అమరావతి-హైదరాబాద్ 70 నిమిషాల్లోనే గమ్యం.. ఏపీ రైల్వే నెట్‌వర్క్‌కు కొత్త కళ!
రెండు రాష్ట్రాల మధ్య గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు నిమిషాలకు కుదిస్తే రెండు రాష్ట్రాల ప్రజల సంతోషం ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
By: Tupaki Political Desk | 28 April 2026 2:48 PM ISTరెండు రాష్ట్రాల మధ్య గంటలు పట్టే ప్రయాణం ఇప్పుడు నిమిషాలకు కుదిస్తే రెండు రాష్ట్రాల ప్రజల సంతోషం ఎలా ఉంటుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. అమరావతి నుంచి హైదరాబాద్‌కు కేవలం 70 నిమిషాల్లోనే చేరుకోవడం అంటే, అది కేవలం ప్రయాణం కాదు.. అది రెండు మెట్రో నగరాల మధ్య భారీ ఆర్థిక అనుసంధానం. కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విశాఖ చేసిన ప్రకటన దేశానికి కొత్త్ ఆసక్తి నింపుతోంది.
తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా ముఖచిత్రాన్ని మార్చేసే దిశగా కేంద్రం భారీ అడుగు వేస్తోంది. అమరావతి - హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ కారిడార్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించడం పారిశ్రామిక, వాణిజ్య వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రస్తుతం రైలు లేదా రోడ్డు మార్గంలో ఈ రెండు నగరాల మధ్య ప్రయాణానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతుండగా, బుల్లెట్ ట్రైన్ ద్వారా కేవలం గంట 10 నిమిషాలకు తగ్గిపోనుంది. రెండు రాష్ట్రాల మధ్య ఆర్థిక లావాదేవీలు, ఉద్యోగ అవకాశాలను అనూహ్యంగా పెంచుతుంది.
ఏపీలో రైల్వే విప్లవం..
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాల కల్పన యుద్ధ ప్రాతిపదికన జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,300 కిలోమీటర్ల మేర కొత్త రైల్వే లైన్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. ఇది గ్రామీణ ప్రాంతాలను మెట్రో నగరాలతో అనుసంధానించడానికి దోహదపడుతుంది. ‘డబుల్ ఇంజిన్’ సర్కారు (రాష్ట్రం, కేంద్రంలో మిత్రపక్షాల పాలన) వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా ఏపీకి రైల్వే నిధులు మంజూరవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.
విశాఖ వాసుల స్వప్నం.. సౌత్ కోస్టల్ రైల్వే జోన్
విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ రావాలన్న దశాబ్దాల కల ఈ ప్రాజెక్టు ద్వారా నిజం కాబోతోంది. జూన్ 1వ తేదీన దక్షిణ కోస్తా రైల్వే జోన్ పనులు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. దీనివల్ల ఉత్తరాంధ్ర ప్రాంతంలో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతం అవ్వడమే కాకుండా, స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుంది. వైజాగ్ కేంద్రంగా జోన్ ఏర్పడడం వల్ల రైళ్ల ఫ్రీక్వెన్సీ పెరగడం, కొత్త రైళ్లు ప్రారంభించడం, స్టేషన్ల ఆధునీకరణ వేగంగా జరుగుతాయి.
అమరావతి - హైదరాబాద్ ఆర్థిక ప్రభావం
బుల్లెట్ ట్రైన్ కేవలం వేగం కోసం మాత్రమే కాదు, అది ఆర్థికాభివృద్ధికి ఇంజిన్ లాంటిది. హైదరాబాద్‌లో కార్యాలయాలు ఉండి అమరావతిలో నివసించే వారు కూడా సులభంగా రాకపోకలు సాగించవచ్చు. దీనివల్ల విజయవాడ-గుంటూరు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగాలు కొత్త పుంతలు తొక్కుతాయి. తక్కువ సమయంలో ప్రయాణించే వీలు ఉండడం వల్ల చిన్న, మధ్య తరహా వ్యాపారులకు మార్కెటింగ్ అవకాశాలు మెరుగుపడతాయి.
ఒకప్పుడు దక్షిణ మధ్య రైల్వే కింద ఉన్న ప్రాంతాలు స్వయంప్రతిపత్తితో కూడిన కొత్త జోన్, బుల్లెట్ ట్రైన్ వంటి ప్రాజెక్టులతో ప్రపంచ స్థాయికి ఎదుగుతున్నాయి. జూన్ 1న ప్రారంభం కానున్న రైల్వే జోన్ పనులు, రాబోయే రోజుల్లో పట్టాలెక్కనున్న బుల్లెట్ ట్రైన్.. ఆంధ్రప్రదేశ్ - తెలంగాణ మధ్య దూరాన్ని తగ్గించడమే కాకుండా, దక్షిణాదిలో ఒక భారీ ఆర్థిక కారిడార్‌ను సృష్టిస్తాయి. టెక్నాలజీ, నిధుల సహకారం ఉంటే భారతీయ రైల్వేలు కూడా జపాన్, చైనా దేశాల రైల్వేలకు తీసిపోవని ఈ ప్రాజెక్టులు నిరూపించబోతుంది.
