అమరావతిలో ఆకాశహర్మ్యాలు.. భారీ 'మిక్స్‌డ్ యూజ్ ట్విన్ టవర్స్' ప్రాజెక్టుకు సన్నాహాలు
రాజధాని అమరావతిలో కట్టడాలు నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆప్టర్ అన్నట్లు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది.
By: Tupaki Political Desk | 26 Aug 2026 3:05 PM ISTరాజధాని అమరావతిలో కట్టడాలు నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆప్టర్ అన్నట్లు ఉండాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఐకానిక్ టవర్స్, హైకోర్టు భవనాలతో గవర్నమెంటు కాంప్లెక్సును అత్యద్భుతంగా నిర్మిస్తున్న ప్రభుత్వం ప్రైవేటు రంగంలోనూ భారీ ఆకాశహర్మ్యాలకు ఏర్పాట్లు చేస్తోంది. రాజధాని కోర్ క్యాపిటల్ ఏరియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ మిక్స్‌డ్ యూజ్ ట్విన్ టవర్స్ ప్రాజెక్టుకు ప్రభుత్వం తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెబుతున్నారు. రూ.1200 కోట్లతో నిర్మిస్తున్న ఈ టవర్స్ లో ప్రపంచ స్థాయి ఆతిథ్య సౌకర్యాలు, వాణిజ్య రంగానికి సరిపోయేలా కార్యాలయాలు ఉంటాయని చెబుతున్నారు.
అంతర్జాతీయ బ్రాండ్
అమరావతిని గ్లోబల్ సిటీగా మార్చే లక్ష్యంలో భాగంగా, ప్రఖ్యాత అంతర్జాతీయ హాస్పిటాలిటీ బ్రాండ్ 'హయత్' ఆధ్వర్యంలో ఈ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతోంది. హైదరాబాద్‌కు చెందిన ఓం శ్రీ భావనసాయి హాస్పిటాలిటీ సంస్థ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ప్రమోట్ చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా అంతర్జాతీయ వ్యాపారవేత్తలు, దౌత్యవేత్తల ఉన్నత స్థాయి పర్యాటకులకు సరిపడా లగ్జరీ వసతి సదుపాయాలు అందుబాటులోకి వస్తాయని చెబుతున్నారు.
ఈ జంట టవర్లను అమరావతి కోర్ క్యాపిటల్ పరిధిలోని తుళ్లూరు గ్రామంలో నిర్మిస్తున్నారు. గవర్నమెంట్ సిటీకి అత్యంత చేరువలో, దొండపాడు నుండి ఉండవల్లి వరకు విస్తరించి ఉన్న ప్రధాన సీడ్ యాక్సిస్ రోడ్డుకు సమీపంలో ఈ ప్రాజెక్టుకు స్థలం కేటాయించారు. ఓం శ్రీ భావనసాయి హాస్పిటాలిటీ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన ఈ స్థలంలో మాస్టర్ ప్లాన్‌ను ఖరారు చేసి, పర్యావరణ అనుమతుల కోసం అధికారికంగా దరఖాస్తు సమర్పించారు. రాజధాని స్కైలైన్‌ను పూర్తిగా మార్చే విధంగా రెండు భారీ టవర్లతో హై-రైజ్ బిల్డింగ్ కేటగిరీలో ఈ నిర్మాణం సాగుతోందని చెబుతున్నారు. ఇందులో వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా నాలుగు భారీ భూగర్భ బేస్‌మెంట్లు కేటాయించారు. అంతేకాకుండా లోయర్ గ్రౌండ్, అప్పర్ గ్రౌండ్ ఫ్లోర్లతో పాటు పదుల సంఖ్యలో ఎత్తైన అంతస్తులు, పైన ప్రత్యేకమైన టెర్రస్ ఫ్లోర్‌తో ఈ టవర్లను రూపకల్పన చేశారు.
సురక్షితమైన నిర్మాణ పద్ధతులు, ఆధునిక ఎలివేషన్, భారీ సెంట్రల్ కోర్ట్‌యార్డ్ ఈ ట్విన్ టవర్స్ ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. హయత్ బ్రాండ్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ సముదాయంలో అనేక సదుపాయాలు ఉండనున్నాయని చెబుతున్నారు. వందలాది లగ్జరీ గెస్ట్ రూమ్‌లు, ప్రపంచ స్థాయి వంటకాలను అందించే మల్టీ-కుజీన్ రెస్టారెంట్లు, స్విమ్మింగ్ పూల్స్, వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా పెద్ద ఎత్తున సమావేశాలు, ఈవెంట్లు నిర్వహించేందుకు అనువుగా విశాలమైన బ్యాంకెట్ హాళ్లు నిర్మిస్తున్నారు. వీటికి అదనంగా, అత్యాధునిక షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్టులు, వినోద కేంద్రాలను మిక్స్‌డ్ యూజ్ కాన్సెప్ట్‌లో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు.
కార్పొరేట్ ఆఫీస్ స్పేస్
గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు, బహుళజాతి కంపెనీల అవసరాలను తీర్చే విధంగా ఈ టవర్లలో భారీ ఎత్తున ఆఫీస్ స్పేస్‌ను కేటాయిస్తున్నారు. ఒకే ప్రాంగణంలో నివాసం, కార్యాలయం, వినోదం, షాపింగ్ అన్నీ ఒకేచోట లభించేలా 'వాక్-టు-వర్క్' తరహా వాతావరణాన్ని ఇందులో కల్పిస్తున్నారు. అత్యాధునిక నెట్‌వర్కింగ్, హై-స్పీడ్ లిఫ్టులు, సురక్షితమైన ఎంట్రీ సిస్టమ్‌లతో కార్పొరేట్ సంస్థలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఇందులో ఉండనున్నాయి. పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రాజెక్ట్ స్థలంలో పూర్తిగా పచ్చదనం, ల్యాండ్‌స్కేపింగ్ కోసం గ్రీన్ బెల్ట్ ఏరియాను కేటాయించారు. రాబోయే రోజుల్లో రద్దీని నియంత్రించేందుకు మొత్తం స్థలంలో గణనీయమైన విస్తీర్ణాన్ని కేవలం వాహనాల పార్కింగ్ కోసమే వినియోగిస్తున్నారు. అంతేకాకుండా, వర్షపు నీటి సంరక్షణ, సోలార్ ఎనర్జీ, సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ల వంటి గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలను ఈ ప్రాజెక్ట్‌లో కచ్చితంగా అమలు చేస్తున్నారు.
ఇప్పటికే ప్రాజెక్ట్ ప్రాంగణంలో భూమిపూజ కార్యక్రమాలు, గ్రౌండ్ లెవెల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయని అంటున్నారు. పర్యావరణ అనుమతులు రాగానే పూర్తి స్థాయి నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయని అంటున్నారు. నిర్దేశిత గడువులోగా ఈ మెగా ప్రాజెక్టును పూర్తి చేసి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అమరావతిలో క్వాంటం టవర్స్, ఐకాన్ టవర్లతో పాటు హయత్ వంటి గ్లోబల్ బ్రాండ్లు అడుగుపెడుతుండటం రాజధాని నగరంపై అంతర్జాతీయ పెట్టుబడిదారులకు ఉన్న నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తోందని చెబుతున్నారు.
