దత్తన్న 20 ఏళ్ల సంబరం: ఏంటీ 'అలయ్.. బలయ్'!
అలయ్-బలయ్ అనేది ఉర్దూ మాండలికానికి చెందిన జంట పదాలు. కలిసి-కలివిడి అనే పదానికి సమానార్ధం.
By: Garuda Media | 3 Oct 2025 8:34 PM IST`అలయ్.. బలయ్` తెలంగాణ సమాజానికి ఈ పేరు కొత్తకాదు. భారీ సంబరాలు నిర్వహించుకోవడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. అయితే.. ఒకసారికాదు.. రెండు సార్లు కాదు.. ఏకంగా 20 ఏళ్లుగా అలయ్-బలయ్ నిర్వహిస్తూ.. తనకంటూ ప్రత్యేకత ను చాటుకుంటున్నారు బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఉరఫ్ దత్తన్న. తాజాగా శుక్రవారం కూడా ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. దీనికి అన్ని వర్గాలకు చెందిన ప్రముఖులను ఆయన ఆహ్వానిం చారు. అంతేకాదు.. తొలిసారి ఆయన తన కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో దీనిని నిర్వహించడం గమనార్హం.
ఏంటీ అలయ్-బలయ్!
అలయ్-బలయ్ అనేది ఉర్దూ మాండలికానికి చెందిన జంట పదాలు. కలిసి-కలివిడి అనే పదానికి సమానార్ధం. 2005 నుంచి దత్తన్న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అప్పట్లోతెలంగాణ రాష్ట్రం కోసం నాయకులు విడిపోయి.. వేర్వేరుగా నినాదాలు చేసుకుంటూ.. పెద్ద ఎత్తున ఉద్యమించుకునేందుకు సిద్ధపడుతున్నారు. దీంతో వారంతా కలసిమెలిసి ఉండాలని.. కలివిడిగానే ఉండి విడివిడిగా రాష్ట్రాలు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని దత్తాత్రేయ కోరుకున్నారు. అప్పట్లో ఆయన సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నారు. అయితే.. ఆయన చెప్పినా.. ఎవరూ వినలేదు. ఈ క్రమంలోనే ఆయన అలయ్-బలయ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అన్ని పార్టీలకూ చెందిన నాయకులు, మేధావులను కూడా ఆహ్వానించారు.
తద్వారా అందరూ ఒకే గొడుగు కిందకు చేరి.. సమస్యలను ప్రస్తావించుకుని చర్చించుకోవడంతోపాటు.. వాటికి తగిన పరిష్కారా లు కూడా కనుకొనేందుకు అవకాశం ఉంటుందని భావించారు. అలా ప్రారంభమైన ఈ కార్యక్రమం నిర్విరామంగా నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రతి ఏటా దసరా పండుగ మర్నాడు నిర్వహించే ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నుంచి ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. గతంలో హరియాణ గవర్నర్‌గా ఉన్న సమయంలో లీవు పెట్టుకుని వచ్చి మరీ ఈకార్యక్రమాన్ని నిర్వహించి న ఘనత దత్తన్నకే దక్కుతుంది. తాజాగా జరిగిన కార్యక్రమానికి కూడా ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖు లు హాజరయ్యారు.
వీరిలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వంటివారితోపా టు.. సినీ రంగానికి చెందిన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, అక్కినేని నాగార్జున సహా పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారంతా దత్తన్న చేస్తున్న కార్యక్రమాన్ని ప్రశంసించారు. అందరూ కలిసి మెలిసి ఉండాలన్న స్ఫూర్తితో నిర్వహిస్తున్న కార్యక్ర మం ఎంతో ముదావహమని పేర్కొన్నారు. ఇదిలావుంటే.. దత్తన్న కుమార్తె విజయలక్ష్మి.. త్వరలోనేరాజకీయాల్లోకి రానున్న ట్టు పలువురు గుసగుసలాడడం వినిపించింది. బీజేపీలో ఉన్న గ్యాప్‌ను ఆమె ఫిల్ చేస్తారని పలువురు వ్యాఖ్యానించారు.
