అమరావతికి రాజముద్ర.... శుభవార్త అపుడేనా ?
అమరావతి రాజధాని. ఇది అందరికీ తెలుసు. ఏపీ వారికి ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే రోజూ అదే విషయం మీద అంతా మాట్లాడుకుంటారు కాబట్టి.
By: Satya P | 6 Aug 2025 7:12 PM ISTఅమరావతి రాజధాని. ఇది అందరికీ తెలుసు. ఏపీ వారికి ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే రోజూ అదే విషయం మీద అంతా మాట్లాడుకుంటారు కాబట్టి. అయితే అమరావతిని రాజధాని అని అనుకుంటే సరిపోదు కదా. దానికి చట్టబద్ధత అవసరం కదా అన్న చర్చ అయితే ఉంది. అమరావతిని రాజధానిగా చేసుకుంటూ ఇప్పటికి పదకొండేళ్ల క్రితం అక్కడ శంకుస్థాపనలు చేశారు. అక్టోబర్ 22న జరిగిన ఆ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరై శ్రీకారం చుట్టారు. ఇక మరోసారి తాజాగా అమరావతి పునర్ నిర్మాణ పనులకు కూడా నరేంద్ర మోడీ వచ్చారు. అయితే ఈ పదకొండేళ్ళ మధ్యలో అమరావతి రాజధానికి చట్టబద్ధత అయితే రాలేదు. ఎందుకు రాలేదు అంటే...
గెజిట్ నోటిఫికేషన్ లో :
ఒక రాష్ట్రానికి ఫలానా నగరం లేదా ప్రాంతం అతి ముఖ్య పట్టణం అని కేంద్రం గుర్తించాలి. ఆ ముఖ్యపట్టణం రాజధానిగా అవుతుంది. పాలనాపరంగా అక్కడ నుంచే అంతా జరుగుతుంది. అలా దేశంలో ప్రతీ రాష్ట్రానికీ రాజధానిని కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా గుర్తించింది. కానీ ఏపీలో అమరావతికి మాత్రం ఆ గుర్తింపు అయితే ఇప్పటిదాకా లేదు. దశాబ్దం పైగా జరిగిపోతున్నా అమరావతి ఒక రాజధానిగా అధికారిక గుర్తింపుని పొందలేకపోయింది.
డబుల్ ఇంజన్ సర్కార్ అయినా :
కేంద్రంలో ఎన్డీయే ఉంది. రాష్ట్రంలో కూడా ఎన్డీయే ప్రభుత్వం ఉంది. ఇలా రెండు ప్రభుత్వాలూ ఒక్కటే ట్యూన్ తో సాగుతున్నాయి. అక్కడ టీడీపీ మంత్రులు ఉంటే ఇక్కడ ప్రభుత్వంలో బీజేపీ మంత్రి ఉన్నారు. అయినా ఏపీకి రాజధాని హోదా అన్నది అధికారికంగా దఖలు పడలేదు. ఇలా ఎందుకు జరుగుతోంది అన్నదే చర్చగా ఉంది. ఈ రోజున చూస్తే కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వానికి ఏపీలోని టీడీపీ ఎంపీలే ఆక్సిజన్ గా ఉన్నారు. మరి అమరావతి ఏపీకి రాజధాని అన్న గెజిట్ నోటిఫికేషన్ రావడానికి ఎక్కడ ఏ స్థాయిలో ఆలస్యం అవుతోంది అన్నదే చర్చగా ఉంది.
మూడు ముక్కలాట అందువల్లనే :
ఏపీకి అధికారిక ముద్రతో రాజధాని అన్నది లేకపోవడం వల్లనే వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు ముక్కలాట సాగింది అని అంతా అంటున్నారు. ప్రత్యేకించి రాజధాని అంటే ఫలానాది అని చెప్పుకునే వీలు లేకుండా పోయింది అని అంటున్నారు. ఇపుడు చూస్తే అమరావతి రాజధాని అన్నది ఏపీలోని అయిదు కోట్ల మంది ప్రజానీకం ముక్తకంఠంతో ఆమోదిస్తున్నారు. 94 శాతం స్ట్రైక్ రేట్ తో కూటమికి సీట్లను ఓట్లను జనాలు కట్టబెట్టారు. ఏపీకి రాజధాని ఒక సెంటిమెంట్ గా మారింది. ఇక అమరావతి రాజధాని నిర్మాణానికి కూటమి ప్రభుత్వం గత ఏడాదిగా చురుకుగా పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో రాజ ముద్ర మీద ఇంకా ప్రకటన రాకపోవడం మీదనే అంతా ఆలోచిస్తున్నారు.
రైతుల మదిలో మాట :
తాజాగా అమరావతి రైతులను కలసి మాట్లాడినపుడు కూడా వారు అమరావతికి రాజధానిగా అధికార ముద్ర ఉండాలని కోరారు. గెజిట్ నోటిఫికేషన్ తొందరగా రావాలని వారు బలంగా కోరుకుంటున్నారు. రెండవ విడత భూసేకరణకు తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా అధికారికంగా గుర్తించాలని అంటున్నారు. ఇది ఎంత తొందరగా ప్రక్రియ సాగితే అంత మంచింది అని కూడా చెబుతున్నారు.
బీజేపీ నుంచి భరోసా :
ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ గా నియమితులైన పీవీఎన్ మాధవ్ జిల్లా పర్యటనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన గుంటూరు పర్యటన నేపథ్యంలో అమరావతి రైతులు కలిశారు. వారు తన మనసులో మాటను ఆయనకు చెప్పారు. ఈ క్రమంలో పీవీఎన్ మాధవ్ వారికి హామీ ఇచ్చారు. అమరావతికి రాజముద్ర దక్కేలా చూస్తామని అన్నారు. గెజిట్ నోటిఫికేషన్ ద్వారా అమరావతికి అధికార ముద్ర పడేలా చూస్తామని ఆయన భరోసా ఇచ్చారు. మొత్తం మీద తొందరలోనే అమరావతికి రాజముద్ర పడుతుందని అంతా ఆశిస్తున్నారు. అది కనుక జరిగితే అమరావతి ఏపీకి శాశ్వత రాజధానిగా పక్కా అధికార ముద్రతో ఉంటుంది అని అంటున్నారు.
