Begin typing your search above and press return to search.

కరెంటు స్తంభాలు ఉండవు.. తీగలు అసలే కనిపించవు! దేశంలోనే తొలి 'పోల్-ఫ్రీ' నగరంగా అమరావతి

రాజధాని అమరావతి పనులు చకచకగా సాగుతున్నాయి. 2028 నాటికి రాజధాని తొలిదశ పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ప్రకటించారు.

By:  Tupaki Political Desk   |   2 Aug 2026 5:23 PM IST
కరెంటు స్తంభాలు ఉండవు.. తీగలు అసలే కనిపించవు! దేశంలోనే తొలి పోల్-ఫ్రీ నగరంగా అమరావతి
X

రాజధాని అమరావతి పనులు చకచకగా సాగుతున్నాయి. 2028 నాటికి రాజధాని తొలిదశ పనులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం రాజధానికి రాజమార్గమైన సీడ్ యాక్సెస్ రోడ్డుతోపాటు అంతర్గత రహదారుల నిర్మాణాలు శరవేగంగా చేస్తున్నారు. ఇదే సమయంలో ఐకానిక్ టవర్స్ నిర్మాణాలు, ఇతర ప్రభుత్వ భవనాల పనులు పరుగులు తీయిస్తున్నాయి. అయితే వీటికి సమాంతరంగా అమరావతికి అంతర్జాతీయ స్థాయి నగరంలో తీర్చిదిద్దేలా ప్రభుత్వం పోల్ ఫ్రీ కేపిటల్ గా మార్చుతోంది. దేశంలో ఏ ఇతర నగరాల్లో లేనట్లు భూగర్భ కేబుల్ వ్యవస్థ ద్వారా అమరావతికి ఒక అధునాతన నగరంగా ప్రభుత్వం నిర్మిస్తోంది.

మన దేశంలోని ఏ నగరంలో చూసినా కళ్లకు కనిపించే ఒకే ఒక సాధారణ దృశ్యం రోడ్ల వెంబడి వేలాడే విద్యుత్ తీగలు, ఇంటర్నెట్ కేబుల్స్, ప్రమాదకరమైన కరెంట్ పోల్స్. అయితే రాజధాని అమరావతిలో ఇలాంటి దృశ్యాలు కనిపించకుండా ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతోందని చెబుతున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా 'పోల్-ఫ్రీ'), ఓవర్ హెడ్ కేబుల్స్-రహిత నగరంగా అమరావతి రూపుదిద్దుకుంటోందని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇది భవిష్యత్ తరాల కోసం తలపెట్టిన ఒక అద్భుతమైన అర్బన్ ఇంజనీరింగ్ విప్లవంగా చెబుతున్నారు.

దేశంలోని నగరాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో విద్యుత్ అంతరాయాలు, వర్షాకాలంలో మునిగిపోయే రహదారులు, ప్రతిసారీ కేబుల్స్, పైప్‌లైన్ల కోసం రోడ్లను తవ్వడం వంటివి ప్రధానమైనవి. ఈ సమస్యలన్నింటికీ అమరావతి మాస్టర్ ప్లాన్ అత్యంత శాశ్వతమైన, శాస్త్రీయమైన పరిష్కారాన్ని చూపుతోందని అంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో సింగపూర్, టోక్యో, దుబాయ్ వంటి నగరాలు అనుసరిస్తున్న అత్యాధునిక మౌలిక వసతుల విధానాన్ని అమరావతిలో అమలు చేస్తున్నారు. ముఖ్యంగా నగర సౌందర్యానికి ఎటువంటి భంగం కలగకుండా, పర్యావరణ హితంగా, అత్యంత సురక్షితమైన వాతావరణంలో ఈ రాజధాని నిర్మాణం సాగుతోంది.

పోల్-ఫ్రీ, అండర్‌గ్రౌండ్ యుటిలిటీస్ ప్రత్యేకతలు

సాధారణ నగరాల్లో విద్యుత్ సరఫరా, టెలిఫోన్, ఇంటర్నెట్ కేబుల్స్ అన్నీ రోడ్ల వెంట పెద్ద పెద్ద పోల్స్ మీద వేలాడుతూ ఉంటాయి. దీనివల్ల నగర సౌందర్యమే కాకుండా, ఈదురు గాలులు, తుఫానులు వచ్చినప్పుడు విద్యుత్ వ్యవస్థ క్షణాల్లో అస్తవ్యస్తమవుతుంది. కానీ అమరావతిలో ఈ సమస్య తలెత్తకుండా ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు. అత్యుత్తమ అండర్‌గ్రౌండ్ టెక్నాలజీని వాడుతున్నారు.

తుఫానులు, ఈదురుగాలులు, భారీ వర్షాల వల్ల విద్యుత్ అంతరాయం కలగకుండా హై-టెన్షన్ పవర్ లైన్స్ సహా అన్ని విద్యుత్ కేబుల్స్‌ను భూగర్భంలో అత్యంత పటిష్టంగా అమర్చుతున్నారు. రోడ్ల పక్కన డ్రైనేజీ కాలువలకు ఆనుకుని సుమారు 700 కి.మీ. మేర భూగర్భ డక్ట్‌లను నిర్మిస్తున్నారు. ఇందులో విద్యుత్, టెలిఫోన్, ఇంటర్నెట్, గ్యాస్ పైప్‌లైన్లు అన్నీ ఒకే వ్యవస్థలో భూమిలో ఉంటాయి. ఏదైనా కొత్త కేబుల్ వేయాలన్నా లేదా రిపేర్ చేయాలన్నా మళ్లీ రోడ్లు తవ్వాల్సిన అవసరం లేకుండా ప్రత్యేకమైన వాకింగ్ టన్నెల్స్, డక్ట్‌ల ద్వారా ఇంజనీర్లు నేరుగా లోపలికి వెళ్లి పనులు చేసుకునేలా రూపకల్పన చేశారు.

బ్లూ-గ్రీన్ కాన్సెప్ట్, డిజాస్టర్-ప్రూఫ్ టెక్నాలజీ

అమరావతి మాస్టర్ ప్లాన్ పూర్తిగా బ్లూ-గ్రీన్ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందించారు. కృష్ణా నది తీరాన రూపుదిద్దుకుంటున్న ఈ రాజధానిలో పర్యావరణ పరిరక్షణకు, నీటి నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. నగరంలో ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసుకునేలా ప్రణాళికలు ఉన్నాయి. నగరంలో వర్షపు నీరు ఎక్కడా నిలవకుండా అత్యాధునిక స్టార్మ్‌వాటర్ డ్రైన్స్, తాగునీటి సరఫరా కోసం 24/7 పైప్‌లైన్లు, రీ-యూజ్డ్ వాటర్ లైన్లు, అత్యాధునిక సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటవుతున్నాయి. దీనివల్ల అమరావతి కేవలం అందమైన నగరంగానే కాకుండా, ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా తట్టుకునే 'డిజాస్టర్-ప్రూఫ్' రాజధానిగా నిలుస్తోంది.

ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ వంటి అంతర్జాతీయ ఆర్థిక సంస్థల భాగస్వామ్యంతో రూ. 11,467 కోట్ల భారీ నిధులతో ఈ మౌలిక వసతుల నిర్మాణం వేగంగా సాగుతోంది. ఏపీసీఆర్‌డీఏ ఆధ్వర్యంలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. విద్యుత్ పోల్స్ లేని, తీగల చిక్కులు లేని, పచ్చని చెట్లతో, అండర్‌గ్రౌండ్ టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్న అమరావతి దేశ భవిష్యత్ పట్టణాభివృద్ధికి ఒక సరికొత్త దిశానిర్దేశంగా వ్యాఖ్యానిస్తున్నారు. దశాబ్దాల తరబడి మన దేశం ఎదుర్కొంటున్న నగర నిర్మాణ సవాళ్లకు సమాధానం చెబుతూ, గ్లోబల్ సిటీగా అమరావతి రూపాంతరం చెందుతుందని ప్రభుత్వ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.