Begin typing your search above and press return to search.

క్వార్టర్స్ రెడీ....అమరావతిలో కాపురమే తరువాయి

ఇదిలా ఉంటే అమరావతి రాజధానిలో నిర్మాణం పూర్తైన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల భవన సముదాయాన్ని చంద్రబాబు తాజాగా పరిశీలించి పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు.

By:  Satya P   |   13 Aug 2026 11:27 PM IST
క్వార్టర్స్ రెడీ....అమరావతిలో కాపురమే తరువాయి
X

ఎమ్మెల్యే క్వార్టర్స్ అమరావతి రాజధానిలో సిద్ధం అయ్యాయి. అవి చూస్తే అద్భుతంగా ఉన్నాయి. మహా నగరాలలోని ఏ రాజ ప్రసాదాలకు తీసిపోని విధంగా వాటిని అత్యాధునికంగా నిర్మించారు. అంతే కాదు విశాలమైన ప్రాంగణాలు, క్రీండా వసతులు సహా అన్నీ సమకూర్చి పెట్టారు. ఇవన్నీ చూస్తే అమరావతి రాజధానిలో ఎమ్మెల్యే క్వార్టర్స్ భూతల స్వర్గాన్ని తలపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఎమ్మెల్యేలు అంతా అమరావతికి రావాలంటే విజయవాడలో బస చేసి వస్తూండేవారు. లేదా తామున్న ప్రాంతం నుంచి వచ్చి వెళ్ళిపోతూండేవారు, ఇపుడు ఆ బాధ అయితే లేదని అంటున్నారు.

మొత్తం సిద్ధంగానే :

ఇదిలా ఉంటే అమరావతి రాజధానిలో నిర్మాణం పూర్తైన ఎమ్మెల్యే ఎమ్మెల్సీల భవన సముదాయాన్ని చంద్రబాబు తాజాగా పరిశీలించి పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేశారు. రాయపూడి వద్ద 12 టవర్లుగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీల నివాస భవన సముదాయం నిర్మించబడింది. ఒక్కోక్కటీ 3500 చదరపు అడుగుల వైశాల్యంతో 288 ఫ్లాట్లను నిర్మించి సీఆర్డీఏ శభాష్ అనే తీరుని చాటుకుంది. అధునాతనంగా నిర్మించిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఫ్లాట్లను మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్లతో కలిసి పరిశీలించిన చంద్రబాబు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. రాజధానికి సరి కొత్త హంగులు ఏర్పడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ఎమ్మెల్యే క్వార్టర్స్ ని పరిశీలిస్తూ అక్కడ నిర్మాణాల తీరుని గమనించి హర్షం వ్యకం చేశారు.

అన్ని రకాల సదుపాయలతో :

ఇదిలా ఉంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇక అమరావతిలో కాపురం ఉండేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఆకాశాన్ని అందుకునేలా అన్ని రకాల సదుపాయలతో నిర్మించిన ఈ క్వార్టర్స్ ని చూసిన వారు ఎవరూ విడిచి ఉండేది లేదు. మరో వైపు చూస్తె రాజధాని నగరంలో ప్రజా ప్రతినిధులకు క్వార్టర్స్ ఇవ్వడం సబబు. కానీ విభజన తరువాత ఏపీకి సరైన రాజధాని లేకపొవడంతో పుష్కర కాలంగా ప్రజా ప్రతినిధులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇపుడు వారి కష్టాలు తీరబోతున్నాయి అని అంటున్నారు.

వారు గృహ ప్రవేశం చేస్తే :

ఈ నేపధ్యంలో ప్రజా ప్రతినిధులుగా ఉన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు గృహ ప్రవేశం చేస్తే కనుక అమరావతి రాజధాని ప్రజా రాజధానిగా మారడానికి తొలి అడుగు పడుతుంది. ఆ మీదట మిగిలిన భవనాలు కూడా సిద్ధం అయి మొత్తం అన్ని రకాలైన సిబ్బంది అడుగు పెడతారు. అలాగే మంత్రుల క్వార్టర్స్ కూడా రెడీ అవుతోంది. దాంతో రాజధానిలో అధికార అలికిడి సందడి నెలకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.

నిర్మాణంలో మొదటి మెట్టు :

ఇదే సందర్భంలో సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభంతో రాజధాని అమరావతికి రాజమార్గం ఏర్పాటు అయ్యిందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో అమరావతి నిర్మాణంలో ఇది మొదటి మెట్టు అని ఆయన స్పష్టం చేశారు. ఉండవల్లి వద్ద రాజధాని అమరావతిని విజయవాడ మంగళగిరి గుంటూరులతో కలిపే కలిపే ప్రధాన రహదారి సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ 3ని ఆయన ప్రారంభించారు. సీడ్ యాక్సెస్ రహదారిని అనుసంధానించేలా బకింగ్ హామ్ కాలువపై నిర్మించిన స్టీల్ బ్రిడ్జిలను కూడా బాబు ప్రారంభించారు. స్టీల్ బ్రిడ్జిలను ప్రారంభించటంతో రాజధాని నగరానికి మెరుగైన కనెక్టివిటీ వచ్చినట్టైంది. మూడో దశలో మణిపాల్ ఆస్పత్రి సమీపంలో జాతీయ రహదారి 16కు అనుసంధానించేలా ప్రణాళిక చేశారు. దీనికి రూ.1,519 కోట్ల వ్యయం కానుంది. ఇవన్నీ చూసిన తరువాత రాష్ట్రాభివృద్ధి విజన్‌కు అమరావతి నగర నిర్మాణం మొట్టమొదటి సక్సెస్ అని బాబు వ్యాఖ్యానించారు.

ప్రత్యేకంగా ఉండాలనే :

అమరావతి రాజధానిలో ప్రభుత్వ కాంప్లెక్సు భవనాలు ప్రత్యేకంగా ఉండాలని ప్రముఖ ఆర్కిటెక్టులతో డిజైన్లు చేయించామని చంద్రబాబు చెప్పారు. అమరావతితో పాటు అన్ని ప్రాంతాలకూ అభివృద్ధి వికేంద్రీకరించేలా ప్రణాళికలు చేశామని అన్నారు. అమరావతి రాజధానికి రాజమార్గం సీడ్ యాక్సెస్ రోడ్డు అందుబాటులోకి వచ్చేసిందని చెప్పారు. అమరావతి రాజధాని పూర్తి కాలుష్య రహిత నగరంగా మారుతుంది. డీప్‌టెక్ క్యాపిటల్ గా దీనిని తయారు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఐదు ముఖ్యమైన అంశాలతో రాజధాని నిర్మాణం చేపడుతున్నామని బాబు గుర్తు చేశారు. నో పోల్స్ బ్లూ గ్రీన్ గ్రీన్ ఎనర్జీ క్వాంటం డీప్ టెక్ లాంటి ఐదు కాన్సెప్టులతో నిర్మాణం జరుగుతోందని అన్నారు. ఏఐ, క్వాంటం కంప్యూటర్ వ్యాలీగా అమరావతి మారుతుంది. టాప్ అయిదు నగరాల్లో ఒకటిగా తయారవుతుందని బాబు విశ్వాసం వ్యక్తం చేశారు.