ఏపీ పట్టణాలకు లండన్ టచ్.. రూ. 40 వేల కోట్లతో మాస్టర్ ప్లాన్.. యూకే ప్రభుత్వంతో కీలక ఒప్పందం
రాజధాని అమరావతి నిర్మాణంతోపాటు రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
By: Tupaki Political Desk | 26 Aug 2026 11:51 AM ISTరాజధాని అమరావతి నిర్మాణంతోపాటు రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి పనులు చేపట్టేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం యునైటెడ్ కింగ్ డమ్ (యూకే) ప్రభుత్వంతో అవగాహన కుదుర్చుకుంది. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి నారాయణ సమక్షంలో యూకే ప్రభుత్వ ప్రతినిధులతో రాష్ట్ర మున్సిపల్ శాఖ అధికారులు సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా, అమరావతిని ప్రపంచంలోని అత్యుత్తమ నగరాలలో ఒకటిగా తీర్చిదిద్దేందుకు రెండు ప్రభుత్వాలు చేతులు కలిపినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రకటించాయి.
రాష్ట్ర రాజధాని అమరావతిని పర్యావరణహితంగా, మెరుగైన కనెక్టివిటీతో ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడంలో యూకే నైపుణ్యం ఎంతో ఉపయోగపడనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే లండన్‌కు చెందిన ప్రముఖ ఫోస్టర్ పార్ట్‌నర్స్ సంస్థ అమరావతిలోని అసెంబ్లీ, హైకోర్టు, సచివాలయ భవనాల రూపకల్పనలో భాగస్వామిగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ, తదుపరి దశ అభివృద్ధిలోనూ యూకే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోనున్నారని అంటున్నారు.
కేవలం అమరావతికే పరిమితం కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కూడా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఈ భాగస్వామ్యం తోడ్పడనుందని చెబుతున్నారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వంటి ప్రాథమిక వసతుల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో దాదాపు రూ. 40 వేల కోట్ల విలువైన పనులను చేపడుతుండగా, యూకే ఆధునిక సాంకేతికతను జోడించడం ద్వారా పనుల్లో నాణ్యత మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
ఈ ఒప్పందం ద్వారా ప్రధానంగా నాలుగు రంగాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు. ప్రాజెక్టుల ప్రణాళిక, ఆర్థిక సాధ్యాసాధ్యాల అంచనా, నగరాలను స్మార్ట్, లివబుల్ సిటీలుగా మార్చడం, డిజిటల్ ట్విన్స్, ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్స్ వంటి ఆధునిక సాంకేతికతను బదిలీ చేయడం ఇందులో ముఖ్యమైనవి. అంతేకాకుండా, మెట్రో రైలు, బస్సు వ్యవస్థలతో పాటు సమగ్ర పట్టణ రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా ట్రాఫిక్ సమస్యలను తగ్గించి, ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని మంత్రి నారాయణ తెలిపారు. యూకే ఎక్స్‌పోర్ట్ ఫైనాన్స్ ద్వారా ఆర్థిక సహాయం పొందే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అమరావతి అభివృద్ధికి యూకే ప్రతినిధులు ముందుకు రావడం, రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరుస్తుందని ఈ ఒప్పందం నిరూపిస్తోందని భావిస్తున్నారు.
