ఉత్తరాంధ్ర-రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజీ
ఏపీలో అత్యంత వెనకబడిన ప్రాంతాలుగా ఉత్తరాంధ్రా-రాయలసీమలను శివరామ క్రిష్ణ కమిషన్ గుర్తించింది.
By: Satya P | 26 Jan 2026 10:00 AM ISTఏపీలో అత్యంత వెనకబడిన ప్రాంతాలుగా ఉత్తరాంధ్రా-రాయలసీమలను శివరామ క్రిష్ణ కమిషన్ గుర్తించింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని 2014 ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తప్పనిసరి చేశారు. ఉత్తరాంధ్రాలో మూడు, రాయలసీమలో నాలుగు మొత్తంగా ఏడు ఉమ్మడి జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా గుర్తించారు. వీటికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కూడా పేర్కొన్నారు.
ప్రాంతీయ అసమానతలు లేకుండా :
ఈ ప్రత్యేక ప్యాకేజీ ప్రాంతీయ అసమానతలను లేకుండా చూడడం ముఖ్య లక్ష్యంగా ఉంది. అలాగే వ్యవసాయం, సాగునీటి ప్రాజెక్టులు పర్యాటకం ఇతర మౌలిక సదుపాయలను అభివృద్ధి చేయడం కూడా కీలక లక్ష్యాలుగా పెట్టుకున్నారు. బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజ్ ని ఉత్తరాంధ్రా రాయలసీమలకు వర్తింప చేయాలని అంటున్నారు. అయితే విభజన జరిగి పన్నెండేళ్ళు పూర్తి అయినా ప్రత్యేక ప్యాకేజీ అన్నది మాత్రం దక్కలేదు. దాంతో ఈ ప్రాంతాలలో అనుకున్న అభివృద్ధి అయితే సాధ్యపడడం లేదు.
పట్టుబట్టాలని :
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కీలకంగా ఉన్న టీడీపీ తన పార్టీ ఎంపీలకు ఈ బాధ్యత అప్పగించింది. ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో ఏపీ సమస్యలు కీలకమైన ప్రాజెక్టుల సాధనతో పాటు ఉత్తరాంధ్రా రాయలసీమలకు ప్రత్యేక ప్యాకేజ్ లను అమలు చేయాలని కోరమని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అలాగే ఏపీకి పూర్వోదయ పథకంతో పాటు, పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతాంశాలుగా తీసుకోవాలని బాబు కోరారు.
రాజ ముద్ర పడాల్సిందే
అమరావతి రాజధానికి రాజముద్ర ఈ సమావేశాల్లోనే పడాల్సిందే అని బాబు ఎంపీలకు స్పష్టం చేశారు. అమరావతి రాజధానికి సంబంధించి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఆమోద ముద్ర వేయించాలని కూడా సూచించారు. ఇక కేంద్ర మంత్రులు అధికారులతో టచ్ లో ఉంటూ ఏపీకి రావాల్సినవి అన్నీ సాధించాలని బాబు కోరారు.
నీటి ప్రాజెక్టుల విషయంలో :
అదే విధంగా ఏపీలో సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు తీసుకుని వచ్చే విషయంలో వివాదాలకు పోకుండా సాధించాలని ఎంపీలను బాబు కోరారు. ఏపీ అవసరాలకు నీళ్ళు ఎంతో ముఖ్యమని బాబు గుర్తు చేశారు. అందువల్ల పొరుగు రాష్ట్రాలతో వివాదాలకు పోకుండా నీటి ప్రాజెక్టులకు అనుమతి తీసుకుని రావడం మీద ఫోకస్ పెట్టాలని కోరారు. అంతే కాకుండా పోలవరం ప్రాజెక్ట్ కోసం పునరావాసానికి ఇంకా పన్నెండు వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉందని కేంద్రం నుంచి అవి వచ్చేలా చూడాలని బాబు కోరారు. మరి కేంద్రం ఏపీకి సంబంధించిన పలు కీలక సమస్యల మీద సానుకూలంగా స్పందిస్తుందని అంతా అంటున్నారు. అదే కనుక సాకారం అయితే ఏపీ దశ దిశ మారుతాయని అంటున్నారు.
