Begin typing your search above and press return to search.

జగన్ నోట ‘మావిగన్’ మాట బుధవారమే ఎందుకొచ్చింది?

ఇలాంటి వేళ.. మీడియా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఉన్నట్లుండి ఎజెండా ఎందుకు మారింది? దాని వెనకున్న అసలు కథ ఏమిటన్న దానిపై ఫోకస్ చేస్తే.. ప్రజలకు మరిన్ని నిజాలు తెలిసే వీలుంటుంది.

By:  Garuda Media   |   2 July 2026 12:30 PM IST
జగన్ నోట ‘మావిగన్’ మాట బుధవారమే ఎందుకొచ్చింది?
X

కొన్ని కీలక పరిణామాలు ఇట్టే జరిగిపోతుంటాయి. జరిగిన ఘటన గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కానీ.. సదరు పరిణామం ఎందుకు చోటు చేసుకుంది? దాని వెనకున్న విషయం ఏమిటన్న దానిపై కాస్తంత ఫోకస్ పెడితే.. అసలు విషయం ఇట్టే అర్థమవుతుంది. పాలకు పాలు.. నీళ్లకు నీళ్లు అన్నట్లుగా. రాజకీయంలో ఉన్న మేజిక్ ఏమిటంటే.. సామాన్యులకు అర్థం కాని విధంగా సంబంధం లేని అంశాలు ఎజెండాగా ఒక్కోసారి మారిపోతాయి. హటాత్తుగా అందరి చర్చ దానివైపే సాగుతుంటుంది. ఇలాంటి వేళ.. మీడియా కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఉన్నట్లుండి ఎజెండా ఎందుకు మారింది? దాని వెనకున్న అసలు కథ ఏమిటన్న దానిపై ఫోకస్ చేస్తే.. ప్రజలకు మరిన్ని నిజాలు తెలిసే వీలుంటుంది.

బ్యాడ్ లక్ ఏమంటే.. తెలుగు రాష్ట్రాల్లోని మొయిన్ స్ట్రీం మీడియా ఏది కూడా ఏపీలో బుధవారం చోటు చేసుకున్న ఒక కీలక అంశాన్ని రోటీన్ పద్దతిలో కవర్ చేశారే తప్పించి.. కాస్తంత క్రిటికల్ గా ఎగ్జామిన్ చేసి ఉంటే బాగుండేదని చెప్పాలి. ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేకుండా.. బుధవారం హటాత్తుగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం 11 గంటల వేళలో.. ఆయన నిర్వహించిన మీడియా సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తదుపరి ఎన్నికల్లో తాను మావిగన్ ఎజెండాతోనే వెళతానని స్పష్టం చేసిన జగన్ వ్యాఖ్యలతో అమరావతి వర్సెస్ మావిగన్ అన్నది ఏపీలో మాత్రమే కాదు తెలంగాణలోనూ హాట్ టాపిక్ గా మారింది.

నిజానికి ఈ వ్యాఖ్యల్ని ఇప్పుడే చేయాల్సిన అవసరం వైసీపీ అధినేతకు ఉందా? అంటే లేదనే చెబుతారు. కానీ.. అలా చేస్తే ఆయన జగన్ ఎందుకు అవుతారు? నిన్న ఏపీలో ఒక కీలకమైన డెవలప్ మెంట్ ప్లాన్ కు సంబంధించిన కార్యక్రమం జరిగింది. హీరో కార్ప్ సంస్థ తన ప్లాంట్ కు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇది జరిగింది మధ్యాహ్నం 2.30 - 4 గంటల ప్రాంతంలోనే. ఈ ప్రోగ్రామ్ కు కొన్ని గంటల ముందే జగన్ ప్రెస్ మీట్ పెట్టి.. అమరావతి వర్సెస్ మావిగన్ అన్న అంశాన్ని చర్చకు పెట్టేశారు.

మీరు గమనిస్తే.. నిన్నటి వార్తల సరళి.. సాయంత్రం టీవీల్లో సాగిన డిబేట్లు మొత్తం కూడా జగన్ వ్యాఖ్యల చుట్టూనే సాగింది. నిజానికి హీరో కార్ప్ సంస్థ తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలో ఏర్పాటు చేసిన గ్లోబల్ పార్ట్స్ సెంటర్ శంకుస్థాపన ఏపీకి ఎంతో కీలకమైంది. రానున్న మూడు నాలుగేళ్లలో ఈ సంస్థ ఏర్పాటు చేసే పరిశ్రమ ద్వారా పలు కంపెనీల అనుబంధ పెట్టుబడులు మాత్రమే కాదు.. ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయి.

నిజానికి ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని కూటమి సర్కారు హైలెట్ చేసుకోవాలన్న ప్లాన్ ఉంది. అందుకు తగ్గట్లే.. నిన్నటి దినపత్రికల్ని చూస్తే.. హీరో కార్ప్ కు ప్రోగ్రామ్ కు సంబంధించి భారీ జాకెట్ యాడ్లు ఇవ్వటం కనిపిస్తుంది. కొద్ది గంటల వ్యవధిలోనే జగన్ తన ప్రెస్ మీట్ తో రాజకీయ చర్చ వైపు మళ్లేలా ప్రభుత్వాన్ని మాత్రమే కాదు.. ప్రజలను కూడా మళ్లించారని చెప్పాలి. హీరో కార్ప్ ప్లాంట్ కారణంగా ఏపీ రాష్ట్ర ఆర్థిక ప్రగతి.. ఉద్యోగాలకు సంబంధించింది. దీనికి సామాన్యుల ఎమోషన్ టచ్ కాదు. కానీ.. రాజధాని అంశం అన్నంతనే ఏపీ ప్రజలు మాత్రమే కాదు తెలంగాణ ప్రజలు సైతం ఎంతో ఆసక్తిగా చూస్తారు.

తాజా పరిణామంతో వైఎస్ జగన్ కు ఉన్న సామర్థ్యం మరోసారి నిరూపితమైంది. సెంటిమెంట్ ను ఇన్ స్టెంట్ గా రగల్చే అద్భుతమైన టాలెంట్ ఆయన సొంతమని తేలింది. అన్నింటికంటే మరింత ఆసక్తికర అంశం.. ఆ విషయాన్ని సామాన్యులు.. రాజకీయ పక్షాలు మాత్రమే కాదు మీడియా సైతం పసిగట్టలేనంతగా స్క్రిప్టు ప్లాన్ చేయటం చూస్తే మాత్రం.. జగన్ టాలెంట్ కు ఫిదా అవ్వాల్సిందే.