అమరావతిలో అమరజీవి... స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్
అమరావతిలో ఏర్పాటు చేయబోయే అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహం నమూనాలను తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు.
By: Satya P | 16 Oct 2025 9:21 AM ISTతెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతిని అత్యంత ప్రతిష్టగా నిర్మిస్తోంది. అదే విధంగా ఆంధ్ర రాష్ట్రానికి విశేషంగా సేవ చేసిన ప్రముఖుల విగ్రహాలను కూడా అక్కడ కొలువు తీరేలా చూస్తోంది. భావి తరాలకు వారు చేసిన త్యాగాలను చాటడం ద్వారా ఆంధ్ర రాష్ట్ర చరిత్రను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తోంది
పొట్టి శ్రీరాములు విగ్రహంతో :
ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి పదకొండు జిల్లాల ఆంధ్రుల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటూ పొట్టి శ్రీరాములు అమరణ దీక్ష చేపట్టి సాధించారు. ఆయన కనుక ఆ రోజున పూనుకోకపోతే ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం వచ్చి ఉండేది కాదు. ఆయన తన జీవితాన్నే త్యాగం చేశారు. అందుకే అమరజీవి అయ్యారు. పొట్టి శ్రీరాములు రాష్ట్రాన్ని సాధించి చేసిన గొప్ప త్యాగానికి గుర్తుగా ఆయన పుట్టిన నెల్లూరు జిల్లాకు ఆయన పేరు పెట్టారు. ఇపుడు అమరావతిలో ఆయన విగ్రహం ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
నమూనాలను పరిశీలించిన బాబు :
అమరావతిలో ఏర్పాటు చేయబోయే అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహం నమూనాలను తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించారు. 58 అడుగుల పొట్టి శ్రీరాములు విగ్రహానికి స్టాట్యూ ఆఫ్ సాక్రిఫైస్ గా ఆయన పేరు పెట్టారు. ఇక అమరావతి రాజధాని ప్రాంతంలోని శాఖమూరులో ప్రభుత్వం కేటాయించిన ఏడు ఎకరాలలో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇక ఈ స్మృతి వనానికి గత నెల ఇప్పటికే మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు.
బాబు చేతుల మీదుగా :
ఇక వచ్చే ఏడాది మార్చి 16న పొట్టి శ్రీరాములు 125వ జయంతి నాటికి ఈ స్మృతివనంలో 58 అడుగుల విగ్రహాన్ని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అమరజీవి విగ్రహాల నమూనాలను స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించి వాటి మీద తన నిర్ణయం తెలియచేసారు. బాబు సూచనలతో అద్భుతమైన అమరజీవి విగ్రహాన్ని సాధ్యమైనంత తొందరలో రూపొందిస్తున్నారు. ఇక వచ్చే ఏడాది అమరావతి రాజధానిలో అమరజీవి కొలువు తీరుతారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్య వైశ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ 125 అడుగుల విగ్రహం తో పాటు ఆయన పేరుతో స్మృతి వనాన్ని అమరావతిలో నిర్మిస్తున్నారు. మొత్తానికి ఒక రోల్ మోడల్ గా అమరావతి రాజధానిని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కీలక చర్యలను తీసుకుంటోంది.
