అమరావతిలో వడివడిగా 'హ్యాపీనెస్ట్'.. ఏంటీ ప్రాజెక్టు?
ఏపీ రాజధాని అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేంద్రసహకారం, రాష్ట్రం కూడా కేటాయిస్తున్న నిధులతో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
By: Garuda Media | 21 Nov 2025 1:00 AM ISTఏపీ రాజధాని అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ, కేంద్రసహకారం, రాష్ట్రం కూడా కేటాయిస్తున్న నిధులతో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం- సీఆర్ డీఏలు సంయుక్తంగా తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నాయి. అదే.. `హ్యాపీనెస్ట్` పనులను కూడా ప్రారంభించాలని!. ఇప్పటికే పునాదుల వరకు పూర్తయిన ఈ నిర్మాణాలను కూడా వడివడిగా ముందుకు తీసుకువెళ్లాలని తాజాగా నిర్ణయించారు. దీంతో జనవరి నుంచి పనులు ప్రారంభించేలా ప్లాన్ చేస్తున్నారు.
ఏంటీ హ్యాపీనెస్ట్?
2015లో అమరావతికి బీజం పడినప్పుడు.. ఇక్కడ మధ్యతరగతి కుటుంబాలకు కూడా సొంత ఇల్లు ఉండాలన్న ప్రతిపాదన వచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వమే చొరవ తీసుకుని అపార్ట్‌మెంట్ల టైపులో నిర్మాణాలు చేపట్టాలని ప్రతిపాదించింది. దీనికి `హ్యాపీ నెస్ట్` అని పేరు నిర్ధారించారు. ఈ విషయాన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మాధ్యమాల్లో ఉంచి.. ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. దీంతో మధ్య తరగతే కాకుండా.. ఎగువ మధ్యతరగతికి చెందిన కుటుంబాలు కూడా దీనిని స్వాగతించాయి. ఎన్నారైలు కూడా ఈ ప్రాజెక్టుకు ముగ్ధులయ్యారు.
దీంతో ఈప్రాజెక్టుకు సమగ్ర రూపం ఇచ్చిన అప్పటి టీడీపీ ప్రభుత్వం.. సింగిల్ బెడ్‌రూమ్, డబుల్ బెడ్‌రూమ్, ట్రిపుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లుగా హ్యాపీనెస్ట్‌ను విభజించింది. మొత్తం 1200 ఫ్లాట్లు నిర్మించాలని ప్లాన్ చేసింది. దీనికిగాను.. ఉద్దండరాయ పాలెం నుంచి సచివాలయం వరకు.. 12 టవర్లను ఏర్పాటు చేయాలని భావించింది. ఒక్కొక్క టవర్‌లో 18 అంతస్థులు.. 100 ఫ్లాట్లు ఉండేలా డిజైన్ చేశారు. దీనికి సంబంధించి మొత్తం 1000 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు.
ఇక, ఈ ప్రాజెక్టుకు భారీ ఎత్తున స్పందన వచ్చింది. ఫ్లాట్లన్నీ.. కేవలం 24 గంటల్లోనే కొనేశారు. అడ్వాన్స్ కూడా సీఆర్ డీఏ ఖాతాకు చెల్లించారు. కానీ, వైసీపీ వచ్చాక.. పూర్తిగా రివర్స్ అయింది. దీంతో తమ సొమ్ము తిరిగి ఇవ్వాలని కొందరు వినియోగదారులు డిమాండ్ చేశారు. అయితే.. ఇంతలోనే ప్రభుత్వం మారి.. అమరావతి పట్టాలెక్కింది. ఇప్పుడు దీంతోపాటు హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును కూడా గాడిలో పెట్టారు. వచ్చే జనవరి నుంచి పనులు ప్రారంభించి.. 2027 ప్రారంభంలో పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇదీ.. సంగతి!.
