5,000 ఎకరాల స్థలం, బోయింగ్ కూడా ల్యాండింగ్: అమరావతి విమానాశ్రయం స్పెషాలిటీస్ ఇంకా ఎన్నెన్నో...
ఒకే మెట్రోపాలిటన్ లేదా కేపిటల్ రీజియన్ పరిధిలో రెండు ఎయిర్‌పోర్టులు ఉండటం అనేది అంతర్జాతీయంగా విజయవంతమైన ప్రయోగంగా ప్రభుత్వ అనుకూల వర్గాలు వాదిస్తున్నాయి.
By: Tupaki Political Desk | 17 May 2026 12:41 PM ISTరాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దే వ్యూహంలో భాగంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో ప్రతిపాదిత అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి రూట్ మ్యాప్‌ను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఇప్పటికే విజయవాడ నగరానికి సమీపంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉండగా, భవిష్యత్తు అవసరాలు, పారిశ్రామిక వృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో ఈ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రతిపాదించిందని చెబుతున్నారు.
ఎయిర్‌పోర్ట్ ఎక్కడంటే?
ప్రభుత్వం విడుదల చేసిన మ్యాప్ ప్రకారం నూతన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అమరావతి పరిధిలోని తాడికొండ మండలం, రావెల గ్రామం సమీపంలో ఏర్పాటు చేయనున్నారు. ఇది ప్రస్తుత సచివాలయం నుంచి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో విజయవాడ నగరం నుంచి దక్షిణ దిశగా సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని చెబుతున్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు అత్యంత సమీపంలో ఈ ఎయిర్‌పోర్ట్ రాబోతుండటం వల్ల ప్రయాణికులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంటున్నారు.
దాదాపు 5,000 ఎకరాల విస్తీర్ణంలో ప్రపంచ స్థాయి సదుపాయాల కోసం ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నారు. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన భారీ బోయింగ్ 777 వంటి విమానాలు కూడా సులభంగా ల్యాండ్ అయ్యేలా రన్‌వేలను డిజైన్ చేస్తున్నారని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి.
ఒకే నగర పరిధిలో రెండు విమానాశ్రయాలు
ఒకే మెట్రోపాలిటన్ లేదా కేపిటల్ రీజియన్ పరిధిలో రెండు ఎయిర్‌పోర్టులు ఉండటం అనేది అంతర్జాతీయంగా విజయవంతమైన ప్రయోగంగా ప్రభుత్వ అనుకూల వర్గాలు వాదిస్తున్నాయి. దేశంలో ఇలాంటి మౌలిక వసతులు ఉన్న నగరాలుగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాలను ఉదహరిస్తున్నాయి. ఢిల్లీ ఎన్‌సీఆర్ లో ఇప్పటికే ఉన్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఒత్తిడి తగ్గించేందుకు, గ్రేటర్ నోయిడాలో భారీ ఎత్తున జెవార్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మిస్తున్నారని ప్రభుత్వం చెబుతోంది. అదేవిధంగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎయిర్‌పోర్ట్‌కు అదనంగా, నవీ ముంబైలో మరో విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెస్తున్నారని చెబుతున్నారు. ఇక బెంగళూరు హెచ్‌ఏఎల్ పాత ఎయిర్‌పోర్ట్ ఉండగానే, నగర శివార్లలో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించారని గుర్తు చేస్తున్నారు.
రెండు ఎయిర్‌పోర్టులతో ప్రయోజనాలు
రాజధాని అమరావతి రీజియన్‌లో గన్నవరం, రావెల ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి రావడం వల్ల బహుముఖ ప్రయోజనాలు కలగనున్నాయని అంటున్నారు. భవిష్యత్తులో అమరావతి రాజధానిగా పూర్తిస్థాయిలో విస్తరించినప్పుడు వచ్చే ప్రయాణికుల రద్దీని, విమానాల రాకపోకలను ఒకే ఎయిర్‌పోర్ట్ భరించలేదని అంటున్నారు. రెండు విమానాశ్రయాలు ఉండటం వల్ల ఎయిర్ ట్రాఫిక్ విభజన జరిగి ప్రయాణం సాఫీగా సాగుతుందని చెబుతున్నారు. అదేవిధంగా అమరావతి ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ కార్గో హబ్‌గా మార్చే అవకాశం ఉందని అంటున్నారు. దీనివల్ల కృష్ణా, గుంటూరు పరిసర జిల్లాల నుంచి వ్యవసాయ ఉత్పత్తులు, సాఫ్ట్‌వేర్, ఫార్మా ఎగుమతులు నేరుగా విదేశాలకు వెళ్తాయని ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి.
