'క్వాంటం'లో కీలక అడుగు.. 7న శంకుస్థాపన, బిగ్ అప్డేట్
ఫిబ్రవరిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన చేయడం ద్వారా రాష్ట్రంలో ఒక కొత్త తరం ఆర్థిక వ్యవస్థకు పునాది పడుతోందని అంటున్నారు.
By: Tupaki Political Desk | 3 Feb 2026 5:03 PM ISTఏపీ రాజధాని అమరావతి గ్లోబల్ బ్రాండ్ గా మారుతోంది. ఈ నెల 7న దేశంలోనే మొట్టమొదటి క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాజధాని పరిధిలోని ఉద్దండరాయుని పాలెంలో ఏపీ సీఆర్డీఏ కేటాయించిన 50 ఎకరాలలో క్వాంటం వ్యాలీకి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ చేయనున్నారు. నిజానికి ఈ నెల 6నే ఈ కార్యక్రమం నిర్వహించాలని ప్రభుత్వం ముందుగా నిర్ణయించింది. అయితే పార్లమెంటు సమావేశాలు జరుగుతుండటం, కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ కూడా హాజరుకావాల్సివున్నందున ఒక రోజు వాయిదా వేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
అమరావతిలో క్వాంటం వ్యాలీకి భూమి పూజతో నవ శకానికి నాంది పలికినట్లేనని ఏపీ ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. దేశంలోనే మొట్టమొదటి క్వాంటం వ్యాలీ రాష్ట్రంలో ఏర్పాటు కానుంది. అంతేకాకుండా ప్రపంచంలో టాప్ 5 క్వాంటం హబ్‌లలో ఒకటిగా అమరావతిని తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారని చెబుతున్నారు. 2025 మేలో అమరావతి పనుల రీ లాంచింగ్ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన క్వాంటం విజన్ ను ఆవిష్కరించారు. జూన్ లో అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్ ను ఆమోదించి రూట్ మ్యాప్ కూడా సిద్ధం చేశారు. ఈ ఏడాది జనవరి నుంచే క్వాంటం కార్యకలాపాలు ప్రారంభించేలా వేగంగా అడుగులువేసినా, కొద్దిగా ఆలస్యమైందని ప్రభుత్వం చెబుతోంది.
ఫిబ్రవరిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన చేయడం ద్వారా రాష్ట్రంలో ఒక కొత్త తరం ఆర్థిక వ్యవస్థకు పునాది పడుతోందని అంటున్నారు. రాజధానిని "క్వాంటం వ్యాలీ"గా మార్చాలనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును పూర్తిగా మార్చేసే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది ఒక సాహసోపేత నిర్ణయమని, ముఖ్యమంత్రి చంద్రబాబు సమర్థత వల్లే సాధ్యమవుతోందని టీడీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సాధారణ సూపర్ కంప్యూటర్లు సాధించలేని పనులను క్వాంటం కంప్యూటర్లు సెకన్లలో చేస్తాయి. ఈ టెక్నాలజీ కేంద్రంగా అమరావతి మారడం వల్ల రాష్ట్రానికి చెందిన యువతకు వేల సంఖ్యలో హై-వాల్యూ ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు.
అమరావతి క్వాంటం వ్యాలీ కోసం వచ్చే నాలుగేళ్లలో దాదాపు 50,000 మంది విద్యార్థులకు క్వాంటంలో శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాజధానిలో క్వాంటం వ్యాలీ కోసం ప్రభుత్వం 50 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఐబీఎం (IBM), టీసీఎస్ (TCS), ఎల్ అండ్ టీ (L&T) వంటి దిగ్గజ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏపీ జీఎస్డీపీ అదనంగా 3-5% వృద్ధి చెందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఏపీని ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దిందుకు అమరావతి క్వాంటం వ్యాలీ ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. దీనిద్వారా ఉద్యోగ విప్లవం వస్తుందని ఆశిస్తోంది. రాష్ట్రానికి చెందిన యువత అత్యున్నత స్థాయి సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కైవసం చేసుకుంటారని ధీమా వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా సుమారు 9 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని చెబుతోంది. అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు వల్ల దేశాభివృద్ధికి తోడ్పాడు అందించవచ్చని సీఎం చంద్రబాబు ఆకాంక్షిస్తున్నారు. సూపర్ కంప్యూటర్లు కంటే వేగంగా క్వాంటం కంప్యూటర్ పనిచేయడంతోపాటు సూక్ష్మ స్థాయి విశ్లేషణలను చేస్తాయని చెబుతున్నారు. దీనివల్ల వాతావరణ అంచనాలు, మందుల తయారీని మరింత సమర్థవంతంగా చేయొచ్చని అంటున్నారు.
