కాంట్రాక్టర్ నిర్లక్ష్యమేనా..? అనంతగిరి ఏజెన్సీలో ఐదుగురు బలి: జిలెటిన్ స్టిక్స్ పేలుడులో దిగ్భ్రాంతికర నిజాలు!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మైనింగ్ లేదా రోడ్డు నిర్మాణ పనుల్లో బ్లాస్టింగ్ చేపట్టేటప్పుడు కొన్ని కఠినమైన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాల్సివుందని అంటున్నారు.
By: Tupaki Political Desk | 24 Oct 2026 5:08 PM ISTఅల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట సమీపంలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కొండను తొలగించడానికి అమర్చిన జిలెటిన్ స్టిక్స్ అకస్మాత్తుగా పేలడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఒక టీచర్ తోపాటు డ్రైవర్, కార్మికులు ఉన్నారు. రెండు వాహనాలు పూర్తిగా దహనమయ్యాయి. ఏజెన్సీలో పేలుడు సంభవించిందనే వార్తలు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేశాయి. ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో ఆకస్మాత్తుగా జిలెటిన్ స్టిక్స్ పేలాయన్న వార్తలు కలకలం రేపాయి. అయితే రోడ్డు నిర్మాణానికి సంబంధించి కొండ రాళ్లు తొలగించడానికి జిలెటిన్ స్టిక్స్ వాడారని తెలుసుకుని అధికార వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయినప్పటికీ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తమవుతోంది. ఘటనకు కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యంతోపాటు అధికార వర్గాలు, పోలీసుల పర్యవేక్షణ కొరవడటం కూడా కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి.
భద్రతాలోపంపై ఆగ్రహం
పేలుడు పదార్థాలు వాడాల్సిన అవసరం ఉన్నప్పుడు అధికారులు, కాంట్రాక్టు సంస్థ పూర్తిస్థాయిలో భద్రతా చర్యలు తీసుకోవాల్సివుందని అంటున్నారు. అయితే పినకోట సంఘటన స్థలంలో భద్రతా లోపాల వల్లే ప్రమాదం సంభవించినట్లుగా అనుమానిస్తున్నారు. రహదారుల నిర్మాణం, కొండల తొలగింపు వంటి అత్యంత ప్రమాదకరమైన పనులలో బ్లాస్టింగ్ పదార్థాలను వాడేటప్పుడు నిపుణుల పర్యవేక్షణలో, పకడ్బందీ భద్రతా ప్రమాణాలు పాటించాల్సివుందని అంటున్నారు. పినకోట వద్ద జరిగిన ఘటనలో ఆ కనీస జాగ్రత్తలు కూడా పాటించలేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు చెబుతున్నారు. బ్లాస్టింగ్ పనులు జరుగుతున్నప్పుడు ఆ మార్గంలో ఎవరూ రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాల్సివుందని అంటున్నారు. అదేవిధంగా ట్రాఫిక్‌ను నిలిపిత, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం ప్రాథమిక చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇవేవీ చేయకపోవడం వల్లే రహదారిలో ప్రయాణిస్తున్న ఉపాధ్యాయురాలు సునీతతోపాటు మరికొందరు అమాయకులు మృత్యువలయంలో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్లక్ష్యానికి భారీ మూల్యం
నిబంధనల ప్రకారం కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారా లేదా అని పరిశీలించాల్సిన స్థానిక యంత్రాంగం, సంబంధిత శాఖాధికారుల పర్యవేక్షణ లోపంపైనా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం జరిగిన తర్వాత ఎటువంటి చర్యలు తీసుకున్నా ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా తనిఖీలు, జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఐదుగురు ప్రాణాలు బలి అయ్యేవి కావని వ్యాఖ్యానిస్తున్నారు. జిలెటిన్ స్టిక్స్, డైనమైట్ వంటి పేలుడు పదార్థాలు క్షణంలో సర్వనాశనం చేస్తాయని, అలాంటి తీవ్రమైన ప్రమాదకర పదార్థాలు వాడేటప్పుడు చిన్న ఏమరుపాటు ప్రదర్శించినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని అంటున్నారు. పినకోట ప్రమాదంలో పేలుడు తీవ్రతకు టిప్పర్ లారీ గాల్లోకి ఎగిరిపడి నుజ్జునుజ్జయిందంటే, ఆ వాహనంలో జిలెటిన్ స్టిక్స్ భారీగా ఉన్నట్లుగానే అనుమానిస్తున్నారు. ఒకేసారి భారీ సంఖ్యలో జిలెటిన్ స్టిక్స్ తరలించడం కూడా నిబంధనలకు విరుద్ధమని అంటున్నారు. ప్రమాదం ఏజెన్సీలో పెద్దగా ట్రాఫిక్ లేని ప్రాంతంలో జరిగిందని, అదే కాస్త రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో సంభవిస్తే ప్రమాద తీవ్రత, జరగబోయే నష్టం ఊహకే అందడం లేదని అంటున్నారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయి..
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మైనింగ్ లేదా రోడ్డు నిర్మాణ పనుల్లో బ్లాస్టింగ్ చేపట్టేటప్పుడు కొన్ని కఠినమైన మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాల్సివుందని అంటున్నారు. పేలుడు పదార్థాలను కొనుగోలు చేయడానికి, నిల్వ చేయడానికి 'పెట్రోలియం అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ సేఫ్టీ ఆర్గనైజేషన్' నుంచి కచ్చితమైన అనుమతి ఉండాలని అంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా గృహాలు లేదా జనసంచారం ఉండే ప్రాంతాలకు సమీపంలో వీటిని నిల్వ చేయడం చట్టరీత్యా నేరమని అంటున్నారు. సర్టిఫైడ్ బ్లాస్టర్ ఆధ్వర్యంలో మాత్రమే పేలుడు పదార్థాలను అమర్చాలి. బ్లాస్టింగ్ జరిగే ప్రాంతానికి చుట్టూ కనీస దూరంలో ఎటువంటి రాకపోకలు లేకుండా హెచ్చరిక బోర్డులు, రెడ్ ఫ్లాగ్‌లు, సైరన్లు ఏర్పాటు చేయాలి. ప్రజలు, వాహనాలు ఆ దారిలోకి రాకుండా బలమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేయాలి. రద్దీ సమయాల్లో కాకుండా, ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగని ప్రత్యేక సమయాల్లో మాత్రమే అధికారులు, పోలీసుల అనుమతితో బ్లాస్టింగ్ నిర్వహించాలి.
కానీ, అల్లూరి జిల్లాలో పేలుడు జరిగిన ప్రాంతంలో ఇలాంటి భద్రతా నియమాలు ఏవీ పాటించిన దాఖలాలు లేవని అంటున్నారు. ఐదుగురు అమాయకుల ప్రాణాలు బలైపోవడానికి కారణమైన వారి నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించాలని డిమాండ్ వినిపిస్తోంది. ఈ ప్రమాదంపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకుంటే, భవిష్యత్తులో అయినా తప్పులు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు నడుచుకుంటారని అభిప్రాయపడుతున్నారు.
