు. మిగిలిన ఇద్దరిని సమీప ఆస్పత్రులకు తరలించి వైద్యం అందిస్తున్నారు. ఘటన తీవ్రత దృష్ట్యా అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ మయామి విమానాశ్రయంలోని రన్‌వేలను తాత్కాలికంగా మూసివేసింది. దీంతో పలు విమానాల రాకపోకలకు తీవ్ర విఘాతం కలిగింది. వేలాది మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.

ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు

ఈ ఘోర ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడి కాలేదు. ల్యాండింగ్ సమయంలో బ్రేకింగ్ వ్యవస్థ పనిచేయలేదా సాంకేతిక లోపం ఉందా లేదా ఆ సమయంలో ఉన్న వాతావరణ పరిస్థితులు కారణమా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు.

నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ , ఎఫ్ఏఏ సంయుక్తంగా దర్యాప్తును ప్రారంభించాయి. విమానానికి సంబంధించిన సాంకేతిక డేటా, బ్లాక్ బాక్స్, పైలట్ల చర్యలను విశ్లేషించిన తర్వాతే ప్రమాదానికి గల పూర్తి వివరాలు బయటకు రానున్నాయి.