Begin typing your search above and press return to search.

‘S' ఆకారంలో మెలిక తిరిగిన రోడ్డు.. వైసీపీ ట్రోలింగ్.. అసలు వాస్తవం ఏంటంటే?

అయితే ఈ విషయంపై ప్రభుత్వం కూడా అత్యంత వేగంగా స్పందించి విపక్షానికి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలకు కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది.

By:  Tupaki Political Desk   |   14 Aug 2026 1:00 AM IST
‘S ఆకారంలో మెలిక తిరిగిన రోడ్డు.. వైసీపీ ట్రోలింగ్.. అసలు వాస్తవం ఏంటంటే?
X

ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక హాట్ డిబేట్ జరుగుతూనే ఉంటుంది. అధికార, విపక్షాల మధ్య ఉన్న తీవ్ర పోటీతో నిత్యం ఏదో ఒక అంశం రాజకీయంగా హాట్ టాపిక్ అవుతూ ఉంటోంది. ఇందులో భాగంగా రాజధాని అమరావతికి జీవనాడి లాంటి సీడ్ యాక్సెస్ రోడ్డు గురువారం ప్రారంభించగా, దీనిపై వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో చేపట్టిన ట్రోలింగ్ హీట్ పుట్టించింది. అయితే ఈ విషయంపై ప్రభుత్వం కూడా అత్యంత వేగంగా స్పందించి విపక్షానికి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలకు కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశం అయింది.

అమరావతి-విజయవాడ మధ్య కనెక్టవిటీని పెంచేలా సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఉండవిల్లి నుంచి పెనుమాక మీదుగా వెంకటాయపాలెం వరకు చేపట్టిన ఈ రెండో దశ పనుల్లో బకింగ్ హామ్ కెనాల్, కొండవీడు వాగుపై రెండు స్టీల్ బ్రిడ్జిలను నిర్మించారు. దీంతో విజయవాడ నుంచి ప్రకాశం బ్రిడ్జి మీదుగా కోర్ కేపిటల్ కు చేరుకునేందుకు విశాలమైన వేగవంతమైన రోడ్డు అందుబాటులోకి వచ్చినట్లైంది. కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని తమ విజయంగా చెప్పుకుంటూ పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో కూడా రాజధాని పనులపై ప్రచారం ఉదరగొట్టింది.

అయితే ఈ విషయంలో వెనకబడిపోయామన్న ఆలోచనతో వైసీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగిందని చెబుతున్నారు. రాజధానిలో మలుపులు లేని రోడ్లు నిర్మిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వాన్ని నిలదీస్తూ సీడ్ యాక్సెస్ రోడ్డులో ఒక చోట ‘S' ఆకారంలో మలుపు ఉండటాన్ని ఎత్తిచూపింది. డబ్బు, అధికారం కలిస్తే రోడ్డు ఎన్ని మలుపులు అయినా తిరుగుతుందని కామెంట్లు పెట్టింది. ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రభుత్వం వెనువెంటనే స్పందించింది.

ఒకపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యక్రమం కొనసాగుతుండగానే ప్రభుత్వం తరఫున ఫ్యాక్ట్ చెక్ టీం రంగంలోకి దిగిందని చెబుతున్నారు. వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలు నిరాధారమంటూ కొట్టిపారేసింది. అంతేకాకుండా ‘S' అకారంలో మలుపు ఎందుకు తిప్పాల్సివచ్చిందో పూర్తిస్థాయిలో వివరణ ఇచ్చింది. రాజధానికి వెన్నుముక లాంటి సీడ్ యాక్సెస్ భవిష్యత్ ప్రణాళిక కోసమే ఆ వంపు ఉంచామని స్పష్టం చేసింది. ఫేజ్–3లో భాగంగా విజయవాడ–చెన్నై జాతీయ రహదారి (NH–16)తో మణిపాల్ హాస్పిటల్ సమీపంలో అనుసంధానించే ప్రధాన కారిడార్‌ నిర్మించాల్సివుందని, దీనికి అనుగుణంగా, భౌగోళిక పరిస్థితులు, భద్రత, ట్రాఫిక్ నిర్వహణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత సీడ్ యాక్సెస్ రోడ్డును డిజైన్ చేసినట్లు చెప్పింది.

రాజధాని అమరావతికి మంగళగిరి, విజయవాడ ప్రాంతాలతో మెరుగైన రహదారి అనుసంధానం కల్పించడంతో పాటు, కరకట్టపై వాహనాల రద్దీని తగ్గించడం ప్రధాన ఉద్దేశ్యంగా సీడ్ యాక్సెస్ రహదారిని అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపింది. అందువల్ల సీడ్ యాక్సెస్ రహదారిలోని ‘S’ ఆకారపు మలుపులను భవిష్యత్ రహదారి కారిడార్ నిర్మాణం, అనుసంధాన అవసరాలు, సమగ్ర ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికలో భాగంగా చూడాలి అంటూ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారం, అపోహలకు ఎలాంటి ఆధారం లేదని స్పష్టం చేసింది.

అంతేకాకుండా సీడ్ యాక్సెస్ రోడ్డులోని ‘S’ ఆకారపు మలుపులను కేవలం ఒక మలుపుగా చూడకూడదని, ఇది ఒక సమగ్ర ట్రాఫిక్ నిర్వహణ ప్రణాళికలో భాగమని ప్రభుత్వం తేల్చిచెప్పింది. అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు కావాలనే అపోహలను సృష్టిస్తున్నారని, ప్రజలు వాస్తవాలను గమనించి ఇలాంటి దుష్ప్రచారాలను తిప్పికొట్టాలని ప్రభుత్వం మండిపడింది. అమరావతి అభివృద్ధికి బాటలు వేస్తున్న ఈ ప్రాజెక్టుపై అనవసర వివాదాలు సృష్టించడం సమంజసం కాదని నెటిజన్లు సైతం అభిప్రాయపడుతున్నారు.