Begin typing your search above and press return to search.

అమరావతికి రాజముద్ర... అడ్డంకులు అవేనా ?

అమరావతిని ఏపీకి రాజధానిగా చేస్తూ కేంద్రం పార్లమెంట్ లో తీర్మానం చేయాల్సి ఉంది.

By:  Satya P   |   13 Dec 2025 9:19 AM IST
అమరావతికి రాజముద్ర... అడ్డంకులు అవేనా ?
X

అమరావతిని ఏపీకి రాజధానిగా చేస్తూ కేంద్రం పార్లమెంట్ లో తీర్మానం చేయాల్సి ఉంది. ఆ మీదట రాష్ట్రపతి రాజ ముద్రతో అధికారికంగా గెజిట్ లో చోటు దక్కుతుంది. అపుడు దేశంలోఅని అన్ని రాష్ట్రాల రాజధానులతో కూడిన మ్యాప్ లో అమరావతికి కూడా చోటు దక్కుతుంది. అయితే ఇది అనుకున్నంత సులువు అయినది కాదు అని అంటున్నారు. నిజానికి చూస్తే చాలా ఈజీగా జరగాల్సిన ప్రక్రియ అని అంతా అనుకుంటారు. ఎందుకు అంటే కేంద్రంలో ఏపీలో కూడా ఎన్డీయే ప్రభుత్వం ఉంది. తలచుకుంటే చిటికలో పని అని అంటున్నారు. అఫ్ కోర్స్ రాజకీయంగా చూస్తే అదే కరెక్ట్. కానీ ఒక విషయం మీద తీర్మానం కానీ చట్టాలు కానీ చేయాలనుకున్నపుడు రాజ్యాంగపరమైన అన్ని చిక్కులూ దాటుకుని ముందుకు సాగాల్సిన అవసరం అయితే ఉంది. అమరావతి రాజధాని విషయంలో కూడా ఇపుడు ఎదురవుతున్న కొన్ని చిక్కు ముడులు విప్పాల్సి ఉంది.

ఏమిటా చిక్కులు అంటే :

ఏపీ విభజన చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి ఉభయ సభలలో తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంది. ఆ సవరణలు ఏంటి అంటే ఏపీకి రాజధానిగా ఫలనా ప్రాంతాన్ని గుర్తించాలని చెప్పాలి. అలాగే ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ కి గడువు తీరింది కాబట్టి కొనసాగించడం లేదని స్పష్టం చేయాలి. దీని మీద ఫైల్ తయారు చేసే ప్రక్రియలోనే కొన్ని చిక్కులు ఎదురయ్యాయని అంటున్నారు. 2014 జూన్ 2న తెలంగాణా స్టేట్ ఏర్పాటు అయింది ఆనాటి నుంచి 2024 జూన్ 2 వరకూ ఏపీకి తెలంగాణాకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. దాంతో కొత్తగా ఏపీ రాజధానిని గుర్తించాలి అంటే 2024 జూన్ 2 తరువాతనే వర్తించేటట్లుగా బిల్లు రూపొందిస్తారా లేక ముందుగానే చేస్తారా అన్నది ఒక చర్చగా ఉంది. ఇక్కడే చిక్కుముడులు పడుతున్నాయని అంటున్నారు.

ముందే రాజధాని ప్రకటన :

ఇక చూస్తే ఏపీ ప్రభుత్వం 2015 అక్టోబర్ 22న ఏపీకి రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ చేత భూమి పూజ కూడా చేయించింది. 2014లోనే అమరావతి రాజధాని అని ఏపీ అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆనాడే ఏపీ రాజధాని అమరావతి అని కేంద్రం చేత బిల్లు పెట్టించి ఉంటే సరిపోయేది. కానీ 2024 దాకా ఆగారు. ఇపుడు బిల్లు అంటే 2014 నుంచి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమరావతి రాజధానికి కేంద్రం ఆనాడు నిధులు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం కూడా ఎన్నో నిధులను వెచ్చించింది. అంతే కాదు అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇవన్నీ అధికారికం కావాలంటే పాత డేట్స్ తోనే ఉండాలని అంటున్నారు.

బడ్జెట్ సెషన్ దాకా :

అందుకే ఈ విషయంలో న్యాయ పరమైన ఇబ్బందులు లేకుండా చూడమని కోరుతూ ఏపీ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది అని ప్రచారం అయితే సాగుతోంది. ఆ దిశగా అన్నీ సరి చూసుకుని కేంద్రానికి ప్రతిపాదనలు ఏపీ నుంచి వెళ్ళాల్సి ఉంది. ఇక ఏపీ రాజధాని అంటే ఎంత విస్తీర్ణంలో ఉంటుంది ఎక్కడ నుంచి ఎక్కడ హద్దులు ఉంటాయి అన్నది కూడా ఏపీ ప్రభుత్వం పూర్తిగా స్పష్టం చేయాల్సి ఉంది. ఇంకో వైపు చూస్తే సీడ్ క్యాపిటల్ విస్తీర్ణం ఎంత అన్నది ఏపీ సర్కార్ నిర్ణయించి పంపించినట్లు అయితే కేంద్రం పరిశీలించి బడ్జెట్ సెషన్ సందర్భంగా తీర్మానం ప్రవేశపెట్టి ఉభయ సభలలో ఆమోదిస్తుంది అని అంటున్నారు.

అనేక పనులు రెడీ :

ఇక అమరావతి అధికారికంగా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పార్లమెంటులో తీర్మానించి గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేతే కనుక ఆ తరువాత, ఔటర్ రింగ్ రోడ్ వంటి కొనసాగుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కొత్త ఊపు వస్తుందని అంటున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కోరినట్లుగా అమరావతిని ఏపీ శాశ్వత రాజధానిగా అధికారికంగా ప్రకటించే బిల్లును పార్లమెంటు ఆమోదించడానికి ఢిల్లీ పెద్దలు అయితే సుముఖంగా ఉన్నారని అంటున్నారు. అమరావతి రాజధానిగా గుర్తింపు ఉంటే కనుక నగర అభివృద్ధి కార్యక్రమాలు జోరు చేస్తాయి. ఉద్యోగాలు, పెట్టుబడులు, గృహనిర్మాణం, పర్యావరణం వంటి వాటి మీద కూడా ఫోకస్ చేయడానికి వీలు అవుతుంది. ఇప్పటికి అయితే క్రియాత్మకంగా రాజధానిగా అమరావతి ఉన్నప్పటికీ అధికారిక కేంద్ర బిల్లు చట్టపరమైన హోదాను ఇస్తుంది అన్నది తెలిసిందే.