Begin typing your search above and press return to search.

అమరావతిలో అన్ స్టాపబుల్ ... మరో ఇరవై వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ !

ఇక ఈ భూసమీకరణ అన్నది గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని పలు గ్రామాలలో చేపడతారు. అలా పెదమద్దూరు హరిశ్చంద్రాపురం వైకుంఠపురం తాడికొండ కంతేరు వంటి ప్రాంతాలలో భూసేకరణ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది.

By:  Satya P   |   19 Sept 2026 8:32 AM IST
అమరావతిలో అన్ స్టాపబుల్ ... మరో ఇరవై వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ !
X

అమరావతి రాజధాని విషయంలో భూ సమీకరణ నిరంతర ప్రక్రియగా సాగుతోంది. ఎందుకు అంటే అభివృద్ధి కోసమే అని అంటున్నారు. ఇప్పటికే వేలాది ఎకరాల భూమిని సేకరించారు. మొదట యాభై వేల ఎకరాలు సేకరించారు. ఆ తరువాత మరో విడతలో కూడా భూమిని సేకరించారు. ఇలా విడతల వారీగా భూ సమీకరణ సాగుతూనే ఉంది. ఇపుడు కొత్తగా మరో ఇరవై వేల ఎకరాల భూమి కావాలని మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ అంటున్నారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి కోసమే ఈ భూ సమీకరణ అన్నారు ఈ విషయంలో తొందరలోనే కేబినెట్ సమావేశంలో సమగ్ర ప్రతిపాదనలను ప్రవేశపెట్టనున్నామని చెప్పారు.

ఎయిర్ పోర్టు కోసం అంటూ :

ఇక ఇరవై వేల ఎకరాల భూమి ఎందుకు అంటే అమ‌రావ‌తిలో ఎయిర్‌పోర్ట్ కోసం అని మంత్రి నారాయణ చెబుతున్నారు. మొత్తంగా ఇరవై వేల ఎకరాలు తీసుకుంటే ఎయిర్‌పోర్ట్ కోసం అందులో అయిదు వేల ఎక‌రాలు పోతుందని చెప్పారు. ఇక మిగిలినవి రోడ్లు, బేసిక్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్‌కు వెళ్తుందని కూడా లెక్క చెప్పారు. అమరావతిలో మెగా ఎయిర్‌పోర్ట్ నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసమే ఈ భూసమీకరణ అని అన్నారు. ఈ ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్‌కు ఆమోదం తెలపడం కోసం మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు అని చెప్పారు.

ఇప్పటిదాకా ఎన్ని విడతలు :

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి దానిని మెగా సిటీగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా భూ సమీకరణను ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తోంది అని అంటున్నారు. రాజధాని ప్రాంతాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతోనే ఈ విస్తరణ పనులు జరుగుతున్నాయని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. భూసమీకరణలో భాగంగా మొదటి విడతలో అంటే రాజధాని నిర్మాణ ప్రారంభంలోనే ప్రభుత్వం సుమారుగా 54 వేల 374 ఎకరాల భూమిని రైతుల నుండి స్వచ్ఛంద భూ సమీకరణ ద్వారా సేకరించింది. అంతే కాకుండా రాజధానిని మరింత విస్తరించడానికి అంతర్జాతీయ విమానాశ్రయం స్మార్ట్ పరిశ్రమలు, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ ఇతర సంస్థల ఏర్పాటు కోసం ప్రభుత్వం రెండో విడతను ప్రారంభించింది. ఈ దశలో మొదట సుమారు 20,494 ఎకరాల సేకరణకు ఏపీ సీఆర్డీఏ నోటిఫికేషన్ ఇచ్చింది.

ఈ గ్రామాల నుంచే :

ఇక ఈ భూసమీకరణ అన్నది గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని పలు గ్రామాలలో చేపడతారు. అలా పెదమద్దూరు హరిశ్చంద్రాపురం వైకుంఠపురం తాడికొండ కంతేరు వంటి ప్రాంతాలలో భూసేకరణ ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. మొత్తం సేకరించిన భూమిని చూస్తే కనుక ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన తాజా జీవోల ప్రకారం వివిధ దశల్లో కలిపి అమరావతి రాజధాని పరిధిలో మొత్తం భూ సమీకరణ సుమారు 83 వేల 424 ఎకరాలకు చేరుకుంది అని అంటున్నారు. రాజధాని అభివృద్ధి కోసం ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలతో పాటు భూమిని ఇచ్చిన రైతులకు భరోసా కల్పించడానికి అభివృద్ధి వేగవంతం చేయడానికి ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది. అందులో భూములు అందజేసిన రైతులకు సీఆర్డీఏ నిబంధనల ప్రకారం వార్షిక కౌలు మొత్తాన్ని ఎప్పటికప్పుడు వేగంగా విడుదల చేస్తున్నారు. ఎకరం కంటే తక్కువ భూమి ఉన్నవారికి కూడా 40 వేల రూపాయలు కౌలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నారు.

భూములు ఇచ్చిన వారి కోసం :

అంతే కాకుండా రాజధానిలో అభివృద్ధి చేసిన ప్లాట్ల కేటాయింపులు కూడా చేస్తున్నారు. అలా రైతులకు నివాస వాణిజ్య ప్రాంతాల్లో అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించే ప్రక్రియ సైతం సాగుతోంది. ప్రభుత్వం రాబోయే మూడేళ్లలో అమరావతిలో ప్రధాన మౌలిక వసతుల పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకుని అవసరమైన చోట భూసేకరణ చట్టం ద్వారా కూడా మిగిలిన భూములను సేకరిస్తూ పనులను వేగవంతం చేస్తోంది. ఈ నేపధ్యంలోనే మంత్రి నారాయణ కొత్తగా ఇరవై వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ చేస్తామని ప్రకటించారని అంటున్నారు.