'అమరావతి' భూ సమీకరణకు 11 ఏళ్లు.. హ్యాపీసేనా.. ?
రైతులకు కమర్షియల్ ప్లాట్లు సహా.. నివాసానికి ఉపయోగంగా ఉండేలా స్థలాలను కూడా ఇస్తామని హామీ ఇచ్చారు.
By: Garuda Media | 5 Jan 2026 11:09 PM ISTఏపీ రాజధాని అమరావతికి భూసమీకరణ జరిగి.. 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2015లో ప్రారంభమైన.. భూ సమీకరణ.. అప్పట్లోనేకాదు.. ఇప్పుడు ఓ రికార్డుగా మారింది. ఎక్కడెక్కడి నుంచో ప్రభుత్వాలు వచ్చి మరీ ఈ సమీకరణపై అధ్యయనం చేశాయి. సేకరణ స్థానంలో తొలిసారి చంద్రబాబు చేసిన ఈ ప్రయోగం సక్సెస్ అయింది. నిజానికి 2015 వరకు ప్రభుత్వాలకు ఏ అవసరం వచ్చినా.. రైతులు, సాధారణ ప్రజల నుంచి సేకరణ విధానంలోనే భూములు తీసుకుంటున్నాయి.
2013లో భూసేకరణకు నూతనంగా చట్టం కూడా తీసుకువచ్చారు. కేంద్రం చేసిన ఈ చట్టమే ఇప్పటి వర కు కీలక భూమిక పోషిస్తోంది. అయితే.. దీనివల్ల నష్టపరిహారాలు ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఒకింత లోతుగా ఆలోచించిన సీఎం చంద్రబాబు.. ప్రభుత్వాలకు భారీ భారంగా మారకుండా.. సేకరణ విధానాన్ని అమలు చేశారు. తద్వారా.. తక్షణం ప్రభుత్వాలపై భారం పడకుండా.. వ్యవహరించా రు. ఈ క్రమంలోనే తొలిదశలో 33 వేల ఎకరాలను తీసుకున్నారు.
రైతులకు కమర్షియల్ ప్లాట్లు సహా.. నివాసానికి ఉపయోగంగా ఉండేలా స్థలాలను కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కైలు కూడా ఇస్తున్నారు. ఈ ప్రతిపాదనలకు తోడు.. రైతులకు ఇప్పటికే ఉన్న భూములకు కూడా ధరలు భారీగా పెరిగాయి. ఈ పరిణామంతో తొలిదశ భూసమీకరణ విజయవంతం అయింది. కొందరు మాత్రమే ఇవ్వడానికి వెనుకంజ వేసినా.. వారిని కూడా ఒప్పించారు. ఇలా.. భూసమీకరణ ప్రక్రయ 11 ఏళ్ల కిందట విజయవంతంగా సాగింది. రైతులకు.. బట్టలు పెట్టి.. కానుకలు కూడా ఇచ్చారు.
ఇక, వైసీపీ వచ్చిన తర్వాత.. రాజధాని మరుగున పడింది. దీంతో రైతులు ఇబ్బంది పడ్డారు. తిరిగి కూటమి సర్కారు వచ్చేందుకు వారు కృషి చేశారు. ఇక, ఇప్పుడు కూడా 44 వేల ఎకరాల భూ సమీకరణకు ప్రభుత్వం రెడీ అయింది. అయితే.. తొలినాళ్లలో ఉన్న జోష్ , సంతోషం ఆనందం.. ఇప్పుడు కనిపించడం లేదు. ఈ విషయాన్ని అధికారులు కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు రైతులను ఆనందించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. అదే జరిగితే.. దేశంలో అమరావతి భూ సమీకరణ ఒక రికార్డుగా మారనుందనడంలో సందేహం లేదు.
