అమరావతిపై వ్యతిరేక ప్రచారం.. అసలేంటి కథ..!
ఏపీ రాజధాని అమరావతిపై విస్తృతంగా వ్యతిరేక ప్రచారం జరుగుతోందని ప్రభుత్వం వాదన.
By: Garuda Media | 30 Aug 2025 7:00 AM ISTఏపీ రాజధాని అమరావతిపై విస్తృతంగా వ్యతిరేక ప్రచారం జరుగుతోందని ప్రభుత్వం వాదన. దీనిని అడ్డుకట్ట వేయాలని తాజాగా మరోసారి సీఎం చంద్రబాబు అధికారులకు, అదే విధంగా పార్టీ నాయకులకు కూడా సూచించారు. దీంతో అసలు అమరావతిలో ఏం జరుగుతుంది.. అమరావతిపై వ్యతిరేక ప్రచారం ఎందుకు వచ్చింది.. అనేది మరోసారి చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి మూడు రాజధానులు విషయాన్ని వైసిపి భుజానికి ఎత్తుకున్న తర్వాత నుంచి అమరావతిపై వ్యతిరేక ప్రచారం ప్రారంభమైన మాట వాస్తవం.
దీనికి లక్షల కోట్ల రూపాయలు సొమ్ములు కావాలని, అంత డబ్బులు మన దగ్గర లేవని వైసీపీ చెబుతోంది. విశాఖపట్నం వంటి ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరాలను రాష్ట్ర రాజధానిగా పేర్కొంటే భవిష్యత్తులో పుంజుకునేందుకు అవకాశం ఉంటుందని వైసిపి అధినేత జగన్ పదేపదే చెబుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి కీలక నగరాలతో పోటీపడాలంటే విశాఖపట్నంని డెవలప్ చేసుకుంటే సరిపోతుంది అన్నది ఆయన వాదన. కానీ, అమరావతి అయితే రాష్ట్రానికి మధ్యలో ఉంటుందని అన్ని నగరాలకు అన్ని ప్రాంతాలకు చేరువగా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.
ఇక్కడ అభివృద్ధి చెందేందుకు విశాలమైన స్థలాలు, రైతుల నుంచి సమీకరించిన భూమి ఉన్నాయన్నది చంద్రబాబు ఆలోచన. ఈ రెండు విషయాలు పక్కనపెడితే.. గత ఆరు నెలలుగా మరోసారి అమరావతి విషయంపై చర్చ వచ్చింది. అప్పులు చేసి అమరావతి నిర్మిస్తున్నారన్నది ప్రధానంగా వస్తున్న విమర్శ. ఇది మేధావులు సైతం చెబుతున్న మాట. అయితే, అప్పులు చేయకుండా ఇల్లే కట్టలేనప్పుడు ఒక రాజధానిని ఎలా నిర్మిస్తారు అన్న వాదన కూడా ఉంది. దీంతో అప్పులు చేయటం తప్పు కాదని సెల్ఫ్ గా అమరావతి రాజధాని భవిష్యత్తులో అప్పులు తీర్చుకునే అవకాశం ఉన్నన్నది ప్రభుత్వం చెబుతోంది.
ఈ క్రమంలో అప్పులపై జరుగుతున్న వాదన కొట్టుకుపోయింది. గత నెల రోజులుగా కురుస్తున్న వర్షాలతో అమరావతి రాజధాని మునిగిపోయింది అన్నది మరో వాదన. సాధారణంగా లోతట్టు ప్రాంతాలు మునిగిన మాట నిజమే. అదేవిధంగా నిర్మాణాల కోసం తీసిన పునాదులు, గోతులు కూడా నీటితో నిండిపోయాయి. దీనినే వైసీపీ సహా వైసిపి అనుకూల సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం నీళ్లు నిలిచిన చోట వాటిని తోడే ప్రయత్నం చేయించింది.
అయినా సమీపంలో కృష్ణా నది ఉండడం, ఆ నదికి కూడా నీరు విస్తృతంగా రావడంతో ఊట నీరు పెరిగిపోతోంది. దీంతో ఎంత తోడినా నీళ్లు కనిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు ప్రధాన సమస్య. ఇంతకుమించి అమరావతి రాజధానిపై విమర్శలు వచ్చే అవకాశం లేదనేది స్థానికంగా ఉన్న రైతులు కూడా చెబుతున్నారు. ఏదేమైనా దీనికి చెక్ పెట్టాలంటే నీటిని సాధ్యమైనంత వరకు తరలించడంతోపాటు సాధ్యమైనంత వేగంగా నిర్మాణాలను పూర్తి చేయడమే ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమని చెబుతున్నారు.
