అమరావతి స్పెషల్.. దేశంలోనే తొలి ఏఐ వర్సిటీ, ఎప్పుడంటే?
రాజధాని అమరావతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో నిర్ణయించారు.
By: Tupaki Political Desk | 30 Jan 2026 3:35 PM ISTరాజధాని అమరావతిని కేవలం పరిపాలన రాజధానిగానే కాకుండా, నాలెడ్జ్ అండ్ టెక్నాలజీ హబ్ గా మార్చడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోంది. ఇందుకోసం దేశంలోనే తొలిసారిగా అమరావతిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) యూనివర్సిటీని ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రానికి చెందిన యువతను ఏఐ నిపుణులుగా తీర్చిదిద్దడంతోపాటు హై-పెయిడ్ ఉద్యోగాలను సృష్టించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారు. ఇప్పటికే అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాజధాని పరిధిలో 50 ఎకరాల్లో క్వాంటం కంప్యూటర్ ను వేగంగా నిర్మిస్తున్నారు. దీనికి తోడుగా ఏఐ వర్సిటీని వచ్చేనెల 19న ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రాజధాని అమరావతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో నిర్ణయించారు. ఈ దిశగా ప్రణాళికలను రూపొందించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా అమరావతి అనగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ఫురణకు వచ్చేలా అమరావతి పేరులోని తొలి అక్షరం ఏ చివరి అక్షరం ఐ కలిపి ఏఐ లోగో తయారు చేయాలని సీఎం ఆదేశించారు. రాజధానిలో ఎటుచూసినా సాంకేతికత ఉట్టిపడేలా నిర్మాణాలు ఉండాలని భావిస్తున్న సీఎం చంద్రబాబు ఆ దిశగా సక్సెస్ అవుతున్నారని అంటున్నారు.
అమరావతిని టెక్ హబ్ గా తీర్చిదిద్దే క్రమంలో దేశంలోనే తొలి ఏఐ వర్సిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్విడియా అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫిబ్రవరి 19న ఈ వర్సిటీ ప్రారంభానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎన్విడియాతో జరిగిన ఒప్పందం మేరకు వచ్చే రెండేళ్లలో రాష్ట్రానికి చెందిన పది వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఏఐ, మెషిన్ లెర్నింగ్ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. అంతేకాకుండా అమరావతి ఏఐ వర్సిటీ ద్వారా రాష్ట్రంలో స్టార్టప్స్ కు సహకారం అందించనున్నారని చెబుతున్నారు.
ప్రస్తుతం ఏఐ విప్లవం ప్రపంచాన్ని ఉపేస్తుంది. అగ్రరాజ్యం అమెరికా తర్వాత ఎక్కువ మంది ఏఐ లిటరేచర్లు మన దేశంలోనే ఉన్నారని చెబుతున్నారు. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ప్రకారం ఏఐ వర్సిటీ ద్వారా ఒక విద్యాసంస్థను స్థాపించడం మాత్రమే కాదని అంటున్నారు. ఇది ఒక "డీప్-టెక్ వ్యూహం"గా చెబుతున్నారు. గతంలో హైదరాబాద్‌ను ఐటీ హబ్‌గా మార్చిన అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు ఇప్పుడు అమరావతిని "గ్లోబల్ డిజిటల్ క్యాపిటల్"గా తీర్చిదిద్దే లక్ష్యం పెట్టుకున్నారని, ఈ ప్రయాణంలో తొలి అడుగు ఏఐ వర్సిటీతో వేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు.
రాబోయే దశాబ్దాల్లో గ్లోబల్ ఎకానమీ ఏఐ చుట్టూ తిరుగుతుందని అంటున్నారు. ఈ కారణంగానే రాష్ట్రాన్ని కేవలం సర్వీస్ ప్రొవైడర్‌గా కాకుండా, ఏఐ సాంకేతికతను సృష్టించే స్థాయికి చేర్చాలన్న వ్యూహంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రతి కుటుంబం నుండి ఒక ఏఐ నిపుణుడు ఉండాలనే నినాదంతో మధ్యతరగతి ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రణాళిక రచిస్తున్నారని అంటున్నారు.
