Begin typing your search above and press return to search.

ముహూర్తం ఫిక్స్‌: పార్ల‌మెంటులో అమ‌రావ‌తి 'బిల్లు'.. ఎప్పుడంటే!

ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తి మాత్ర‌మే ఉండాల‌ని పేర్కొంటూ.. ఇటీవ‌ల రాష్ట్ర అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి చేసిన తీర్మానం.. కేంద్ర హోం శాఖ‌కు చేరింది.

By:  Garuda Media   |   31 March 2026 11:18 PM IST
ముహూర్తం ఫిక్స్‌:  పార్ల‌మెంటులో అమ‌రావ‌తి బిల్లు.. ఎప్పుడంటే!
X

ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తి మాత్ర‌మే ఉండాల‌ని పేర్కొంటూ.. ఇటీవ‌ల రాష్ట్ర అసెంబ్లీ ప్ర‌త్యేకంగా భేటీ అయి చేసిన తీర్మానం.. కేంద్ర హోం శాఖ‌కు చేరింది. అనంత‌రం.. వ‌డివ‌డిగా దీనికి సంబంధించిన లాంఛ‌న క్ర‌తువులు కూడా పూర్త‌య్యాయి. ఇక‌, తాజాగా పార్ల‌మెంటుకు కూడా చేర‌నుంది. దీనికి సంబంధించిన డేట్‌ను పార్ల‌మెంటు స‌చివాల‌యం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు లోక్‌స‌భ కార్య‌క‌లాపాల జాబితాలో `అమ‌రావ‌తి చ‌ట్ట‌బ‌ద్ధ‌త బిల్లు`కు చోటు క‌ల్పించింది.

దీనిప్ర‌కారం.. ఏప్రిల్ 1(బుధ‌వారం) జ‌రిగే పార్ల‌మెంటు స‌మావేశాల‌లో అమ‌రావ‌తి బిల్లును ముందుగా లోక్‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం చేసిన తీర్మానం మేర‌కు.. బిల్లును రూపొందించిన న్యాయ శాఖ‌.. దీనిని లోక్‌స‌భలో ప్ర‌వేశ పెట్ట‌నుంది. దీనిపై చ‌ర్చ జ‌రుగుతుంది. అనంత‌రం.. దీనిని ఆమోదించ‌నున్నారు. అయితే.. ఇది ఆమోదం పొందిన త‌ర్వాత‌.. మ‌రుస‌టి రోజు(గురువారం) రాజ్య‌స‌భ‌లో ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. పెద్ద‌ల స‌భ‌లో కూడా దీనిపై చ‌ర్చిస్తారు.

అక్క‌డ కూడా ఆమోదం పొందిన త‌ర్వాత‌.. రెండు బిల్లుల‌ను సంయుక్త‌తంగా రాష్ట్ర ప‌తి ద్రౌప‌ది ముర్ము పేషీకి పంప‌నున్నారు. ఇక‌, ఆమె సంత‌కంతో ఈ బిల్లు చ‌ట్ట‌బ‌ద్ధం కానుంది. అనంత‌రం.. `అమ‌రావ‌తే ఏకైక రాజ‌ధాని`గా పేర్కొంటూ.. రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం ఒక గెజిట్‌ను విడుద‌ల చేయ‌నుంది. ఈ క్ర‌తువు పూర్త‌యితే.. ఇక‌, అమ‌రావ‌తి అజేయంగా ఏపీకి ఏకైక‌ రాజ‌ధానిగా మార‌నుంది. త‌దుప‌రి ఏ ప్ర‌భుత్వం వ‌చ్చినా.. దీనిని మార్చేందుకు వీలు ఉండ‌దు. కాగా.. దీనికి సంబంధించి ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్విభ‌జ‌న బిల్లులోని సెక్ష‌న్ 5కు స‌వ‌ర‌ణ‌లు ప్ర‌తిపాదించ‌నున్నారు.

వైసీపీ ఏం చేస్తుంది?

ఈ నెల 28న అసెంబ్లీని ప్ర‌త్యేకంగా కొలువు దీర్చి.. మ‌రీ అమ‌రావ‌తి చ‌ట్ట‌బ‌ద్ధ‌త‌పై చ‌ర్చించారు. అనంత‌రం.. స‌భ ఏక‌గ్రీవంగా దీనికి తీర్మానం రూపొందించి. అయితే.. వైసీపీ ఎమ్మెల్యేలు ఈ స‌భ‌కురాకుండా డుమ్మా కొట్టారు. దీనిపై ఇటు రాజ‌కీయ వ‌ర్గాల్లో నూ అటు సోష‌ల్ మీడియాలోనూ తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇదిలావుంటే.. ఇప్పుడు పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లోనూ వైసీపీ ఎంపీలు ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆయా స‌భ‌ల్లో అమ‌రావ‌తి బిల్లుపై చ‌ర్చ సంద‌ర్భంగా వైసీపీ ఎంపీలు ఏం చేస్తారు? ఎలాంటి వాద‌న వినిపిస్తార‌న్న‌ది ఆస‌క్తిగా మారింది.