ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీకి... అల్లూరికి లింక్ ఏంటి ?
అల్లూరి సీతారామరాజు విప్లవ వీరుడు. విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గం పద్మనాభం మండలం పాండ్రంగిలో తన అమ్మమ్మ గారి ఇంట్లో 1897 జూలై 4న ఆయన జన్మించారు.
By: Satya P | 5 July 2026 7:41 AM ISTఅల్లూరి సీతారామరాజు విప్లవ వీరుడు. విశాఖ జిల్లా భీమిలీ నియోజకవర్గం పద్మనాభం మండలం పాండ్రంగిలో తన అమ్మమ్మ గారి ఇంట్లో 1897 జూలై 4న ఆయన జన్మించారు. ఆయన తండ్రి తరఫున వారిది పశ్చిమ గోదావరి జిల్లా. అయితే అల్లూరి చిన్నతనంలోనే తండ్రి మరణించడంతో అమ్మమ్మ గారింటికి వచ్చి అక్కడే చదువుకున్నారు. అలా విశాఖ ఏవీఎన్ కాలేజీలో హైస్కూల్ విద్యార్ధిగా అల్లూరి తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఇక యోగిగా మారుదామన్నది అల్లూరి కోరిక. అందుకే ఆయన గిరిజన ప్రాంతం అయిన పాడేరు పరిసరాలకు వెళ్ళి ధ్యాన దీక్షలో ఎక్కువ గడిపేవారు. సరిగ్గా అప్పుడే ఆయనకు గిరిజనులు పడుతున్న కష్టాలు అన్నీ నేరుగా తెలిసాయి. దాంతో వారిని బ్రిటిష్ వారు మోసగిస్తున్న తీరు అరాచకాలతో అణచివేస్తున విధానం మీద ఆగ్రహించి వారి పక్షాన నిలిచి పోరు బాట పట్టారు. గిరిజనుల వద్దనే అల్లూరి విలు విద్యను నేర్చారు. ఆ తూటాలతోనే ఆయన తెల్లవారిని గడగడలాడించారు. మూడేళ్ళ పాటు ఆయన సాగించిన పోరాటంలో చివరికి అసువులు బాసారు.
అల్లూరి కధ అంటే ఇష్టం :
ఇక సినీ రంగంలో టాప్ హీరోగా వెలుగొందుతున్న ఎన్టీఆర్ కి అల్లూరి జీవిత చరిత్ర అంటే ఇష్టం. దానిని సినిమాగా తీయాలని ఆయన 1954 లోనే నిర్ణయించుకుని పాటలను కూడా రికార్డు చేయించారు. నటీనటుల ఎంపిక కూడా జరిగింది. అయితే సినిమాగా తీసేందుకు కొన్ని ఎలిమెంట్స్ లేవు అన్న కారణంతో వాయిదా వేశారు, కానీ ఎప్పటికైనా తీయాలన్నది ఎన్టీఆర్ పట్టుదల. ఈ లోగా దానిని సూపర్ స్టార్ క్రిష్ణ 1974లో తీసి రిలీజ్ చేశారు. అలా అల్లూరి సీతారామరాజు వెండి తెర మీద మెరిసింది. ఇక ఎన్టీఆర్ కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది.
సర్దార్ పాపారాయుడు టైం లో :
ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దాసరి నారాయణరావు కాంబినేషన్ లో సర్దార్ పాపారాయుడు 1980 ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది. ఆ సమయంలో షూటింగ్ గ్యాప్ లో ఎన్టీఆర్ తన మనసులోని కోరికను దాసరితో వ్యక్తం చేశారు. ఎన్నో పాత్రలు పోషించిన తాను అల్లూరి పాత్ర చేయలేక పోయాను అని ఎన్టీఆర్ చెప్పడంతో దానిదేముంది సార్ మన సినిమాలో ఆ పాత్ర పెడతామని దాసరి చెప్పడమే కాదు పాపారాయుడుకి ప్రేరణగా నిలిచే విధంగా అల్లూరి బుర్రకధను జోడించారు. ఆ సందర్భంగా వచ్చే పాత్రలో ఎన్టీఅర్ నిండైన విగ్రహంతో అల్లూరి గా కనిపించి అభిమానులను కనువిందు చేశారు.
జనం గుండెల్లో నిలవాలని :
ఇక ఇదే సందర్భంలో ఎన్టీఆర్ అల్లూరిని జనాలు ఈ రోజుకీ గుర్తు పెట్టుకుంటున్నారు, మనం కూడా జనం గుండెలలో శాశ్వతంగా నిలిచిపోవాలని దాసరి వద్ద అభిప్రాయం వ్యక్తం చేశారుట. దానికి ప్రజాసేవ ఉత్తమ మార్గం అని ఎన్టీఆర్ తలవడమే కాదు అక్కడ ఉన్న వారితో చెప్పారుట. ఆ సమయంలో షూటింగ్ స్పాట్ కి వచ్చిన పాత్రికేయులతో ఎన్టీఆర్ మాట్లాడుతూ ఇక మీదట నెలలో సగం రోజులు సినిమాలు సగం రోజులు ప్రజా సేవకు అని ఒక సంచలన స్టేట్మెంట్ ఇచ్చారు. అది కాస్తా ఆనాటి ఉమ్మడి ఏపీలో తీవ్రమైన రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఆ తరువాత కొన్నాళ్ళకే ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఆ విధంగా ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి అడుగు పెట్టడానికి అల్లూరి ఒక స్పూర్తిగా ప్రేరణగా నిలిచారు అని ఆనాటి సినీ ముచ్చట్లను అక్షర బద్ధం చేసిన వారు చెబుతారు. మొత్తానికి అల్లూరి విప్లవ వీరుడిగా జనం గుండెలలో కొలువు ఉంటే తెలుగు వారి వెలుగుగా ఎన్టీఆర్ అంతే కీర్తిని దక్కించుకోవడం విశేషం.
