Begin typing your search above and press return to search.

అమరావతి ఇప్పుడెలా ఉందంటే? టీడీపీ వీడియో వైరల్

రాజధాని అమరావతిపై టీడీపీ విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది. ‘‘అమరావతి గ్రోత్ స్టోరీ 2025’’ పేరిట అమరావతి ఇప్పుడెలా ఉందంటే అనే టైటిల్ తో వీడియోను టీడీపీ విడుదల చేసింది.

By:  Tupaki Political Desk   |   5 Jan 2026 3:29 PM IST
అమరావతి ఇప్పుడెలా ఉందంటే? టీడీపీ వీడియో వైరల్
X

రాజధాని అమరావతిపై టీడీపీ విడుదల చేసిన వీడియో వైరల్ గా మారింది. ‘‘అమరావతి గ్రోత్ స్టోరీ 2025’’ పేరిట అమరావతి ఇప్పుడెలా ఉందంటే అనే టైటిల్ తో వీడియోను టీడీపీ విడుదల చేసింది. ఇందులో రాజధాని పనులు ఎక్కడి వరకు వచ్చాయి? ఏయే భననాలను నిర్మించారు? ఇంకా నిర్మాణంలో ఉన్న పనులు ఏంటి? ఏయే భవనాలు ఏ దశకు చేరుకున్నాయనేది సమగ్రంగా చూపించారు. ఈ వీడియోను జత చేస్తూ 'అమరావతిలో ప్రభుత్వ భవనాల పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2025లో జోరందుకున్న పనులతో కొన్ని భవనాలు ప్రారంభమవగా, మరికొన్ని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పన పనులు ఊపందుకున్నాయి' అని టీడీపీ ట్వీట్ చేసింది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతిపై ఎక్కువ ఫోకస్ చేస్తోంది. మూడేళ్లలో రాజధాని నగరాన్ని నిర్మించాలనే లక్ష్యం పెట్టుకున్న ప్రభుత్వం శరవేగంగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటోందని చెబుతున్నారు. 2024 జూన్ నెలలో కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినా, గత ఏడాది మే నెల నుంచే రాజధాని పనుల్లో వేగం పెరిగిందని చెబుతున్నారు. మే నెలలో ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని పునఃనిర్మాణాన్ని ప్రారంభించిన తర్వాత రాజధాని వ్యాప్తంగా ఒకేసారి పనులు మొదలయ్యాయి అంటున్నారు. ఇక గత ఏడు నెలలులో రాజధానిలో పలు ప్రధాన నిర్మాణాలు ఒక కొలిక్కి వచ్చాయని టీడీపీ వీడియోలో వెల్లడించింది.

ఐకానిక్ టవర్లు, హైకోర్టు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్లు, గ్రూప్ డి ఉద్యోగుల నివాస సముదాయం, ఎన్జీవో క్వార్టర్స్ పనులను ఏకకాలంలో చేపడుతున్నట్లు వీడియోలో పేర్కొంది. అంతేకాకుండా విజయవాడ నగరాన్ని రాజధాని అమరావతితో అనుసంధానం చేసే సీడ్ యాక్సిస్ రోడ్డుకు ఉండవిల్లి వద్ద స్టీల్ బ్రిడ్జి నిర్మించడాన్ని ప్రధానంగా చూపింది. ఎన్సీసీ ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న స్టీల్ బ్రిడ్జి వల్ల రాజధానికి వెళ్లాల్సిన వారు కరకట్ట రోడ్డుపై కష్టాలు పడాల్సిన అవసరం ఉండదని అంటున్నారు.

ప్రస్తుతం రాజధానిలో ఏపీసీఆర్‌డీఏ ప్రధాన కార్యాలయం నిర్మాణం పూర్తయింది. ఆ భవనం నుంచే పురపాలక శాఖ ప్రస్తుతం పనిచేస్తోందని చెబుతున్నారు. 7 అంతస్తులతో సుమారు 2,42,481 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ భవనాన్ని నిర్మించారు. అదే విధంగా బీ ప్లస్ జీ ప్లస్ 3లో రాష్ట్ర అసెంబ్లీని నిర్మిస్తున్నారు. సుమారు 11,22,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ భవనం ప్రస్తుతం పునాది దశలోనే ఉంది. ఇక ఏడు అంతస్తుల హైకోర్టు భవనం గతం కంటే మెరుగైన స్థితిలో కనిపిస్తోందని చెబుతున్నారు. అదేవిధంగా మంత్రుల కోసం సిద్ధం చేసిన 35 బంగ్లాలు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి.

అదేవిధంగా 720 మంది కోసం గ్రూప్-డి టవర్లు సిద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్లలో చెరో 144 ఫ్లాట్లు చొప్పున నిర్మించారు. ఈ టవర్లు కూడా తుది మెరుగులు దిద్దుకుంటున్నాయని చెబుతున్నారు. వీటికి సమాంతరంగా 1995 ప్లాట్లతో ఎన్జీవో టవర్లు, 1200 ప్లాట్లతో హ్యాపీ నెస్ట్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక మౌలిక సదుపాయాలైన సీడ్ యాక్సెస్ రోడ్డు, అంతర్గత రహదారుల పనులు జోరుగా సాగుతున్నాయి. రోడ్ల పనులతోపాటే భూగర్భ డ్రైనేజీ, కరెంటు సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు అడ్వాన్స్‌డ్ ఫొరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ, ఎస్బీఐ, కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, సెంట్రల్ బ్యాంక్ కార్యాలయాల పనులు చేస్తున్నట్లు టీడీపీ విడుదల చేసిన వీడియోలో కనిపిస్తోంది.