ఆముదాలవలసలో వైసీపీ వర్సెస్ వైసీపీ.. !
శ్రీకాకుళం జిల్లాలోని కీలక నియోజకవర్గం ఆముదాల వలసలో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయాలు ఇప్పుడు యూటర్న్ తీసుకుని వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్గుగా మారిపోయాయి.
By: Garuda Media | 19 Sept 2026 8:00 PM ISTశ్రీకాకుళం జిల్లాలోని కీలక నియోజకవర్గం ఆముదాల వలసలో వైసీపీ వర్సెస్ టీడీపీ రాజకీయాలు ఇప్పుడు యూటర్న్ తీసుకుని వైసీపీ వర్సెస్ వైసీపీ అన్నట్గుగా మారిపోయాయి. జిల్లా నాయకత్వంపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. సీనియర్ నేత, మాజీ మంత్రులు ధర్మాన బ్రదర్స్ తీరుపై నాగ్ మండిపడ్డారు. ఈ ప్రభావం త్వరలోనే జరగనున్న స్థానిక పోరుపై తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ తమ్మినేని కుటుంబంపై చేసిన వ్యాఖ్యలను చిరంజీవి నాగ్ తీవ్రంగా వ్యతిరేకించారు. ధర్మాన కృష్ణదాస్, ధర్మాన ప్రసాదరావు లాంటి సీనియర్ నేతలు వేదికపై ఉండి కూడా ఆ వ్యాఖ్యలను ఖండించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. అనంతరం ''వైసీపీకి ఒక్క సీటూ రాదు'' అంటూ.. తీవ్రంగా విమర్శించారు. పార్టీలో పరిస్థితులు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ తుడిచి పెట్టుకుపోతుందన్నారు.
ఈ వ్యాఖ్యల తో శ్రీకాకుళం వైసీపీలో తమ్మినేని, ధర్మాన వర్గాల మధ్య ఉన్న అంతర్గత విభేదాలు, వర్గపోరు మరోసారి బహిర్గతమయ్యాయి. పైగా తన కుమారుడు చేసిన వ్యాఖ్యలను తమ్మినేని ఖండించక పోగా.. మౌనంగా ఉన్నారు. ఇది మరింతగా పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇప్పటికే వైసీపీ స్థానిక ఇన్‌చార్జ్‌లు, నాయకులపై పోలీస్ కేసులు నమోదు చేయడంతో వారు కూడా మౌనంగా ఉన్నారు. పెద్ద నేతలు.. అంతర్గత వివాదాలతో వ్యవహరిస్తుంటే.. క్షేత్రస్థాయి నాయకులు కేసులకు భయ పడి ముందుకు రాలేని పరిస్థితి నెలకొంది.
మరోవైపు.. ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే కూన రవి కుమార్ విప్‌గా ఉండడంతోపాటు.. పార్టీలో కీలక రోల్ పోషిస్తున్నారు. ప్రజలను కలుస్తూ.. స్థానిక ఎన్నికలకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. అదేసమయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన వైఫల్యాలను, అవినీతిని ఎండగడుతున్నారు. అభివృద్ధి - మౌలిక వసతుల కు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆమదాలవలస–శ్రీకాకుళం రహదారులను నిర్మిస్తున్నారు.
గత ఎన్నికల్లో కూన రవికుమార్ భారీ ఆధిక్యంతో విజయం సాధించిన నేపథ్యంలో తన హవాను మరింత పెంచుకునేందుకు స్థానిక సమరాన్ని ఆయన కీలకంగా భావిస్తున్నారు. ఈయన వ్యూహాలకు.. వైసీపీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు కలిసి వస్తున్నాయి. దీంతో ఆముదాల వలసలో టీడీపీ కూటమి ఏకపక్షంగా విజయం దక్కించుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అంటున్నారు పరిశీలకులు.
