అమరావతికి అనుసంధానం చేసే ప్రాజెక్టు.. మంగళగిరిలో మరో ఆర్వోబీ
కూటమి ప్రభుత్వంలో రాజధాని అమరావతి పనులకు వేగంగా అడుగులు పడుతున్నాయి.
By: Tupaki Political Desk | 4 Oct 2025 1:00 PM ISTకూటమి ప్రభుత్వంలో రాజధాని అమరావతి పనులకు వేగంగా అడుగులు పడుతున్నాయి. ఒకవైపు నిధులు సమకూర్చుకుంటూనే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతులు సాధించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం యుద్ధప్రాతిపదిక స్పందిస్తోంది. దీంతో దాదాపు పదకొండేళ్లుగా ఊరిస్తున్న రాజధాని నిర్మాణం చకచకా సాగుతోందని అంటున్నారు. ఇప్పటికే రాజధాని అమరావతిని జాతీయ రహదారులతో అనుసంధానించేలా పలు రోడ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణం పూర్తయింది. దీంతో అటు హైదరాబాద్, ఇటు చెన్నై జాతీయ రహదారులకు అమరావతితో కనెక్షన్ ఏర్పడింది.
రాజధాని అమరావతి వేగంగా అభివృద్ధి జరగాలంటే రహదారుల నిర్మాణం అత్యంత అవసరం. రాజధానికి ప్రధానమైన సీడ్ యాక్సిస్ రోడ్డుకు భూ సమీకరణ సవాల్ గా మారడంతో విజయవాడ, గుంటూరు నగరాల నుంచి రాజధాని అమరావతిలో ప్రవేశానికి సమస్యగా మారింది. అదే సమయంలో రాజధాని లోపల అంతర్గత రహదారులను మరోవైపు నుంచి నిర్మిస్తున్నారు. అయితే ప్రధాన రహదారి లేకుండా, ఈ అంతర్గత రోడ్లు ఎంత బాగా నిర్మించినా ఉపయోగం లేదని భావించిన ప్రభుత్వం సీడ్ యాక్సెస్ రోడ్డుకు సమాంతరంగా రాజధానికి రెండు వైపులా ఉన్న రెండు ప్రధాన జాతీయ రహదారులతో అనుసంధానించే ఇతర ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తోందని చెబుతున్నారు.
విజయవాడ వెస్ట్ బైపాస్ నిర్మాణం పూర్తి చేయడం ద్వారా రాజధాని అమరావతి మీదుగా ఓ ప్రధాన రహదారి అందుబాటులోకి వచ్చినట్లైంది. గుంటూరు జిల్లా కాజ నుంచి విజయవాడ శివారులో గొల్లపూడి వరకు ఈ రహదారిని ఇప్పటికే పూర్తి చేశారు. క్రిష్ణా నదిపై దాదాపు మూడు కిలోమీటర్ల బ్రిడ్జిని నిర్మించారు. ఇదే సమయంలో భవిష్యత్తులో ఈ రహదారిపై ఒత్తిడి పెరిగి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా క్రిష్ణా నదిపై మరో ఐకానిక్ వంతెన నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే వంతెన డిజైన్లను పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉంచి ప్రజల ఓటింగు ద్వారా ఎంపిక చేశారు.
ఇక రాజధాని అమరావతిలో అంతర్గత రహదారులను అనుసంధానించడంతోపాటు చెన్నై-హౌరా జాతీయ రహదారిని అనుసంధానించే మరో రైల్ ఓవర్ బ్రిడ్జికి కేంద్రం తాజాగా నిధులు విడుదల చేసింది. మంగళగిరి-క్రిష్ణా కెనాల్ రైల్వే స్టేషన్ల మధ్య అమరావతిలో ఈ-13 ఎక్స్ టెన్షన్ రోడ్డు వద్ద రూ.112 కోట్ల అంచనా వ్యయంతో ఆరు లైన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వంతెన నిర్మాణానికి అయ్యే పూర్తి వ్యయాన్ని దక్షిణ మధ్య రైల్వే సమకూర్చనుందని ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఎన్ హెచ్-16 (చెన్నై-హౌరా రహదారి)ని రాజధాని అమరావతితో కలిపే రోడ్డు ఈ-13. ఈ రహదారి మధ్యలో చెన్నై-హౌరా రైల్వే ట్రాక్ కూడా ఉంది. విజయవాడ జంక్షన్ మీదుగా వెళ్లే ఈ ప్రధాన రైల్వేలైన్ నిత్యం రద్దీగా ఉంటుంది. మొదట్లో దీనిపై నాలుగు లైన్ల ఆర్వోబీని ప్రతిపాదించారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఆరు లైన్ల బ్రిడ్జి నిర్మించాలని సూచించింది. భవిష్యత్తులో రాజధానిలో పెరిగే ట్రాఫిక్ ను పరిగణలోకి తీసుకుని రైల్వేశాఖ ప్రతిపాదనలను పునః సమీక్షించాలని కోరింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ సూచనలకే కేంద్ర రైల్వే శాఖ పచ్చజెండా ఊపింది. నాలుగు లైన్లకు బదులుగా ఆరులైన్ల బ్రిడ్జి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక పరిపాలన అనుమతులు సాధించడంతో రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి డిజైన్లను ఎంపిక చేసే పనిని అధికారులు చేపట్టారు.
