మంత్రి నారాయణకు రాజధాని రైతుల షాక్.. రెండో విడత భూసమీకరణలో ట్విస్ట్
రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.
By: Tupaki Political Desk | 7 Jan 2026 5:51 PM ISTరాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. బుధవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు తుళ్లూరు మండలం వడ్లమానులో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ పర్యటించగా, రైతులు పలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. మూడేళ్లలో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం అగ్రిమెంట్ చేయాలని, లేనిపక్షంలో పరిహారం చెల్లిస్తామని లిఖితపూర్వకంగా రాసివ్వాలని రైతులు స్పష్టం చేశారు. ప్రభుత్వం హామీ ఇస్తుందని మంత్రులు, ఎమ్మెల్యే నచ్చజెప్పే ప్రయత్నం చేసినా రైతులు ససేమిరా అన్నారు. దీంతో గ్రామసభలో కాసేపు గందరగోళం చోటుచేసుకుంది.
రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణలో భాగంగా తుళ్లూరు, అమరావతి మండలాల్లోని ఏడు గ్రామాల రైతుల నుంచి సుమారు 16,666 ఎకరాలను సమీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం బుధవారం రైతుల నుంచి అంగీకార పత్రాలను అధికారులు స్వీకరించేందుకు వడ్లమాను గ్రామంలో గ్రామసభ నిర్వహించారు. అయితే ప్రభుత్వానికి భూములు ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేకపోయినా, మూడేళ్లలో భూమి అభివృద్ధి చేస్తామని లేని పక్షంలో నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వం లిఖితపూర్వకంగా అగ్రిమెంట్ చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
భూ సమీకరణకు రైతులు సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ కొత్త నిబంధన విధించడంపై మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ షాక్ తిన్నారు. మూడేళ్లలో అభివృద్ధి జరుగుతుందని తాను హామీ ఇస్తానని, తనపై నమ్మకం ఉంచాలని ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ చెప్పగా, రైతులు తోసిపుచ్చారు. మీ మాటపై నమ్మకం ఉందని, కానీ గతంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఐదేళ్ల పాటు కోర్టులు చుట్టూ తిరగాల్సివచ్చిందని, భవిష్యత్తులో తాము అలాంటి తిప్పలు పడకుండా ఉండాలంటే తమకు సరైన విధంగా అగ్రిమెంట్ చేయాలని కోరారు.
ఈ సమయంలో మంత్రి నారాయణ కల్పించుకుని పాతచట్టంలోనే భములకు రక్షణ కల్పించామని చెప్పారు. అయితే ఆయన వాదనతో రైతులు ఏకీభవించలేదు. చట్టం పటిష్టంగా లేకపోవడం వల్ల 2014-19 మధ్య రైతులు అగాచాట్లు పడ్డారని తెలిపారు. తమ డిమాండ్ ఒక్కటేనని మూడేళ్లలో అభివృద్ధి చేస్తామని అగ్రిమెంట్ లో నిబంధన పెట్టాలని లేనిపక్షంలో నష్టపరిహారం చెల్లించాల్సిందేనంటూ పట్టుబట్టారు. ప్రభుత్వానికి మూడేళ్ల సమయం సరిపోదంటే నాలుగేళ్ల సమయం తీసుకున్నా తమకు అంగీకారమేనని రైతులు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అభివృద్ధి చేయలేకపోతే నష్టపరిహారం చెల్లిస్తామనే నిబంధన అగ్రిమెంట్ లో ఉండాల్సిందేనని రైతులు తేల్చిచెప్పారు.
