అమరావతిలో ఏం జరుగుతోంది.. న్యూయార్క్ టైమ్స్ సెన్సేషన్ స్టోరీ
అమరావతి నగర నిర్మాణం భవిష్యత్ లో ప్రపంచ నగరాలకు దిశానిర్దేశం చేయనుందని న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది.
By: Tupaki Political Desk | 14 Aug 2026 3:09 PM ISTరాజధాని అమరావతి నిర్మాణం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఆధునిక నగరంగా ప్రపంచస్థాయి నిర్మాణ ప్రమాణాలతో రూపుదిద్దుకుంటున్న అమరావతి భవిష్యత్తులో పట్టణ ప్రణాళికలకు రోల్ మోడల్ గా నిలవనుందని అంతర్జాతీయ పత్రిక ‘ది న్యూయార్క్ టైమ్స్’ ప్రత్యేక కథనం వెలువరించింది. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, సరికొత్త పట్టణ ప్రణాళికా ప్రయోగంగా అభివర్ణిస్తూ ‘వన్ మేన్స్ క్విస్ట్ టు బుల్డ్ ఇండియాస్ మోస్ట్ లివబుల్ సిటీ’ (భారతదేశంలో అత్యంత నివాసయోగ్యమైన నగరాన్ని నిర్మించడానికి ఒక వ్యక్తి చేస్తున్న ప్రయత్నం) శీర్షిక ముఖ్యమంత్రి చంద్రబాబు కృషిని ప్రస్తావిస్తూ రాజధానిపై ఆర్టికల్ ప్రచురించింది.
అమరావతి నగర నిర్మాణం భవిష్యత్ లో ప్రపంచ నగరాలకు దిశానిర్దేశం చేయనుందని న్యూయార్క్ టైమ్స్ అభిప్రాయపడింది. సున్నా నుంచి ఒక మహానగరాన్ని సృష్టించాలన్న సంకల్పం ఎంతటి అద్భుతాలను సృష్టిస్తుందో అమరావతి నిరూపిస్తోందంటూ వెల్లడించింది. దేశంలోని మహానగరాలు అన్నీ తీవ్రమైన కాలుష్యం, రద్దీ, సరైన ప్రణాళిక లేకపోవడం వంటి సమస్యలతో సతమతమవుతున్నాయని, ఈ తరుణంలో అమరావతి నగర రూపకల్పన ఇటు దేశానికి, అటు ప్రపంచ దేశాలకు ఒక సరికొత్త మార్గదర్శకంగా నిలుస్తోందని పేర్కొంది. పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయకుండా, దాదాపు 60 శాతం మేర పచ్చదనం నీటి వనరులతో కూడిన హరిత నగరంగా దీనిని తీర్చిదిద్దుతుండటం విశేషమంటూ ప్రశంసించింది. ప్రసిద్ధ అంతర్జాతీయ ఆర్కిటెక్ట్స్ ప్రణాళికలతో, సైక్లింగ్ లేన్లు, జలమార్గాలు, అత్యాధునిక మౌలిక వసతులతో రూపుదిద్దుకుంటున్న తీరు భవిష్యత్ అర్బన్ ప్లానింగ్‌కు అసలైన బెంచ్‌మార్క్‌గా మారుతోందని స్పష్టం చేసింది.
అదేవిధంగా భవిష్యత్ సాంకేతికతలకు నిలయంగా అమరావతిని మలుస్తున్నారని తెలిపింది. డిజిటల్, డీప్-టెక్నాలజీ రంగానికి పెద్దపీట వేస్తూ ఏర్పాటు చేస్తున్న 'క్వాంటం వ్యాలీ', దేశ విదేశాల నుంచి దిగ్గజ సాంకేతిక సంస్థలను, యువతను ఆకర్షిస్తోంది. నగరంలో ఏర్పాటవుతున్న అత్యాధునిక క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాలు అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా గ్లోబల్ నాలెడ్జ్ అండ్ ఎకనామిక్ హబ్‌గా ఉన్నతీకరిస్తున్నాయని పేర్కొంది. ఇటువంటి బహుముఖ ప్రణాళికే ప్రపంచ దేశాల మేధావులను ఆకర్షిస్తున్న ప్రధానాంశంగా చెబుతున్నారు.
ఇక రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ను కోల్పోయిన బాధలో రాష్ట్రానికి ఒక అద్భుత రాజధాని ఉండాలనే కసితో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారని ప్రశంసించింది. సుమారు 25 వేల మంది కార్మికులతో రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేసింది. రాజధాని అమరావతికి రాజమార్గంగా చెబుతున్న సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశ పనులను ప్రారంభించి, రాజధాని నగరాన్ని జాతీయ రహదారితో అనుసంధానం చేసిన రోజునే ప్రతిష్టాత్మక పత్రికలో సానుకూల కథనం ప్రచురితం కావడంపై ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేస్తోంది. అమరావతి ప్రత్యేకతలను వివరిస్తూ న్యూయార్క్ టైమ్స్ ప్రచురించిన కథనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.
