Begin typing your search above and press return to search.

లాభాల ఆశకు పోయి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మాజీ ఐపీఎస్ సూసైడ్

మరక మంచిదే అన్నట్లు మనిషికి ఉండే ‘ఆశ’ అతన్ని ముందుకు తీసుకెళ్లేలా చేస్తుంది. అయితే.. ఆశకు దురాశకు మధ్య ఒక్క అక్షరం తేడా ఉన్నట్లు సన్నటి గీత ఒకటి ఉంటుంది.

By:  Garuda Media   |   23 Dec 2025 10:23 AM IST
లాభాల ఆశకు పోయి సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మాజీ ఐపీఎస్ సూసైడ్
X

మరక మంచిదే అన్నట్లు మనిషికి ఉండే ‘ఆశ’ అతన్ని ముందుకు తీసుకెళ్లేలా చేస్తుంది. అయితే.. ఆశకు దురాశకు మధ్య ఒక్క అక్షరం తేడా ఉన్నట్లు సన్నటి గీత ఒకటి ఉంటుంది. దాన్ని గుర్తించే విషయంలో తప్పు దొర్లితే అందుకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది. అయితే.. చాలామంది డబ్బు సంపాదన మత్తులో పడి విలువల్ని కోల్పోవటం.. అవసరానికి మించిన ఒత్తిడిని కొని తెచ్చుకోవటం లాంటివి చేస్తుంటారు. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవకు చెందిందే.

ఒక మాజీ ఐపీఎస్ అధికారి.. అత్యున్నత బాధ్యతల్ని నిర్వహించి.. డబ్బు సంపాదించాలన్న ఆశ కాస్తా దురాశగా మారి.. ముక్కు ముఖం తెలియని వారికి చిక్కి కోట్లాది రూపాయిలు పోగొట్టుకోవటం.. దీన్నో అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకున్న విషాద ఉదంతం పంజాబ్ లో చోటు చేసుకుంది. గతంలో పంజాబ్ ఇన్ స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పని చేసిన అమర్ సింగ్ అవమానకర పరిస్థితుల్లో చిక్కుకున్న వైనంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు.

డీబీఎస్ బ్యాంక్ సీఈవోగా.. ఇతర అధికారులుగా తమను తాము పరిచయం చేసుకొని సంపద నిర్వాహణ సలహాదారులుగా ఈ మాజీ ఐపీఎస్ అధికారిని నమ్మించారు. వాట్సప్.. టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా ఆకర్షించిన వారు.. సులువైన పద్దతిలో అధిక ఆదాయాన్ని సంపాదించే తీరును వివరించారు. ఇందులో భాగంగా స్టాక్స్ ట్రేడింగ్.. ఐపీవో కేటాయింపులు.. ఓటీసీ ట్రేడ్ లాంటి విధానాల్లో అధిక రిటర్నులు ఆశ జూపారు.

ఈ సైబర్ మోసగాళ్ల మాటల్ని నమ్మిన అమర్ సింగ్ భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆయన పెట్టుబడులకు భారీగా లాభాలు వచ్చినట్లుగా నకిలీ డాష్ బోర్డు ద్వారా చూపారు. దీంతో అదంతా నిజమని నమ్మిన ఆయన మరిన్ని పెట్టుబడులను పెట్టారు. తనకు వచ్చిన లాభాల్ని వెనక్కి తీసుకునే క్రమంలో సర్వీసు ఛార్జి.. పన్నులు పేరుతో మరింత భారీ మొత్తాల్ని చెల్లించారు. మొత్తంగా రూ.8.10 కోట్లు పెట్టుబడి పెట్టిన ఆయన తాను మోసపోయిన విషయాన్ని గుర్తించారు. దీంతో తీవ్ర అవమానానికి గురయ్యారు.

పోలీసు అధికారి అయి ఉండి.. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడటాన్ని ఆయన అవమానంగా భావించారు. దీంతో తన వద్ద పని చేసే సెక్యూరిటీ గార్డుకు చెందిన రైఫిల్ తో తనను తాను కాల్చుకొన్నారు. దీనికి ముందు పంజాబ్ డీజీపీకి పన్నెండు పేజీల సుదీర్ఘ లేఖ రాసి.. తాను మోసపోయిన విధానాన్ని అందులో వివరించారు. నేరస్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.