Begin typing your search above and press return to search.

కొండలపై మరణ మృదంగం.. ప్రభుత్వం ఏం చేయాలి?

అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టూరిస్టు బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది.

By:  Tupaki Political Desk   |   12 Dec 2025 9:43 AM IST
కొండలపై మరణ మృదంగం.. ప్రభుత్వం ఏం చేయాలి?
X

అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ టూరిస్టు బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ సంఘటనలో 10 మంది యాత్రికులు అక్కడికక్కడే మరణించినట్లు ప్రాథమిక సమాచారం. చింతూరు-మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో రాజుగారిమెట్టు వద్ద ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సులో ఇద్దరు డ్రైవర్లు, 35 మంది టూరిస్టులు ఉన్నారు. దాదాపు 10 మంది మరణించారని మరో 20 మంది గాయపడ్డారని చెబుతున్నారు. సుమారు 100 అడుగుల లోతులో బస్సు పడిపోవడంతో ఎక్కువ ప్రాణ నష్టం సంభవించింది. సంఘటనా ప్రదేశంలో మృతులు, క్షతగాత్రులతో భీతావాహ వాతావరణం కనిపిస్తోంది. ఏజెన్సీలో తరచూ జరుగుతున్న ప్రమాదాలపై ప్రభుత్వం లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని తాజా ఘటన తర్వాత సూచనలు వస్తున్నాయి.

ఎత్తైన కొండపై ఘాటు రోడ్డు మలుపు వద్ద ప్రమాదం సంభవించింది. దట్టమైన మంచు కురుస్తుండటం, డ్రైవర్ స్థానికుడు కాకపోవడంతో రోడ్డును అంచనా వేయలేక ప్రమాదానికి గురైనట్లు భావిస్తున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారంతా 50 ఏళ్ల వయసు పైబడిన వారేనని అంటున్నారు. మృతులు అంతా చిత్తూరు ప్రాంతానికి చెందిన వారుగానే చెబుతున్నారు. చిత్తూరులోని మిట్టూరుకు చెందిన శ్రీ విఘ్నేశ్వర ట్రావెల్స్ కు చెందిన బస్సు ఈ నెల 6వ తేదీన రాత్రి తీర్థయాత్రల కోసం బయలుదేరారు.

గురువారం సాయంత్రం సింహాచలంలో దర్శనం పూర్తి చేసుకున్న యాత్రికులు భద్రాచలం వెళ్లేందుకు బయలుదేరారు. ఘాట్ రోడ్డు మీదుగా భద్రాచలం వెళ్లాలని భావించిన టూరిస్టులు మార్గమధ్యలోనే అరకులో కొంతసేపు గడిపారు. రాత్రికి అరకులో భోజనం పూర్తిచేసుకుని భద్రాచలం, ఆ తర్వాత శ్రీశైలం వెళ్లి యాత్ర ముగించాలని భావించినట్లు క్షతగాత్రులు తెలిపారు. అయితే మార్గమధ్యలోనే యాత్ర విషాదంగా మారింది. అర్ధరాత్రి, దట్టమైన మంచు కారణంగా ప్రమాదంలో చిక్కుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఘాట్ రోడ్డులో కొత్తవారు డ్రైవింగ్ చేయడం చాలా కష్టమని, చిత్తూరుకు చెందిన డ్రైవరుకు ఈ ప్రాంతంపై అవగాహన లేకపోవడం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అంటున్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే చింతూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి తక్షణ వైద్యం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని మోదీ కూడా మృతులకు సంతాపం ప్రకటించారు. కేంద్రం తరఫున మృతులకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల ఆర్థిక సాయం ప్రకటించారు.

ఘాట్ రోడ్డులో సంక్లిష్ట ప్రయాణాలు

విశాఖ ఏజెన్సీలో అరకు, పాడేరు, సీలేరు వంటి ప్రాంతాల్లో ప్రయాణమంటే ప్రాణాలతో చెలగాటమనే చెప్పాలి. ఏటా శీతాకాలం, మరీ ముఖ్యంగా డిసెంబరు నెలలో ఈ ప్రాంతాల్లో అనేక ప్రమాదాలు జరుగుతుంటాయి. టూరిస్టు ప్రాంతాలు కావడం వల్ల పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాలు త్వరగా పూర్తి చేయాలనే ఆత్రుత, అలసట కారణంగా ఎక్కువ మంది ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. చాలా సంక్లిష్టమైన ఈ ప్రాంతంలో స్థానికులకు అవగాహన లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. ఏజెన్సీ ప్రాంతంలో సాయంత్రం 4 గంటల నుంచే మంచు కురవడం మొదలవుతుంది. ఉదయం 9 గంటలకు కూడా మంచు పూర్తిగా తొలగదు. ఇలాంటి అందాలను వీక్షించడానికే ఈ ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వస్తుంటారు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా తమ పర్యటనలను త్వరగా ముగించాలనే ఉద్దేశంతో రాత్రిపూట ప్రయాణాలు చేస్తూ ప్రమాదాలకు లోనవుతున్నారు.

ఏం చేయాలి?

ఏటా డిసెంబరులో టూరిస్టులు ప్రమాదాలకు గురికావడం సర్వసాధారణమైందని అంటున్నారు. శీతాకాలంలో ఏజెన్సీ అందాలను వీక్షించేందుకు తరలివస్తున్న పర్యాటకులు.. అకారణంగా ప్రాణాలు కోల్పోవడానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం, కఠినమైన ఘాట్ రోడ్డులలో ప్రయాణాలను నియంత్రిస్తే కొంతవరకు ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చుననే అభిప్రాయం ఎక్కువవుతోంది. ఎక్కువగా టూరిస్టులే ప్రమాదాలలో చిక్కుకోవడం చూస్తే, దూరప్రాంతాల నుంచి వస్తున్న వాహనాల డ్రైవర్లకు ఈ ప్రాంతంపై అవగాహన లేకపోవడమే యాక్సిడెంట్లకు గురవుతున్నారని అంటున్నారు. ఈ ప్రమాదాలను అరికట్టాలంటే సాయంత్రం చీకటి పడిన తర్వాత, మంచు దట్టంగా కురిసే సమయంలో ప్రయాణాలను అనుమతించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ప్రధానంగా విశాఖ నుంచి అరకు, సీలేరు వంటి మార్గాలు పూర్తిగా ఘాట్ రోడ్లే. ఈ రోడ్డపై రాత్రిపూట ప్రయాణాలను నిషేధించాలని సూచనలు వస్తున్నాయి.