అమరావతి భద్రంగా చట్టబద్ధంగా
ఇక కేంద్ర హోం శాఖ అభిప్రాయల సేకరణ ఘట్టం పూర్తి చేసిన మీదట తనదైన ప్రతిపాదనలతో కేంద్ర కేబినెట్ ముందు ఉంచుతుంది. దీంతో కేంద్ర మంత్రి వర్గం ఆమోదిస్తుంది. ఆ
By: Satya P | 22 Jan 2026 8:00 AM ISTఏపీ రాజధాని అమరావతి అని ఇక మీదట ఎంతో గొప్పగా చెప్పుకోవచ్చు. గొంతెత్తి చాటుకోవచ్చు. బిగ్ సౌండ్ చేయవచ్చు. సంబరాలు చేయవచ్చు, అంబరాలను తాకవచ్చు. అధికారికంగా రాజముద్ర అమరావతి రాజధానికి పడిపోతోంది. ఎప్పటిలోగా అంటే వెరీ వెరీ సూన్ అని జవాబు వస్తోంది. కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ నెల 28 నుంచి మొదలు కాబోతున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలోనే బిల్లుని ప్రవేశపెట్టే చాన్స్ నూటికి నూరు శాతం ఉంది. అంటే అమరావతి దశ తిరిగినట్లే మరి.
పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు :
అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించాలి అంటే ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో సవరణలు చేయాల్సి ఉంది. ఆ చట్టంలో 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 2 దాకా తెలంగాణా ఏపీ రెండింటికీ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. ఆనాడు ఏపీకి రాజధాని లేకపోవడంలో పదేళ్ల పాటు హైదరాబాద్ నే రెండు రాష్ట్రాలకు రాజధానిగా చేస్తూ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. అయితే 2024 జూన్ 2 పూర్తి అయిపోయి ఏకంగా 20 నెలలు అయిపోతోంది. దాంతో ఏపీకి రాజధాని అన్నది ప్రకటించాల్సి ఉంది. ఏపీ ప్రభుత్వం అయితే అమరావతిని రాజధానిగా అధికారికంగా గుర్తించమని ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్రానికి పంపించింది. ఈ క్రమంలోనే అమరావతికి చట్టబద్ధత అన్నది కూడా జరుగుతుంది. ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేసిన చేసిన విధాన ప్రక్రియ తో పాటు, అక్కడ ఇప్పటికే చేపడుతున్న నిర్మాణాలను కూడా ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఒక ప్రత్యేక నోట్ రూపంలో సవివరంగా తెలియచేసింది. అంతే కాదు అమరావతిని రాజధానిగా ఖరారు చేయాలని కూడా విన్నవించుకుంది.
అదే డేట్ నుంచి :
ఇక గతంలో ఏపీ రాజధానిగా అమరావతి ఎప్పటి నుంచి వర్తింపచేయాలి అన్న మీమాంస ఉందని వార్తలు వచ్చాయి. అయితే 2024 జూన్ 2 నుంచి ఏపీకి రాజధానిగా అమరావతిని ప్రకటించాలని స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించిన నివేదికలో కోరినట్లుగా చెబుతున్నారు. దీంతో కేంద్ర హోం శాఖ దీని మీద పూర్తి స్థాయిలో కసరత్తు మొదలెట్టింది. ఏపీ నుంచి వచ్చిన ప్రతిపాదనపైన కేంద్ర పట్టణాభివృద్ధి, న్యాయ, వ్యవసాయ శాఖలతో పాటు నీతి ఆయోగ్ అభిప్రాయాలను కూడా కేంద్ర హోంశాఖ సేకరిస్తోందని చెబుతున్నారు.
మంత్రి వర్గం ముందుకు :
ఇక కేంద్ర హోం శాఖ అభిప్రాయల సేకరణ ఘట్టం పూర్తి చేసిన మీదట తనదైన ప్రతిపాదనలతో కేంద్ర కేబినెట్ ముందు ఉంచుతుంది. దీంతో కేంద్ర మంత్రి వర్గం ఆమోదిస్తుంది. ఆ మీదట బడ్జెట్ సమావేశాలలోనే అమరావతి రాజధానిగా ప్రకటించే బిల్లు అయితే పార్లమెంట్ ముందుకు వస్తుందని చెబుతున్నారు. ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో సవరణ కోసం బిల్లును లోక్ సభలో మొదట ప్రవేశపెడతారు. అక్కడ ఆమోదం తరువాత రాజ్యసభకు వెళ్తుంది. ఈ రెండు సభలు ఆమోదించిన మీదట రాష్ట్రపతి ఆమోదంతో అమరావతికి రాజధానిగా చట్టబద్ధంగా హోదా దక్కుతుంది. రాష్ట్రపతి సంతకంతో గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల అవుతుంది, ఆ విధంగా అమరావతి ఏపీకి శాశ్వతమైన రాజధాని అవుతుంది. అని అంటున్నారు.
