ఏపీకి భారీ బూస్ట్.. హైదరాబాద్ ను మార్చిన మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు అమరావతిలో..
ఏపీ రాజధాని అమరావతి టెక్నాలజీ హబ్ గా మారనుంది. దేశంలో తొలి క్వాంటం కంప్యూటర్ వ్యాలీని ఇక్కడ ఏర్పాటుచేస్తుండగా, దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ కూడా పెట్టుబడులకు సిద్ధమైంది.
By: Tupaki Political Desk | 7 Nov 2025 3:28 PM ISTఏపీ రాజధాని అమరావతి టెక్నాలజీ హబ్ గా మారనుంది. దేశంలో తొలి క్వాంటం కంప్యూటర్ వ్యాలీని ఇక్కడ ఏర్పాటుచేస్తుండగా, దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ కూడా పెట్టుబడులకు సిద్ధమైంది. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ విప్లవానికి నేను సైతం అంటున్న మైక్రోసాఫ్ట్ రూ.1,772.08 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. 1,200 క్యూబిట్ సామర్థ్యం ఉన్న (50 లాజికల్ క్యూబిట్స్) భారీ క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో మైక్రోసాఫ్ట్ నుంచి ఈ పెట్టుబడుల ప్రకటన వచ్చిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ తో చంద్రబాబు ఎప్పటి నుంచో సత్సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడే మైక్రోసాఫ్ట్ కార్యాలయాన్ని హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ దిగ్గజ సంస్థ రాకతో ఐటీ రంగంలో హైదరాబాద్ ముఖచిత్రమే మారిపోయింది. ప్రపంచస్థాయి నగరంగా ఎదిగింది. అందుకే హైదరాబాద్ అభివృద్ధిలో మైక్రోసాఫ్ట్ పాత్రను ప్రత్యేకంగా చెబుతారు. అలాంటి సంస్థ ఏపీలో పెట్టుబడులకు రెడీ అవడంపై సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
ఇప్పటికే అమరావతిలో 133 క్యూబిట్ సామర్థ్యంతో ఐబీఎం సంస్థ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎల్ అండ్ టీ భాగస్వామ్యంతో ఈ కేంద్రం నిర్మాణం చురుగ్గా సాగుతోంది. వచ్చే ఏడాది జనవరిలో ఐబీఎం క్వాంటం కంప్యూటర్ ను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వంతోపాటు ఐబీఎం కూడా చెబుతోంది. ఈ పరిస్థితుల్లో మైక్రోసాఫ్ట్ తోపాటు మరికొన్ని సంస్థలు అమరావతిలో క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటుకు ముందుకు రావడం గొప్పపరిణామంగా వ్యాఖ్యానిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ కోసం క్వాంటమ్ వ్యాలీలో 4 వేల చ.అ. విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించాల్సి ఉంటుందని అధికార వర్గాల సమాచారం.
అమరావతి క్వాంటమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టేందుకు హైక్రోసాఫ్ట్ తోపాటు మరిన్ని సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఐబీఎం, మైక్రోసాఫ్ట్ బాటలోనే జపాన్‌కు చెందిన ఫుజిసు సంస్థ కూడా 64 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఇనీషియేటివ్ కింద అందించే నిధులకు మరో 50 శాతం వెచ్చించి ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటుకు ఫుజిసు ముందుకొచ్చిందని అధికారులు చెబుతున్నారు. ఇక క్వాంటమ్ వ్యాలీలో పరిశోధనలు నిర్వహించే సంస్థలకు దశల వారీగా 90 లక్షల చదరపు అడుగుల్లో మౌలిక వసతులను సమకూర్చాల్సివుంటుంది. ప్రస్తుతం నిర్మించనున్నఎల్ అండ్ టీ నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ వల్ల 40 వేల చదరపు అడుగుల స్పేస్ అందుబాటులోకి రానుంది.
అమరావతిని క్వాంటమ్ కంప్యూటింగ్, డీప్ టెక్నాలజీ, ఇన్నోవేషన్ కేంద్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాజధానిలో ‘క్వాంటమ్ వ్యాలీ’కోసం 50 ఎకరాల స్థలాన్ని సీఆర్డీఏ కేటాయించింది. ఈ క్వాంటమ్ వ్యాలీలో దేశీయ, అంతర్జాతీయ యూనివర్సిటీలు, స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలు, ఇండస్ట్రీలు అందరికీ అత్యాధునిక కంప్యూటింగ్ సేవలను అందనున్నాయి. దీనిని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ (AQCC)అనే సంస్థను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
కాగా, రాజధాని పరిధిలోని విట్ యూనివర్సిటీలో కూడా క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బెంగళూరుకు చెందిన క్యూపై ఏఐ సంస్థ అభివృద్ధి చేసిన చిన్న క్వాంటమ్ కంప్యూటర్‌ను విట్ లో ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం కోసం అయ్యే సుమారు రూ.6 కోట్ల ఖర్చును విట్ స్వయంగా భరిస్తుంది. ఈ ప్రాజెక్టుకు అద్దె లేదా వినియోగ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొంది.
