రిపబ్లిక్ డే స్పెషల్.. అమరావతిలో ఫస్ట్ టైం
రాజధాని అమరావతిలో గణతంత్ర వేడుకల కోసం మంత్రుల బంగ్లా ఎదుట విశాల విస్తీర్ణంలో సువిశాలంగా, సుందరంగా అభివృద్ధి చేసిన కోర్ క్యాపిటల్ ఏరియాలో తొలిసారిగా ఆహ్లాదకర వాతావరణంలో భారీ ఏర్పాట్లు చేశారు.
By: Tupaki Political Desk | 25 Jan 2026 11:16 AM ISTరాజధాని అమరావతి తొలిసారిగా గణతంత్ర దినోత్సవాలకు వేదిక కానుంది. 11 ఏళ్ల క్రితం అమరావతిని రాజధానిగా ప్రకటించారు. అయినా ఇప్పటివరకు రాజధాని ప్రాంతంలో గణతంత్ర వేడుకలు జరగలేదు. గత ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించాలని భావించినా, వర్షాల కారణంగా చివరి నిమిషంలో వాయిదా వేయాల్సివచ్చింది. అప్పుడు విజయవాడలో ఆగస్టు 15 పండుగను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో రిపబ్లిక్ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఏడాది రాజధాని అమరావతిలో నిర్వహించబోయే గణతంత్ర వేడుకలు చరిత్ర సృష్టించబోతున్నాయి. విభజిత ఏపీ చరిత్రలో తొలిసారిగా వేడుకలకు రాజధాని ఆతిథ్యం ఇవ్వడాన్ని రాజధాని చరిత్రలో మైలురాయిగా వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ధృడ సంకల్పంతో ఈ ఏడాది రాజధానిలో గణతంత్ర వేడుకలు నిర్వహించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఇక రాజధానిలో జెండా ఎగురవేసిన ఏడాదే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా రాజధానిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బుధవారం నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో రాజధాని అమరావతి బిల్లును ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.
2015లో రాజధానిగా అమరావతిని ఎంపిక చేశారు. అప్పట్లో భూ సమీకరణ ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, రాజధానిగా ప్రకటించిన ప్రాంతంలో అనువైన మైదానం అందుబాటులో లేకపోవడంతో ఆగస్టు 15, జనవరి 26 వంటి జాతీయ పండుగలను రాజధానిలో నిర్వహించలేకపోయారు. 2014-19 మధ్య చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్కో ఏడాది ఒక్కో జిల్లా కేంద్రంలో ఈ రెండు జాతీయ పండుగల వేడుకలు నిర్వహించేవారు. రాజధానిగా ప్రకటించిన 11 ఏళ్లకు తొలిసారిగా గణతంత్ర వేడుకలు నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
రాజధాని అమరావతిలో గణతంత్ర వేడుకల కోసం మంత్రుల బంగ్లా ఎదుట విశాల విస్తీర్ణంలో సువిశాలంగా, సుందరంగా అభివృద్ధి చేసిన కోర్ క్యాపిటల్ ఏరియాలో తొలిసారిగా ఆహ్లాదకర వాతావరణంలో భారీ ఏర్పాట్లు చేశారు. పచ్చదనం, విశాల ప్రాంగణాలు, అత్యుత్తమ మౌలిక వసతులతో ఆ ప్రాంతం వేడుకలకు మరింత శోభనిస్తోంది. వేడుకలు తిలకించేవారికి మరిచిపోలేని అనుభూతిని కలిగించనుంది. 77వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర గవర్నర్ అబ్ధుల్ నజీర్ అహ్మద్, అతిధిలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, గౌరవ హైకోర్టు న్యాయాధిపతులు, రాజధానికి భూములిచ్చిన రైతులు హాజరుకానున్నారు. మొత్తం 22 ఎకరాల్లో విస్తరించిన పరేడ్ గ్రౌండులో 15 ఎకరాల స్థలాన్ని వీవీఐపీ, వీఐపీ పార్కింగు కోసం రిజర్వు చేశారు. అదేవిధంగా గ్రౌండ్ పక్కనే ఉన్న 25 ఎకరాలను పబ్లిక్ పార్కింగు కోసం సిద్ధం చేశారు.
గణతంత్ర వేడుకల కోసం ముందస్తు సన్నాహాల్లో భాగంగా శనివారం ఉదయం పరేడ్ ఫుల్ డ్రెస్ రిహార్సల్ ను ఘనంగా నిర్వహించారు. పరేడ్ రిహార్సల్ కు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జే. శ్యామలరావు హాజరయ్యారు. జంగారెడ్డి గూడెం ఏఎస్పీ పరేడ్ కమాండర్ ఆర్. సుస్మిత నుంచి డీజీపీ గౌరవ వందనం స్వీకరించారు. ముందుగా ఇండియన్ ఆర్మీ నాయిబ్ సుబేదార్ ఎల్.కే. ప్రసాద్, కర్నూలు ఏపీఎస్పీ రెండవ బెటాలియన్ రిజర్వ్ ఇన్ స్పెక్టర్ జీవీ రామి రెడ్డి, సీఆర్పీఎఫ్ రిజర్వ్ ఇన్ స్పెక్టర్ చెన్వీర్ గౌడ, కేరళ ఆర్మ్ డ్ పోలీస్ సీవీ జన్ సాన్, విశాఖపట్టణం ఏపీఎస్పీ 16 వ బెటాలియన్ కు ఎస్వీ రమణ, ఏపీ బ్రాస్ బాండ్ లో ఏపీఎస్పీ 11 వ బెటాలియన్ కు చెందిన టీవీ. రమణ, ఏపీఎస్పీ 6 వ బెటాలియన్ కు చెందిన ఎస్. శ్రీనివాసులు, ఇండియన్ ఆర్మీ పైప్ బాండ్ కు సుబేదార్ మొహంతీ, జీవీ సుబ్బారావు, ఎన్.సీ.సీ. బాయ్స్ కు జయంత్ వర్లోత్, ఎన్.సీ.సీ. గర్ల్స్ కు రేవతి, ఏపీ సోషల్ వెల్ఫేర్ కు కే. సునీత్ కుమార్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కు ఏపీ మోడల్ స్కూల్, పాణ్యం కు చెందిన వై. ఇషాక్ రాజు, యూత్ రెడ్ క్రాస్ కు పి. సాయి రోహిత్ లు కమాండర్ లుగా వ్యవహరించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివిధ శాఖలకు చెందిన 22 శకటాలను ప్రదర్శించారు.. వీటిలో వందేమాతరం కు 150 వసంతాలు ఇతివృత్తంగా సాంస్కృతిక శాఖ, పది సూత్రాల మిషన్ కింద పేదరికం లేని సమాజం (Zero Poverty) ఇతివృత్తంతో ప్రణాళికా శాఖ, సెర్ఫ్ (SERP), జనాభా నిర్వహణ, మానవ వనరుల అభివృద్ధి ఇతివృత్తంతో ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య విద్యా శాఖ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, నైపుణ్యం, ఉపాధి ఇతివృత్తంతో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్, పాఠశాల విద్యా శాఖ, పరిశ్రమల శాఖ, పర్యాటక శాఖ లు, నీటి భద్రత ఇతివృత్తంతో జలవనరుల అభివృద్ది శాఖ, మైక్రో ఇరిగేషన్, అటవీ శాఖ లు, రైతు-వ్యవసాయ సాంకేతికతతో వ్యవసాయ శాఖ, మత్స్య శాఖ లు, ప్రపంచ ఉత్తమ లాజిస్టిక్స్ (Global-Best Logistics) అంశంతో మౌలిక వసతులు & పెట్టుబడులు, సముద్ర వైమానిక రంగాలు, సీఆర్డీఏ, వ్యయ అత్యుత్తమీకరణ (ఖర్చుతగ్గింపు) – శక్తి, ఇంధనం ఇతివృత్తంతో నెడ్కాప్ (ఇంధనం), ఉత్పత్తి పరిపూర్ణత, చేనేత, జౌళి శాఖ, ఉద్యానవన శాఖ లు, స్వచ్ఛ ఆంధ్ర (Swachh Andhra) పురపాలక & పట్టణాభివృద్ది శాఖ (స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్), పంచాయతీరాజ్ & గ్రామీణాభివృద్ది శాఖ లు, జీవితంలోని అన్ని రంగాల్లో లోతైన సాంకేతికత - ఇతివృత్తంతో ఆర్టీజిఎస్ (RTGS) శకటాలను రూపొందించారు.
