అమరావతితో రాజకీయ సయ్యాట.....వైసీపీకి నో ఆప్షన్
వైసీపీ 2019 తరువాత అపరిమితంగా దక్కిన ప్రజా తీర్పుని ఏ విధంగా ఊహించుకుందో తెలియదు కానీ మూడు రాజధానులు అంటూ కొత్త టర్న్ తీసుకుంది.
By: Satya P | 10 Jan 2026 10:00 AM ISTవైసీపీ 2019 తరువాత అపరిమితంగా దక్కిన ప్రజా తీర్పుని ఏ విధంగా ఊహించుకుందో తెలియదు కానీ మూడు రాజధానులు అంటూ కొత్త టర్న్ తీసుకుంది. అయిదేళ్ల పాటు దాని మీదనే మొత్తం కధ అంతా తిప్పింది. అయితే మూడు రాజధానులు జరిగిందీ లేదు, అమరావతి విషయంలో మాత్రం వైసీపీ తీవ్ర వ్యతిరేకత మూటకట్టుకుంది. అయితే అమరావతి చుట్టుపక్కల వ్యతిరేకత వస్తుదని వైసీపీ ఊహించినదే. కానీ రాయలసీమ ఉత్తరాంధ్రాలకు రాజధానులు అని చెప్పినా ఆయా రీజియన్స్ లో జనాలు వైసీపీని గెలిపించకపోవడం మాత్రం ఆ పార్టీకి బిగ్ షాక్ అని చెప్పాలి. ఏపీ మొత్తం ఏకమొత్తంగా అమరావతికి జై కొట్టింది అన్నది 2024 ఎన్నికల తీర్పు సారాంశం. దాంతో సహజంగానే ఏ రాజకీయ పార్టీ అయినా తన విధానాలు మార్చుకుంటుంది. కానీ వైసీపీ ఏణ్ణర్థం పాటు సైలెంట్ గా ఉండి మళ్లీ అమరావతి వ్యతిరేక రాగాన్ని అందుకుంది.
వ్యూహాత్మకంగానే :
అయితే సడెన్ గా జగన్ అమరావతి రాజధానిగా పనికిరాదు నదీ గర్భంలో నిర్మాణాలు చేయకూడదు సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోవాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పైగా గుంటూరు విజయవాడల మధ్యలో రాజధానిని మిర్మించాల్సింది అని తన ఆలోచనలను బయట పెట్టారు. ఓవారల్ గా చూస్తే అమరావతికి వైసీపీ వ్యతిరేకం అన్నది జగన్ మాటల ద్వారా స్పష్టం అయింది అని అంటున్నారు. అయితే జగన్ వ్యూహాత్మకంగానే ఈ తరహా వ్యాఖ్యలు చేశారు అని అంటున్నారు. ఎందుకంటే అమరావతిని రాజధానిగా అంగీకరించినా ఈ సమయంలో వైసీపీ ఒరిగేది లేదన్నది ఒక విశ్లేషణ. 2019 నుంచి 2024 మధ్యలో వైసీపీ అవలంబించిన విధానాలతో అక్కడ జనాలు ఎప్పటికీ నమ్మరు అన్నది కూడా ఉంది. దాంతో పాటుగా అమరావతికి జై అంటే ఆ క్రెడిట్ మొత్తం కూటమికే పడుతుంది. దాంతో ఆల్టర్నేషన్ పాలిటిక్స్ ని చేస్తేనే వైసీపీకి రాజకీయంగా కానీ ఇతరత్రా కానీ ఉపయోగంగా ఉంటుంది అని అంటున్నారు.
కూటమి కోర్టులోనే బంతి :
అమరావతిని అంతా కోరుకుంటున్నారు. అయితే ఒక రాజధాని కోసం లక్షల కోట్లు పెట్టడం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంతే కాదు ఏపీ ఆర్ధిక పరిస్థితి చూస్తే ఇబ్బందిగా ఉంది. అప్పులు ఎక్కువగా చేస్తున్నారు. దాంతో పాటు రెండు లక్షల కోట్లు పెట్టి ఒక రాజధానిని నిర్మించడం అంటే ఏపీకి అది బిగ్ చాలెంజ్ గానే చూడాల్సి ఉంటుంది. మరో వైపు చూస్తే అమరావతి విషయంలో లేట్ అవుతున్న కొద్దీ ఆ ప్రాంతాల వాసులలో వ్యతిరేకత వస్తుంది. ఖర్చు పెరుగుతున్న కొద్దీ ఇతర ప్రాంతాలలో అసహనం బయలుదేరుతుంది. పైగా ఏ ప్రాజెక్ట్ అయినా ఫీజిబిలిటీ అన్నది కీలకంగా చెబుతారు. అమరావతిని తయారు చేసి ముందు పెట్టినా సంపద సృష్టి అంత సులువుగా తేలికగా జరిగేది అయితే ఉండదని కూడా మేధావుల నుంచి నిపుణుల మాట. వైసీపీ కూడా వీటిని ఆసరా చేసుకునే తన ఓల్డ్ స్టాండ్ కే కట్టుబడి ఉందని అంటున్నారు. మొత్తం మీద చూస్తే ఇపుడు కూటమి 2029 నాటికైనా అమరావతిని ఒక రూపూ షేపూ నకు తెచ్చి జనాలకు చూపించడం మీదనే వైసీపీ వ్యూహాలను దెబ్బ తీసేందుకు చాన్స్ ఉంటుంది అని అంటున్నారు.
