Begin typing your search above and press return to search.

కేరాఫ్ అమరావతి క్వార్టర్స్...వైసీపీ గృహ ప్రవేశం ఎపుడు ?

ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న 24న నాటి క్వార్టర్స్ ఓపెనింగ్ కార్యక్రమం గురించి వైసీపీ ప్రజా ప్రతినిధులకు కనీస సమాచారం లేదని అంటున్నారు.

By:  Satya P   |   21 Aug 2026 11:00 AM IST
కేరాఫ్ అమరావతి క్వార్టర్స్...వైసీపీ గృహ ప్రవేశం ఎపుడు ?
X

అమరావతిలో ఒక దశ నిర్మాణం పూర్తి అయింది. ఈ దశలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ప్రభుత్వం అమరావతిలో బ్రహ్మాండంగా నిర్మించిన క్వార్టర్స్ ని అందుబాటులోకి తెచ్చింది. వాటికి అధికారికంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తాళాలు ఎవరికి వారివి అప్పచెప్పే కార్యక్రమం ఉంది. అంగరంగ వైభవంగా దానిని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ నెల 24న అమరావతిలోని ప్రజా ప్రతినిధుల క్వార్టర్స్ ని చంద్రబాబు ప్రారంభించి తాళాలు ఆయా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు అప్పగిస్తారు. అయితే ఇందులో వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఉన్నారా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే ఇక్కడ వందల్లోనే క్వార్టర్స్ ని అత్యాధునిక సదుపాయాలతో నిర్మించారు. అంతే కాదు భవిష్యత్తులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పెరుగుతారు అన్న అంచనాతో రెట్టింపు క్వార్టర్స్ నే నిర్మించారు అని అంటున్నారు. మూడు వేల అయిదు వందల చదరపు విస్తీర్ణంతో ఒక్కో క్వార్టర్స్ ని రెడీ చేశారు.

వైసీపీ సిద్ధమేనా :

అయితే ఇక్కడే ఒక చర్చ మొదలైంది. వైసీపీ అమరావతిలో ప్రజా ప్రతినిధుల కోసం నిర్మించిన క్వార్టర్స్ లో ప్రవేశించి గృహ ప్రవేశం చేస్తుందా అన్నదే ఆ చర్చ. ఎందుకంటే అమరావతినే వైసీపీ తీవ్రంగా విమర్శిస్తూ వస్తోంది. గత ప్రభుత్వం హయాంలో వైసీపీ అమరావతిని పూర్తిగా పక్కన పెట్టేసింది. అంతే కాదు కొందరు మంత్రులు అయితే ఘాటు విమర్శలు చేశారు. మరి అలాంటి అమరావతి క్వార్టర్స్ లో కాపురం ఉంటే వైసీపీ ఎలా సమర్ధించుకోగలదు అన్నదే పెద్ద ప్రశ్న. అయితే దానికి వైసీపీ ప్రజా ప్రతినిధుల వద్ద జవాబు సిద్ధంగా ఉందిట. తాము అమరావతికి వ్యతిరేకం కాదని అమరావతి నిర్మాణాలలో జరిగే అవినీతికి మాత్రమే అని అంటున్నారు. మరి ఈ వాదన లాజిక్ వింటే మాత్రం కచ్చితంగా వైసీపీ ప్రజా ప్రతినిధులు ఈ క్వార్టర్స్ లోకి ప్రవేశిస్తారు అనిపిస్తుంది. కానీ అదంత సులువు కాదని అంటున్నారు.

సమాచారం లేదట :

ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న 24న నాటి క్వార్టర్స్ ఓపెనింగ్ కార్యక్రమం గురించి వైసీపీ ప్రజా ప్రతినిధులకు కనీస సమాచారం లేదని అంటున్నారు. ముందు తమకు సమాచారం ఇస్తే అప్పుడు కదా స్పందించేది అని అంటున్నారు. అయితే ప్రభుత్వం నుంచి అయితే ఏ రకమైన ఆలోచన ఉందో తెలియడం లేదని అంటున్నారు. ఇక వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు 11 మంది అసెంబ్లీలో ఉన్నారు. వారంతా అసెంబ్లీకి బాయ్ కాట్ చేస్తున్నారు. ముప్పయికి పైగా ఉన్న మండలి ఎమ్మెల్సీలు మాత్రం తప్పనిసరిగా హాజరవుతున్నారు. మరి ఎమ్మెల్సీలకు అయినా క్వార్టర్స్ విషయం చెబుతారా లేదా అన్న చర్చ ఉంది.

అది కూడా పాయింటేనా :

మరో వైపు చూస్తే ప్రజా ప్రతినిధులకు యాభై వేల రూపాయల దాకా హెచ్ఆర్ఏ ఇస్తున్నారు. క్వార్టర్స్ లో కాపురం ఉంటే అది కట్ చేస్తారు. అలాగని అమరావతిలో కాపురం ఇప్పటికిప్పుడు ఉంటారా అంటే అది కూడా కానే కాదని అంటున్నారు. దాంతో వైసీపీ ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో ఆలోచిస్తున్నారు అని అంటున్నారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన కనుక వస్తే మాత్రం అపుడు తమ పార్టీ అధినేత జగన్ తో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నారుట. చూడాలి మరి అమరావతి క్వార్టర్స్ ఓపెనింగ్ వైసీపీకి మరో పరీక్షను తెచ్చి పెడుతోంది అని అంటున్నారు.